Tirumala Laddu: తిరుమల లడ్డూలో నెయ్యి చుట్టూ రాజకీయ వివాదం.. ఎవరి మాట నిజం?

తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి విషయానికొస్తే సాధారణంగా టీటీడీ మార్కెటింగ్‌ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తోంది. ప్రతి 6 నెలలకొకసారి టెండర్లు పిలిచి ఇ- ప్రోక్యూర్‌మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్‌ కూడా తిరుమలలోనే ఉంది. ఇన్ని అంచెలు దాటి కల్తీ నెయ్యి, అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసింది వాడటం అనే టాపిక్‌ భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.

Tirumala Laddu: తిరుమల లడ్డూలో నెయ్యి చుట్టూ రాజకీయ వివాదం.. ఎవరి మాట నిజం?
Tirumala Laddu
Follow us
Ravi Panangapalli

| Edited By: Gunneswara Rao

Updated on: Sep 19, 2024 | 7:21 PM

తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత భక్తుల్లో నెలకొన్న ప్రశ్న ఇది. యస్‌..గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అంత మాట అనడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇన్నాళ్లు స్వామి ప్రసాదం పేరిట తింటున్న లడ్డూలో ఇంత దారుణం జరిగిందా అని భక్తులు మండిపడుతున్నారు. అట్ ద సేమ్ టైం… ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగాను దుమారం రేపుతున్నాయి. గత ప్రభుత్వంపై ఇప్పటి వరకు చేసిన ఆరోపణలు ఒక ఎత్తయితే.. తిరుమల లడ్డూ పేరిట చేసిన ఆరోపణలు మరో ఎత్తు. ఎందుకంటే తిరుమల శ్రీవారి పట్ల ఎంత భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తారో.. ఆయన లడ్డూ ప్రసాదం అన్నా భక్తులు అంతే పవిత్రంగా చూస్తారు. అలాంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని ప్రతిపక్షం కూడా అంతే సీరియస్‌గా తీసుకుంది. అందులో భాగంగా గతంలో టీటీడీకి ఛైర్మన్‌గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి సీఎం వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని చంద్రబాబుకు సవాల్‌ విసురుతూ ఎక్స్ ఫ్లాట్ ఫాంలో ట్వీట్ చేశారు. దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందలకోట్లమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబునాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారని విమర్శించారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని… మనిషి పుట్టుక పుట్టినవారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరని, ఇలాంటి ఆరోపణలు చేయరని వ్యాఖ్యానించారు. అంతేకాదు భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబుకూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా చంద్రబాబు కామెంట్స్‌పై రియాక్ట్ అయ్యారు. తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను, దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఎక్స్ వేదికగా ఆరోపించారు. సిఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయని.. ఈ మొత్తం ఘటనలో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు సీబీఐ విచారణ జరిపించాలని ఆ మహా పాపానికి, ఘోర అపచారానికి కారకులెవరో తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు.

తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి విషయానికొస్తే సాధారణంగా టీటీడీ మార్కెటింగ్‌ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తోంది. ప్రతి 6 నెలలకొకసారి టెండర్లు పిలిచి ఇ- ప్రోక్యూర్‌మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్‌ కూడా తిరుమలలోనే ఉంది. ఇన్ని అంచెలు దాటి కల్తీ నెయ్యి, అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసింది వాడటం అనే టాపిక్‌ భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.

* ఆవు నెయ్యా?జంతువుల కొవ్వా? ఏది నిజం? * ప్రతీ రోజు 300-500 లీటర్ల నెయ్యి వినియోగం * నెయ్యిని కొనుగోలు చేసే మార్కెటింగ్‌ విభాగం * ప్రతీ 6 నెలలకోసారి టెండర్లు * ల్యాబ్‌లో నెయ్యి నాణ్యతపై పరీక్షలు * 2021 మార్చి వరకు నందిని బ్రాండ్‌ (కర్నాటక) నెయ్యి సరఫరా * తక్కువ ధరకి సప్లయ్‌ చేయలేమంటూ తప్పుకున్న నందిని * తమిళనాడు, ఢిల్లీకి చెందిన కంపెనీలు నెయ్యి సరఫరా

– 2021 మార్చి వరకు టీటీడీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది. 2021 మార్చి లో జరిగిన టెండర్లలో L-3 గా నిలిచింది. అయినా కూడా L-1, L-2 అనుమతితో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరైన నెయ్యిలో కేవలం 20 శాతం సప్లై చేసింది. ఆ తర్వాత నుంచి మాత్రం టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. యూపీకి చెందిన ప్రీమియర్ L-1 గా, L-2గా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందగా కేజీ నెయ్యి రూ. 424 లు ప్రకారం టీటీడీకి సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ధరకు తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌ టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. టీటీడీకి నాణ్యమైన నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేయలేమని ఫెడరేషన్‌ తేల్చి చెప్పింది. దీంతో తక్కువ ధరకు నాసిరకం నెయ్యి కొనుగోలు చేస్తుందంటూ టీటీడీపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కనుక వెంటనే దానిపై విచారణ జరిపించి.. నిజా నిజాలు తేల్చి తప్పు చేసిన వారికి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు.

ఈ వివాదం ఇలా ఉంటే.. శ్రీవారి లడ్డూ జారీలో టీటీడీ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. పవిత్రమైన స్వామి వారి ప్రసాదం భక్తలకే అందేలా చర్యలు తీసుకుంది. లడ్డూ ప్రసాదానికి ఆధార్‌ను లింక్‌ చేసి దుర్వినియోగాన్ని అడ్డుకుంది. లడ్డూ పంపిణీలో మార్పులు చేపట్టింది. దర్శనం చేసుకునే భక్తులు సంతృప్తి చెందేలా లడ్డూలను విక్రయించాలని నిర్ణయించింది. అదే సమయంలో దళారీల అక్రమాలకు చెక్‌ పెట్టింది. వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలను చూస్తే..

* లడ్డూల జారీలో టీటీడీ కొత్త మార్గదర్శకాలు * లడ్డూ విక్రయాలకు ఇకపై ఆధార్‌ తప్పనిసరి * దళారుల ఆటకట్టించేందుకు తప్పలేదంటున్న టీటీడీ * దర్శనం టోకెన్‌ ఉన్న భక్తులకు ఎన్ని లడ్డూలైన ఇస్తారు * టోకెన్‌ లేని భక్తులు ఆధార్‌ చూపిస్తే రెండు లడ్డూలిస్తారు * శ్రీవారి లడ్డూల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు * పెళ్లి విందులో స్టేటస్‌ సింబల్‌గా తిరుపతి లడ్డూలు * టీటీడీ సమాచార కేంద్రాల్లో సైతం లడ్డూల విక్రయం * నిత్యం 3.5 లక్షల లడ్డూలను విక్రయిస్తున్న టీటీడీ * అక్రమాలకు పాల్పడుతున్న టీటీడీ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది * అక్రమార్కులపై చర్యలు తప్పవన్న ఆలయాధికారులు

ఇది ఓవరాల్ గా తిరుమల లడ్డూ చుట్టూ నడుస్తున్న కథ. ఏదేమైనా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా.. లడ్డూ పవిత్రతను కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి