Medaram Jathara: మేడారం సమ్మక్క–సారక్క జాతరకు సమయం ఆసన్నమావడంతో ప్రభుత్వం పనుల్లో వేగం పెంచింది.. బుధవారం మేడారంను సందర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్ 2022 మహాజాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.. వనదేవలకు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చే భక్తులకు వసతుల్లో ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.. శాశ్వత ఏర్పాట్లు ప్రణాళికా బద్ధంగా చేపట్టాలని 32శాఖల అధికారులకు ఆదేశించారు..
ఒకవైపు కరోనా కలవర పెడుతుంది. మరోవైపు కోట్లాది మంది కోరికలు తీర్చే మేడారం మహా జాతరకు సమయం ఆసన్నమవుతుంది. ఈ నేపద్యంలో ప్రభుత్వం పనుల్లో వేగం పెంచింది. కాగా, బుధవారం మేడారం జాతర ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ , స్థానిక MLA సీతక్క, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సందర్శించారు. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం మహా జాతర నిర్వహించనున్నట్లు పూజారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు వసతుల కల్పన కోసం ప్రభుత్వం 75 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ఇప్పటికే 32 ప్రభుత్వశాఖలకు ఆ పనుల బాధ్యతలు అప్పగించారు.
జాతరకు సమయం దగ్గర పడుతుండడంతో మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక MLA సీతక్క, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పనులను పరిశీలించారు.. సమ్మక్క-సారక్క దేవతలను దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్న అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. జంపన్నవాగు వద్ద భక్తులకు ఏర్పాట్లు, స్నానఘట్టాలు, దుస్తుల మార్పిడి గదులు, ప్రమాదాలు సంభవించకుండా తీసుకుంటున్న చర్యలు, భక్తుల వసతి సౌకర్యాలపై మేడారం ప్రాంతమంతా తిరిగి పర్యవేక్షించారు. అనంతరం అక్కడ జరుగుతున్న పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ సమక్క – సారలమ్మ జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా భక్తులకు సకల సౌకర్యాలు కలిపించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జాతరలో ఏ ఒక్క లోటు లేకుండా అన్న ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చాక శాశ్వత ప్రాతిపాదికన బడ్జెట్ కేటాయించడం జరిగిందని అన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ వారి సేవలు చాలా ముఖ్యమని సూచించారు.. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి జాతరకు రావలసుందిగా ఇప్పటినుండే అవగాహన కల్పించాలని అన్నారు. గత జాతరలలో జరిగిన చిన్ని- చిన్న పొరపాట్లను గమనించి, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అవి పునరావృతం కాకుండా చూడాలన్నారు. జాతరకు వచ్చే ప్రజల సౌకర్యార్ధం తగిన విధంగా ఆర్టీసి నుంచి రవాణ సౌకర్యాలు కల్పించాలని అన్నారు. జనవరి మొదటి వారంలోగా పనులు పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
Also read:
Social Media: సోషల్ మీడియాలో మీ ఎకౌంట్ తీసేయాలని అనుకుంటున్నారా? ఇలా చేయండి..