విరిగిన యాగంటి బసవన్న ఆలయంలోని రాతి దూలం.. ఆందోళనల్లో భక్తులు.. పరిశీలించిన ఆర్కియాలజిస్టులు
యాగంటి నంది అంతకంతకూ పెరుగుతోంది. రాతిదూలం విరిగి పడింది. కలియుగాంతమునా యాగంటి బసవన్న పైకిలేచి రంకేవేస్తాడని...కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు. తాజాగా బసవన్న మండపంలో రాతిదూలం విరగడంపై భక్తులు భయాందోళనకు
Yaganti Basavanna Temple: యాగంటి నంది అంతకంతకూ పెరుగుతోంది. రాతిదూలం విరిగి పడింది. కలియుగాంతమునా యాగంటి బసవన్న పైకిలేచి రంకేవేస్తాడని…కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు. తాజాగా బసవన్న మండపంలో రాతిదూలం విరగడంపై భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.దీనిపై ఆర్కియాలజిస్టులు అధ్యయనం చేస్తున్నారు.
కర్నూలుజిల్లా యాగంటి క్షేత్రంలోని బసవన్న మండలంలో ఇటీవల రాతిదూలం విరిగిపడింది. అంతేకాదు పలుచోట్ల ఆలయ గోడలు బీటలు వారాయి. ఆలయ భద్రతోపాటు…రాతిదూలం విరిగిపడటానికి గల కారణాలను విశ్లేషించేందుకు అమరావతి నుండి ఏపీ ఆర్కియాలాజీ సర్వే ఆఫ్ ఇండియా విభాగానికి చెందిన ఉన్నతాధికారులు యాగంటికి వచ్చారు.
యాగంటి పుణ్యక్షేత్రం పురావస్తు శాఖ పరిధిలో ఉంది.. దాంతో ఆ శాఖకు చెందిన అధికారులు ఆలయ భద్రతపై అధ్యయనం చేసేందుకు వచ్చినట్టు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. గోడలకు పగుళ్లు, రాతిదూలంతోపాటు సమీపంలోని వెంకటేశ్వర స్వామి గృహాల్లో పైకప్పు పెచ్చులూడి పడటంపై ఆర్కియాలజీ టీమ్ అధ్యయనం చేసింది. ఆలయ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై దేవాదాయశాఖ అధికారులతో చర్చించారు. ఆలయ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి రిపోర్టు అందజేస్తామని అధికారులు చెప్పారు.
శైవక్షేత్రమైన యాగంటి పుణ్యక్షేత్రంలో జనవరి 26వ తేదీన పురాతనకాలం నాటి రాతిదూలం విరిగిపడింది. దాంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా పెద్ద శబ్ధం చోటుచేసుకోవడంతో భక్తులు పరుగులు తీశారు. సకాలంలో స్పందించిన ఆలయ సిబ్బంది సంఘటనా స్థలం నుండి భక్తులను వెంటనే పక్కకు తరలించారు. అయితే యాగంటి బసవన్న మండపంలో నంది రోజురోజుకు పెరుగుతుందని కాలజ్ఞానంలో పోతులూరు వీరబ్రహ్మం చెప్పారు.
బసవన్న పెరుగుతుండటంతో రాతిదూలం పక్కకు ఒరిగి కిందపడిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే… యాగంటి క్షేత్రానికి సమీపంలో మైనింగ్ గనుల్లో బ్లాస్టింగే..రాతిదూలం పడిపోవటం, ఆలయగోడలు బీటలు వారటానికి కారణమని అంటున్నారు. ఆలయం చుట్టుపక్కల ఉన్న కొండప్రాంతాల్లో పెద్దయెత్తున మైనింగ్ బ్లాస్టింగ్‌లు చేపట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు భక్తులు చెబుతున్నారు. మొత్తానికి విరిగిన స్తంభాన్ని దేవదాయశాఖ సిబ్బంది, ఆర్కియాలాజీ శాఖ అధికారులు పైపులు ఏర్పాటు చేసి జాకీలు అమర్చారు.