Yadadri: అద్భుత ఆధ్యాత్మిక నగర రూపకల్పనకు చకచకా ఏర్పాట్లు.. యాదాద్రి భక్తులకోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మాణాలు

యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ.. యాదాద్రి ఆధ్యాత్మిక నగర రూపకల్పనకు ప్రణాళికలు రూపొందించింది. 12 భాగాలుగా అంచెల వారీగా నిర్మాణం కొనసాగుతుంది.

Yadadri: అద్భుత ఆధ్యాత్మిక నగర రూపకల్పనకు చకచకా ఏర్పాట్లు.. యాదాద్రి భక్తులకోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మాణాలు
Yadadri Temple Photo
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 19, 2021 | 2:04 PM

Yadadri – CM KCR: యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ.. యాదాద్రి ఆధ్యాత్మిక నగర రూపకల్పనకు ప్రణాళికలు రూపొందించింది. 12 భాగాలుగా అంచెల వారీగా నిర్మాణం కొనసాగుతుంది. భక్తులకు సకల సదుపాయాలు కల్పించేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో యాదాద్రి నిర్మాణం చేపట్టింది తెలంగాణ సర్కారు. మొత్తం ప్రాజెక్టు సుమారు వెయ్యి ఎకరాల్లో రూపొందుతోంది. టెంపుల్‌ సిటీలోని 850 ఎకరాలలో.. మొదటి దశలో 250 ఎకరాల్లో అన్ని రకాల సౌకర్యాలతో కాటేజీలు, ఉద్యానవనాలు, రోడ్లు రాబోతున్నాయి. గుట్ట దిగువన 14 ఎకరాల కొండను కొనుగోలు చేసి ప్రెసిడెన్షియల్‌ సూట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాతల విరాళాలతో వీవీఐపీల విడిది కోసం 14 విల్లాలు, ఒక ప్రెసిడెన్సియల్‌ సూట్‌ నిర్మిస్తున్నారు. యాత్రీకుల బస కోసం కొండ కిందే వసతుల ఏర్పాటు చేస్తు్న్నారు. పెద్దగుట్టపై 850 ఎకరాలు కొనుగోలు చేశారు. తొలి ధపాలో 250 ఎకరాలలో లే అవుట్‌ పనులు చేపట్టారు.

రెండవ దశలో ఆధునిక విల్లాలు, కళ్యాణమండపాలు, ఫుడ్‌కోర్ట్‌లు, సెంట్రల్‌ పార్క్‌లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, హెలీపాడ్‌, సోలార్‌ ఎనర్జీ పవర్‌ సెంటర్‌, ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియం.. ఇలా అనేక సదుపాయాలు కల్పించనున్నారు. దాదాపు 2000 కార్లు పార్కు చేసే విధంగా 30 ఎకరాల్లో మల్టీ లెవల్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. మరో 35 ఎకరాల్లో బస్‌ డిపో, పోలీస్‌, ఫైర్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌, ఫుడ్‌ కోర్టు ఏర్పాటు చేయనున్నారు.

తిరుమల మాదిరి ఆలయానికి సమీపంలో 25 ఎకరాల్లో పూలతోట, 50 ఎకరాల్లో కల్యాణమంటపం నిర్మిస్తారు. ఆలయం సకల విద్యలకు నిలయంగా మార్చేలా.. వేదపాఠశాల, శిల్పకళాశాలను నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమీపంలోని అటవీశాఖకు చెందిన అయిదు వందల ఎకరాల్లో నారసింహ అభయారణ్యం, జింకల పార్కు ఏర్పాటు చేస్తారు. ఆలయ నగరితో పాటు యాదగిరి గుట్ట సమీపంలోని భువనగిరి కోట, కొలనుపాక జైన దేవాలయంను కలుపుతూ టూరిస్ట్‌ సర్క్యూట్‌ డెవలప్‌ చేసే ప్రతిపాదన కూడా ఉంది.

గిరి ప్రదక్షిణ కోసం గుట్ట చుట్టూ 8 మీటర్ల వెడల్పుతో రెండున్నర కిలోమీటర్ల మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. యాదగిరిగుట్ట కిందనే వాహనాలను నిలిపివేస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక వైటీడీఏ వాహనాల్లో భక్తులను గుట్టపైకి చేర్చుతారు. ఇందుకోసం బ్యాటరీ వెహికిల్స్‌ మాత్రమే ఉపయోగించనున్నారు. గుట్ట కింద, గుట్ట పైన, మొత్తం రెండు క్యూ కాంప్లెక్స్‌లు నిర్మిస్తారు. గుట్ట పైనుండే క్యూ కాంప్లెక్స్‌లో ఎనిమిది హాల్స్‌ ఉంటాయి. ఒక్కో హాల్‌లో 600 మంది వేచి ఉండొచ్చు. తిరుమల మాదిరే క్యూ కాంప్లెక్స్‌లో వేచి వుండే భ‌క్తుల‌కు స్నాక్స్‌, మంచినీళ్లు అందిస్తారు. కొండపై ఆధ్యాత్మిక వాతావరణం మాత్రమే కనిపించేలా.. ఆలయాలు, ప్రసాదాల తయారీ, విక్రయాశాల సముదాయం మాత్రమే ఉంటాయి.

హైదరాబాద్‌ నుంచి ఆలయానికి భక్తులు సులువుగా చేరుకునేలా.. రోడ్డు్, రైలు కనెక్టివిటీ పెంచనుంది ప్రభుత్వం. ఆరు వరుసల రహదారితో యాదగిరిగుట్టను అనుసంధానిస్తున్నార. హైదరాబాద్‌ నుంచి రాయగిరి వరకూ ఎంఎంటీఎస్‌ రైల్వే సర్వీసును నడపనున్నారు. భవిష్యత్‌లో మెట్రో రైలును సైతం యాదాద్రి వరకు నడిపే ప్రయత్నంచేస్తున్నారు. కొండ కింద రెండు హెలీప్యాడ్‌లను నిర్మించబోతున్నారు. చాలా తక్కువ సమయంలో ఇంతటి అద్భుత నిర్మాణాలను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం యాదగిరి గుట్టను భారతదేశంలోనే అద్భుతమ్కెన ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది.

Read also: Accident: టైర్ పేలి బైక్ పై వెళ్తున్న నలుగురు యువకులపైకి దూసుకెళ్లిన కారు..