“శ్రీరామనవమి రోజు భద్రాద్రికి రావొద్దు.. ఆన్ లైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తుల డబ్బులు వాపస్”.. మంత్రి క్లారిటీ
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సారి కూడా భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలను నిరాండంబరంగా నిర్వహించనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి..
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సారి కూడా భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలను నిరాండంబరంగా నిర్వహించనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కొద్ది రోజులుగా పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి అన్ని మతాల పండుగల నిర్వహణపై ప్రభుత్వం అంక్షలు విధించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. గతేడాదిలో నిర్వహించినట్లుగానే పరిమిత సంఖ్యలోనే కోవిడ్ నిబంధనలకు లోబడి వేడుకను జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. స్వామివారి ఆలయంలోనే శ్రీరామనవమి వేడుకలను ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహిస్తామన్నారు. కరోనా దృష్ట్యా భక్తులు ఎవరూ శ్రీరామనవమి నాడు సీతారామ కల్యాణాన్ని వీక్షించడానికి భద్రాద్రికి రావొద్దని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యగా భక్తుల రాకపై ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, భక్తులు పరిస్థితిని అర్ధం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. శ్రీరామనవమి వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో వీక్షించాలని కోరారు. ఆన్ లైన్ లో కళ్యాణ టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తుల డబ్బులు తిరిగి చెల్లిస్తామని మంత్రి తెలిపారు. కళ్యాణ వేడుకల నిర్వహణపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ తో ఆయన ఫోన్లో మాట్లాడారు.
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా దర్శనాలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే భక్తులకు దర్శనాలు కల్పిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని అన్నారు. కోవిడ్ విజృంభణ కారణంగా ఆలయంలో నిబంధనలను పక్కాగా అమలు చేయాలని మంత్రి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలను శానిటైజ్ చేయాలని సూచించారు. భక్తులు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించటంతోపాటు భౌతిక దూరం పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని, ఆలయ అధికారులకు భక్తులు సహకరించాలని కోరారు.
Also Read: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. అక్కడి మ్యాచ్‌లపై క్లారిటీ వచ్చేసింది
పురావస్తుశాఖ తవ్వకాల్లో దొరికిన 7 విచిత్రమైన లడ్డూలు… పరిశోధనలో విస్తుపోయే విషయాలు