AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Statue of Equality: నభూతో, నభవిష్యతిః అన్నట్లుగా శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు.. రెండోరోజు ఉత్సవ విశేషాలు

శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి.

Statue of Equality: నభూతో, నభవిష్యతిః అన్నట్లుగా శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు..  రెండోరోజు ఉత్సవ విశేషాలు
Statue Of Equality
Balaraju Goud
|

Updated on: Feb 03, 2022 | 10:14 PM

Share

Sri Ramanuja millennium celebrations: అద్భతం.. అపూర్వం.. అమోఘం.. అనిర్వచనీయం.. అనితర సాధ్యం.. భగవద్రామానుజుల సమారోహ ఉత్సవం. నభూతో , నభవిష్యతిః అన్నట్లుగా .. దివిపై ముందేన్నడు జరగని మహా క్రతువు.. భవిష్యత్తులో మరెవ్వరూ చేయలేని మహాయజ్ఞానికి వేదికయ్యింది మన సమతాస్ఫూర్తి కేంద్రం. వేలాది మంది ఋత్వికులు.. హైదరాబాద్(Hyderabad) శివారు ప్రాంతంలోని ముచ్చింతల్‌లో శ్రీశ్రీశ్రీ త్రిదిండి చిన జీయర్ స్వామి ఆశ్రమం(China Jiyar Swamy Ashramam)లో లక్షలాది మంది భక్తులతో శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం(Statue of Equality) కన్నుల పండువగా జరుగుతోంది. ఫిబ్రవరి 3 వతేదిన గురువారం అగ్నిమథనంతో ఆరంభమైంది మహా యజ్ఞం.

శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సతీసమేతంగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. తొలుత భారీ శ్రీరామానుజ విగ్రహ ప్రాంగణాన్ని పరిశీలించి పనులను సమీక్షించారు. ముఖ్యమంత్రికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మై హోమ్ గ్రూప్స్ అధినేత డా.జూపల్లి రామేశ్వరరావు సమతాస్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్ల గురించి వివరించారు. శ్రీ మద్రామానుజ విగ్రహం… సమానత్వానికి ప్రతీకలాంటిదని సీఎం కేసీఆర్ కొనియాడారు. దేవుని ముందు ప్రజలందరూ సమానమే అని… ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తాడని.. మనం కూడా రామానుజ స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం యాగశాలను సందర్శించిన ముఖ్యమంత్రి పెరుమాళ్లను దర్శించుకున్నారు.

తొలుత భారీ శ్రీరామానుజ విగ్రహ ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడి పనులను సమీక్షించారు. ముఖ్యమంత్రికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, మై హోమ్ గ్రూప్స్ అధినేత డా.జూపల్లి రామేశ్వరరావు ఏర్పాట్లను వివరించారు.

రెండోరోజు అరణి మథనంతో వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ మహాక్రతువులో భాగంగా ప్రధాన ఘట్టమైన శ్రీలక్ష్మీ నారాయణ మహా యాగాన్ని వేదపండితులు నిర్వహించారు. ప్రధాన యాగ మండపంలో శమి, రావి కర్రలతో బాలాగ్నిని రగిలించిగా 9 నిమిషాల్లో అగ్ని ఉద్భవించింది. ఆ అగ్నిహోత్రాన్ని పెద్దది చేస్తూ 1035 కుండలాలు ఉన్న యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. పవిత్ర యాగశాలను ప్రధానంగా నాలుగు భాగాలుగా విభజించినట్టు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వెల్లడించారు. శ్రీరంగ క్షేత్రానికి ప్రతీకగా యాగశాల కుడివైపు భాగానికి భోగ మండపమని, తిరుమల క్షేత్రాన్ని స్మరించేలా మధ్య భాగానికి పుష్ప మండపమని, కాంచీపురానికి గుర్తుగా వెనుక వైపు ఉన్న భాగానికి త్యాగ మండపం, మేల్కోట క్షేత్రాన్ని తలచుకుంటూ ఎడమ వైపు ఉన్న మండపానికి జ్ఞాన మండపం అన్న నామకరణం చేసారు. ఆపై చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా 114 యాగశాలల్లో శ్రీలక్ష్మీ నారాయణ మహాక్రతువు ప్రారంభమయింది. చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అయోధ్య, మహారాష్ట్ర, తమిళనాడు, నేపాల్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ స్వాములు హాజరై శ్రీలక్ష్మీనారాయణ మహా యాగాన్ని నిర్వహించారు. పలు రాష్ట్రాల నుంచి హాజరైన వైష్ణవ స్వాములకు మైహోమ్ గ్రూప్ సంస్థల అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దీక్షావస్త్రాలను సమర్పించారు.

