Bonalu 2022: మొదలైన మహంకాళి బోనాల జాతర.. బారులు తీరిన భక్తులు.. తొలిబోనం సమర్పించిన మంత్రి తలసాని
మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘటోత్సవంతో మొదలైంది. తెల్లవారుజాము 4 గంటలకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుటుంబసభ్యులతో అమ్మవారికి తొలి బోనం సమర్పించారు.
Bonalu 2022: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి (Secunderabad Ujjaini Mahankali Bonalu ) అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండేళ్ల తర్వాత భక్తులను పూర్తి స్థాయిలో అనుమతిస్తుండడంతో… తెల్లవారుజామునుంచే భక్తుల అమ్మవారి ఆలయం వద్ద బారులు తీరారు. మహంకాళికి బోనాలు సమర్పిస్తున్నారు. బోనాల వేడుక ఘటోత్సవంతో మొదలైంది. తెల్లవారుజాము 4 గంటలకి అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. అమ్మవారికి సాకలు సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుటుంబసభ్యులతో ఉదయం 4 గంటలకు తొలి బోనం సమర్పించారు.
ఈ నేపథ్యంలో మంత్రి తలసాని మాట్లాడుతూ.. తనకు అమ్మవారిని నాలుగు గంటలకు దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. బోనాల పండుగను నేడు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.. ఇది తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. మహంకాళి జాతర విశ్వవ్యాప్తం అయ్యిందని తెలిపారు. సంబురాల కోసం ఏర్పాట్లు అన్ని డిపార్టుమెంట్ల ఘనంగా చేశారంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
ఉదయం 9 గంటల నుంచి వీఐపీల రాక మొదలవుతుంది. మహంకాళి అమ్మవారిని ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకోనున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇతర మహిళలతో కలిసి బంగారు బోనం సమర్పించనున్నారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్న సమయంలో అమ్మవారిని దర్శించుకోనున్నారు. అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించే భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రెండురోజులపాటు జరిగే ఉత్సవాల్లో తొలిరోజు బోనాలు, రెండోరోజు రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. రంగం తర్వాత అంబారు ఊరేగింపు ఉంటుందని తెలిపారు.
దాదాపు 3వేల దైవాలయనలను అభివృద్ధి చేశామని తెలిపారు. ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు ఏర్పాటు చేసినట్లు.. మెడికల్, అంబులెన్స్ ఏర్పాట్లు చేశామని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిన తరువాత అమ్మవారి దయతో అనేక ప్రాజెక్ట్ లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి ఆలయ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. మహంకాళి బోనాల సందర్బంగా ఆర్టీసీ 150 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..