Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikarna: కౌరవుల్లో ఒకే ఒక్కడు.. ద్రౌపతి వస్త్రాపహరణ సమయంలో దుర్యోధనుడికి అడ్డు చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా

Mhabharata- Vikarna: మహాభారతం పంచమవేదంగా ప్రసిద్ధిగాంచింది. మనం ఆధునికత పేరుతో కేవలం మహాభారతాన్ని ఓ మత గ్రంధం గానో, దేవుడు పుస్తకంగానో చూస్తున్నాం. కానీ నిజానికి ఇప్పటి రోజులకీ సరిపడే సామాజిక జీవన శైలిని..

Vikarna:  కౌరవుల్లో ఒకే ఒక్కడు.. ద్రౌపతి వస్త్రాపహరణ సమయంలో దుర్యోధనుడికి అడ్డు చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా
Vikarna
Follow us
Surya Kala

|

Updated on: Aug 14, 2021 | 7:59 AM

Mhabharata-Vikarna: మహాభారతం పంచమవేదంగా ప్రసిద్ధిగాంచింది. మనం ఆధునికత పేరుతో కేవలం మహాభారతాన్ని ఓ మత గ్రంధం గానో, దేవుడు పుస్తకంగానో చూస్తున్నాం. కానీ నిజానికి ఇప్పటి రోజులకీ సరిపడే సామాజిక జీవన శైలిని ఎలా మలచుకోవాలో మనకు మహాభారతం చెప్తుంది. మహాభారతంలోని పాత్రలు మన నేటి జీవన విధానానికి సజీవ సాక్ష్యాలు. మహా భారతం మనకి మన దేశ చరిత్రని చెప్పటంతో పాటు జీవితంలో విజయం సాధించాలంటే ఎలా ఉండాలో కూడా చెబుతుంది. అయితే మహాభారతంలో ఉదాత్తమైన పాత్రల గురించి మాట్లాడుకోగానే కర్ణుడి ప్రస్తావన తప్పకుండా వస్తుంది. అయితే మహాభారతంలో మరో ఉదాత్తమైన వ్యక్తి వికర్ణుడు. ఇతని గురించి ఎవరైనా ఎప్పుడైనా విన్నారా..

అవును కర్ణుడి వ్యక్తిత్వానికి ఏమాత్రం తీసిపోని ఉదాత్తత వ్యక్తి వికర్ణుడు. ఇతను ఎవరో కాదు.. దృతరాష్ట్రుడు తనయులు నూరుగురు కౌరవులలో ఒక్కడు. అయితే అన్న అన్యాయం చేస్తుంటే ఎదిరించిన ధీరుడు.. దుర్యోధనుని తప్పుని ఎదిరించి నిలబడిన ఒకే ఒక్కడు. అయితే అన్నని ఎదిరించిన వికర్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల పక్షం వహించాడా అంటే అదీ లేదు. సోదరుని బంధానికి కట్టుబడి కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. ఆ వికర్ణుని ఉదాత్త వ్యక్తిత్వం.

వికర్ణుడు అందరు కౌరవుల్లానే హస్తినలో అల్లారుముద్దగా పెరిగాడు. సకల అస్త్ర విద్యలనూ ఔపోసన పట్టాడు. తన సోదరులతో కలిసి భీష్మ, ద్రోణ, కృపాచార్య వంటి అతిరథుల వద్ద యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. బహుశా అలా నూరుగురిలో ఒక్కరిగా వికర్ణుని కథ సాగిపోయేదేమో.. కానీ ద్రౌపదీ వస్త్రాపహరణం సమయానికి అతను వెలుగులో కనిపిస్తాడు. ఆ ఘట్టంలో… పాండవులను కపట జూదంలో ఓడించిన దుర్యోధనుడు అందుకు పణంగా ద్రౌపదిని ఈడ్చుకురమ్మని దుశ్శాసనుని పంపుతాడు. ఆ సందర్భంలో భీష్మ, ద్రోణ వంటి పెద్దలంతా తలవంచుకు ఉండిపోతే… వికర్ణుడు ఒక్కడే అలా చేయడం తప్పంటూ వారిస్తాడు. వారి చర్యల వల్ల కురువంశానికే మచ్చవస్తుందని హెచ్చరిస్తాడు. ఆ సమయంలో వికర్ణుడి నోరుమూయిస్తాడు కర్ణుడు.

ధర్మం పాండవుల పక్షాన ఉందని తెలిసినా, తాము ఓడిపోతామని ముందే గ్రహించినా… వికర్ణుడు తన అన్నను అనుసరించడానికే సిద్ధపడ్డాడు కురుకేత్ర యుద్ధంలో అన్న తరపున పాల్గొన్నాడు. అలాగని ఏదో తూతూమంత్రంగా యుద్ధం సాగించలేదు వికర్ణుడు. కురుక్షేత్ర సంగ్రామం నడిచిన ప్రతిరోజూ అతని ప్రతిభ మార్మోగుతూనే ఉండేది. వికర్ణుడు అద్భుతమైన విలుకాడు. విలువిద్యలో కర్ణుని తరువాత ఎన్నదగిన యోధుడు. అందుకే భగవద్గీత తొలి అధ్యాయమైన ‘అర్జున విషాదయోగం’లోని ఎనిమిదవ శ్లోకంలో వికర్ణుని ప్రస్తావన వస్తుంది. అందులో…

భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ ||

అని ద్రోణాచార్యులతో అంటాడు దుర్యోధనుడు. ఇందులో ద్రోణాచార్యలు, భీష్ముడు, కర్ణడు, వికర్ణుడు, కృపాచార్యడు, అశ్వత్థామ వంటి యోధులంతా తన సరసన ఉన్నారంటూ దుర్యోధనుడు గర్వపడటం కనిపిస్తుంది. వికర్ణుడు ఎంత గొప్పవాడైనా అతను కౌరవుల పక్షాన పోరాడుతున్నాడు కాబట్టి మృత్యువు తప్పలేదు. కురుక్షేత్ర సంగ్రామంలోని 14వ రోజున వికర్ణుడు భీముని ఎదుర్కొంటాడు. వారిరువురి మధ్యా జరిగిన భీకర యుద్ధంలో వికర్ణుడు ప్రాణాలను విడుస్తాడు. వికర్ణుని మృత్యువుకి భీముని మనసు సైతం భారమైపోయిందంటారు. అసలు ఒక కథనం ప్రకారమైతే భీముడు, వికర్ణునితో యుద్ధం చేసేందుకు ఇష్టపడడు. కానీ క్షాత్ర ధర్మం ప్రకారం పోరాడి తీరవలసిందే అంటూ అతడిని రెచ్చగోడతాడు వికర్ణుడు. అలా తుదివరకూ తను నమ్మిన ధర్మానికి కట్టుబడిన వీరుడు వికర్ణుడు. అందుకే ఇప్పుడిప్పుడే వికర్ణుని గురించిన గాథలు మళ్లీ ప్రచారంలోకి వస్తున్నాయి. ఇటీవలే వికర్ణుని వ్యక్తిత్వాన్ని గురించి తెలుగులో పుస్తకాలు కూడా ఉన్నాయి.

Also Read: Paper Chai Maker: న్యూస్ పేపర్ బౌల్స్‌తో టీ తయారు చేస్తున్న ఓ వ్యక్తి.. ఎక్కడ.. ఎలా అంటే..