Yogananda: భారతదేశపు అతి గొప్ప యోగుల మహాసమాధి.. ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న నిర్వాహకులు..

Paramahansa Yogananda: భారతదేశపు అతి గొప్ప సాధువులలో స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి, పరమహంస యోగానంద ఒకరు. ప్రపంచ వ్యాప్తంగా..

Yogananda: భారతదేశపు అతి గొప్ప యోగుల మహాసమాధి.. ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న నిర్వాహకులు..
Yogi
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 06, 2022 | 7:39 PM

Paramahansa Yogananda: భారతదేశపు అతి గొప్ప సాధువులలో స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి, పరమహంస యోగానంద ఒకరు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన ఈ ప్రముఖులిద్దరూ మార్చిలోనే మహాసహాధి అయ్యారు. వీరి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మార్చి నెలలో ప్రత్యేక కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. చిరస్థాయిగా నిలిచి ఉండే మహాగ్రంథమైన హోలీ సైన్స్ ను రచించిన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి 1936, మార్చి 9 న ఒరిస్సాలోని పూరీలో తన శరీరత్యాగం చేయగా, ప్రపంచ విఖ్యాతి పొందిన ఆయన శిష్యులు శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు మార్చి 7, 1952 లో కాలిఫోర్నియా లోని లాస్ ఏంజెలిస్ లో ఉన్న బిల్ట్ మోర్ హోటల్‌లో మహాసమాధి చెందారు. యోగానంద.. ముకుందుడు అనే పేరుతో యువకుడుగా ఉన్నప్పుడు శ్రీయుక్తేశ్వర్ గిరి గారి ఆశ్రమంలోకి వారి సంపూర్ణ మార్గదర్శకత్వంలోనికి ప్రవేశించారు. బెంగాల్ లోని శ్రీరాంపూర్‌లో శ్రీయుక్తేశ్వర్ గిరి గారి కఠినమూ, అదే సమయంలో ప్రేమతో కూడినదైన శిక్షణతో దైవం పట్ల ఆకాంక్ష కలిగిన ఈ యువశిష్యుడు సాటిలేని గురువుగా రూపాంతరం చెందారు. పశ్చిమ దేశాలకు యోగానంద ప్రయాణం, యోగ ధ్యానానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక పునరుజ్జీవన తరంగాలను ప్రసరింపజేసిన ఆయన చేసిన మార్గనిర్దేశక ప్రసంగాలు నేడు చరిత్రలో ఒక భాగమయ్యాయి.

యోగానంద మహాసమాధి(యోగి సచేతనంగా తన శరీరాన్ని వదిలే ప్రక్రియ)కి దారి తీసిన పరిస్థితులు చాలా ఆశ్చర్యంగా జరిగాయి. ఆయన తన దృఢమైన, ఉల్లాసకరమైన, ఉరుములాంటి స్వరంతో మంత్రముగ్ధులైన శ్రోతల ముందు, నాటి భారత రాయబారి డా. వినయరంజన్ సేన్ గౌరవార్థం ఇచ్చిన విందులో ఉపన్యాసం ఇస్తున్నారు. “ఎక్కడైతే గంగానది, అరణ్యాలు, హిమాలయ గుహలు, ఇంకా మానవులు భగవంతుణ్ణి గురించి కలలుకంటారో అటువంటి పవిత్రమైన మట్టిని తాకిన నా శరీరం పునీతమయ్యింది.’’ “మై ఇండియా(నా భారతదేశం)” అనే ఉత్సాహభరిత, ప్రేరణాపూర్వక కవిత నుండి ఈ మాటలు పలుకుతూ ఆయన నేల పైకి జారిపోయారు. అచేతనమైన ఆయన శరీరం చుట్టూ ఆయన శిష్యులు దయామాత(వీరు తరువాత సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్/ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్.) కు మూడవ అధ్యక్షులుగా ఉన్నారు), మిగిలిన శిష్యులంతా చేరారు.

ఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్ మార్చ్యూరి డైరెక్టర్ శ్రీ హ్యారి టి. రోవే భవిష్యత్ తరాల కోసం ఈ క్రింది మాటలు రికార్డ్ చేశారు. పరమహంస యోగానందగారి శరీరం “అద్భుత నిర్వికారస్థితిలో ఉన్నట్టు కనిపించింది.” జీవితంలోనూ, మరణంలోనూ కూడా యోగం, ధ్యానం వల్ల ప్రకృతి శక్తులపై మానవుడు ఆధిపత్యం సాధించవచ్చని ఆయన రుజువు చేశారు.

ప్రాచీన శాస్త్రీయ ధ్యాన పద్ధతి అయిన “క్రియాయోగం” యోగానందగారి బోధనలకు ప్రధాన ఇతివృత్తం. ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. క్రియాయోగ “దీక్ష తీసుకున్నవారు” అనివార్యమైన జనన మరణ చక్రాల నుండి విముక్తి కోసం క్రమం తప్పకుండా ఈ ప్రాచీన ప్రక్రియను సాధన చేస్తున్నారు. ఈ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ప్రాణశక్తిని అదుపులో ఉంచి, శక్తిని బాహ్యంగా, పంచేంద్రియాల వైపు కాకుండా; లోపలకి, వెనుబాము మరియు మెదడు వైపుకు మరలిస్తారు. భక్తిని, సరైన కార్యాచరణను, గురువు యొక్క మార్గదర్శకతను జోడించినపుడు ఈ “క్రియాయోగ” ప్రక్రియ విఫలం కాదు అని యోగానందగారు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సత్యాన్వేషకులు అభ్యర్థించి పొందగలిగిన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పాఠాలు “క్రియాయోగాన్ని,” ప్రాథమిక ధ్యాన ప్రక్రియల్ని ఎలా సాధన చేయాలో వాటి వివరాలు తెలియచేస్తాయి. అంతేకాక “జీవించడం ఎలా” అనే సూత్రాలను కూడా ఇవి బోధిస్తాయి.

యోగానందగారి ప్రపంచ ప్రఖ్యాత ”ఒక యోగి ఆత్మకథ” ముద్రించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ ఏడాది దాని స్మారకోత్సవం జరుపుకొంటున్నాము. యోగానందగారు ఈ ఉత్తేజకరమైన పుస్తకంలో వ్రాసిన చివరి వాక్యాలు “భగవంతుడు ఈ సన్యాసికి ఎంతో పెద్ద సంసారాన్ని ఇచ్చాడు!” నిజానికి దశాబ్దాలు గడిచేకొద్దీ యోగానందగారి అనుయాయుల సంఖ్య విశేషంగా పెరిగింది. ఈ పవిత్ర బోధనలను అనుసరించడం ద్వారా వారి జీవితాలు ఉద్ధరింపబడి ప్రోత్సాహకరమైన మార్పులు సంభవించాయి.

యోగానందగారి అధ్యాత్మిక జీవితాన్ని సానబెట్టిన శ్రీయుక్తేశ్వర్ గారు “ప్రేమావతార్” గా కీర్తింపబడే తన ప్రియతమ శిష్యుడి వారసత్వం కొనసాగుతున్న తీరును చూసి నిజంగా గర్వపడుతూ ఉండి ఉంటారు.

“మిగిలినవన్నీ ఆలస్యం చెయ్యవచ్చు గాక; కానీ మీ దైవాన్వేషణను మాత్రం ఆలస్యం చెయ్యడానికి వీలులేదు!”అన్న మాటలతో యోగానందగారు ప్రజలు సమయం వ్యర్థం చేయకుండా తమ జీవితాలనే తోటల నుండి కలుపు మొక్కలను పెరికివేసి జీవిత సర్వోత్కృష్ట లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని పిలుపునిచ్చారు. మరింత సమాచారం కోసం: yssofindia.org లో చూడవచ్చు.

Also read:

Allu Arjun: బన్నీతో ఛాన్స్‌ కొట్టేసిన డీజే టిల్లు బ్యూటీ.. అదిరిపోయిన ప్రోమో..