0302

0302

5 వేల మంది రుత్విజులు వేదమంత్రాలు చదువుతుండగా స్వచ్ఛమైన ఆవునెయ్యితో హోమ క్రతువును నిర్వహించారు. సృష్టి దివ్య ప్రబంధాలు, భగవద్గీతలోని ప్రధాన అధ్యయనాలు, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ ఉజ్జీవన యజ్ఞం పూర్తిచేసారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు తెలంగాణ ఆర్ధికశాఖామాత్యులు తన్నీరు హరీశ్ రావు ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగరి ఎంఎల్ఏ రోజా పాల్గొని చిన్నజీయర్ స్వామి మంగళాశాసనాలు అందుకున్నారు.

మరోవైపు ప్రవచన మండపంలో ప్రారంభంగా శ్రీశ్రీశ్రీ పెద్జ జీయర్ స్వామి వారి పూజా కార్యక్రమాన్ని భక్తులచే చిన్న జీయర్ స్వామి స్వయంగా ఆచరింపజేసి మంగళనీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2 వేల మంది భక్తులు పెద్ద జీయర్ స్వామివారిని పూజించారు. ఈ సందర్భంగా పెద్ద జీయర్ స్వామి వారి అష్టోత్తర శతనామావళిని అందరూ పఠించారు. అదే సమయంలో శ్రీచిన్న జీయర్ స్వామి సన్యాసాశ్రమ స్వీకార విశేషాలను స్వామివారి ఔన్నత్యాన్ని గురించి మహోమహోపాధ్యాయ డా.సముద్రాల రంగరామానుజులవారు వివరించారు. ఈ కార్యక్రమంలో నేపాల్ నుంచి విచ్చేసిన శ్రీమాన్ కృష్ణమాచార్యుల వారు పాల్గొన్నారు.

అనంతరం బ్రహ్మశ్రీ డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి ప్రసంగం భగవద్రామానుజ వైభవంపై అనర్గళంగా సాగింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక గాయని సురేఖామూర్తి బృందం భక్తి గీతాలు అలరించాయి. శ్రీపాద రమాదేవి నృత్యం, నర్సింహారావు బృందం భజనలు, ప్రణవి నృత్యం, కిలాంబి శ్రీదేవి సంగీతం విశేషంగా ఆకట్టుకున్నాయి. రాత్రివేళ ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు తారక రామారావు ప్రత్యేక కార్యక్రమం, చెన్నై నుంచి విచ్చేసిన మాధవపెద్ది బృందం నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయంత్రం ఇష్టిశాలల వద్ద దుష్టనివారణకు శ్రీ సుదర్శనేష్టి, సర్వాభీష్టసిద్ధికి శ్రీవాసుదేవేష్టిని చేశారు.

నాలుగో రోజు కార్యక్రమంలో భాగంగా యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణేష్టి, సత్సంతానానికై వైనేతేయేష్టి, శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజ జరుగనున్నాయి. కార్యక్రమంలో ప్రధానఘట్టం ఫిబ్రవరి 5న భారత ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా 216 అడుగుల సమతామూర్తి భగవద్రామానుజుల విగ్రహం జాతికి అంకితం ఇవ్వనున్నారు.