Holi Festival Special : హోలీ రోజున అక్కడ ఆనందోత్సవాలతో పిడిగుద్దులాట జరుపుకుంటారు.
Holi Festival :హోలీ రోజు అసంకల్పితంగానే ప్రకృతి రంగులను అద్దుకుంటుంది.. సప్త వర్ణ శోభితమవుతుంది.. అప్పటి వరకు రాగి రంగులో ఆకుల చిగురుతనం ఆకుపచ్చగా మారుతుంది. చిన్నా, పెద్దా, కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా అందరూ రంగుల్లో మునిగిపోతారు. చిన్నారుల మోములు రంగులతో విచ్చుకుంటాయి. రుతువులన్నింటిలో వసంతానిదే ప్రత్యేక స్థానం.. ఆరు రుతువులు ఆమనిలా సాగాలని కోరుకునేది అందుకే! కొమ్మలన్నీ రంగురంగుల విరులను తురుముకునే రుతువు ఇది! ఆమని రాకతో ప్రకృతే పరవశించిపోతున్నప్పుడు మానవమాత్రులం మనమెంత! […]
Holi Festival :హోలీ రోజు అసంకల్పితంగానే ప్రకృతి రంగులను అద్దుకుంటుంది.. సప్త వర్ణ శోభితమవుతుంది.. అప్పటి వరకు రాగి రంగులో ఆకుల చిగురుతనం ఆకుపచ్చగా మారుతుంది. చిన్నా, పెద్దా, కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా అందరూ రంగుల్లో మునిగిపోతారు. చిన్నారుల మోములు రంగులతో విచ్చుకుంటాయి. రుతువులన్నింటిలో వసంతానిదే ప్రత్యేక స్థానం.. ఆరు రుతువులు ఆమనిలా సాగాలని కోరుకునేది అందుకే! కొమ్మలన్నీ రంగురంగుల విరులను తురుముకునే రుతువు ఇది! ఆమని రాకతో ప్రకృతే పరవశించిపోతున్నప్పుడు మానవమాత్రులం మనమెంత! అందుకే ఆమని రాకను రంగులతో స్వాగతం పలుకుతున్నాం. వసంతోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. జైపూర్‌లో అయితే చెప్పనే అక్కర్లేదు. ఇక జైపూర్‌లో అయితే చెప్పనే అక్కర్లేదు.. మామూలుగానే అదో పర్యాటక ప్రాంతం.. ఇక హోలీ పండుగ రోజైతే పర్యాటకులతో నగరం కిక్కిరిసిపోతుంది.. కారణం హోలీతో పాటు అక్కడ ఏనుగుల పండుగ కూడా జరుగుతుంది కాబట్టి.. ఈ ఒక్క రోజు మాత్రం అది పింక్ సిటీ కాదు. రంగుల నగరం.
ఏనుగుల పండగంటే ఏనుగులు జరుపుకునే పండగ అనుకునేరు. కాదు. ఏనుగులతో జరుపుకునే పండుగ. అవి చేసే విన్యాసాలు చూడముచ్చటగా ఉంటాయి. రాజస్తానీ జానపద నృత్యాలు సరేసరి! కేవలం హోలీ వైభవాన్ని చూసేందుకే విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు.. అన్నట్టు ఉదయ్‌పూర్‌లోనూ హోలీ వేడుకలు గొప్పగా జరుగుతాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయంలో చాలా వినూత్నంగా జరుపుకుంటారీ పండుగను. ఆలయ గర్భగుడిలోనే రంగులు చల్లుకుని సంబరాలు చేసుకుంటారు. చారిత్రక మహంకాళీ దేవాలయం లోపలా వెలుపలా రంగులు విరజిమ్ముతాయి. గర్భగుడిలో శివలింగానికి అభిషేకాలు చేస్తూనే రంగులు చల్లుకుంటారు.. ఆనందతాండవాలు చేస్తారు. డోల్ పూర్ణమనాడు బెంగాలీవాసుల సంబరమే సంబరం! నెల రోజుల నుంచే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ ఉంటారు.. ఉదయం యువతీయువకులు కుంకుమపువ్వు రంగు దుస్తులను ధరిస్తారు.. మెడలో సుగంధభరితమైన హారాలు వేసుకుంటారు. ఆటపాటలు సరేసరి! హోలీ పండుగను డోల్ జాత్ర…స్వింగ్ పండుగ అని కూడా పిలుచుకుంటారు. రాధాకృష్ణుల ప్రతిమలను అందంగా అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు. రవీంద్రనాథ్ టాగూర్ శాంతినికేతన్‌లో అయితే హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఫాల్గున మాసం.. పున్నమి రాత్రి. ఇంకా వేడెక్కని ఓ మోస్తరు చల్లటి గాలులు. ఇంతకు మించిన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందా? ప్రతి రాత్రి వసంతరాత్రి అయితే ఎంత బాగుంటుంది..? ఈ ఆకాంక్ష మణిపూర్‌లో హోలీ వేడుకలు చూసిన వారివ్వరికైనా కలిగి తీరుతుంది. మణిపూర్‌లో ఆరు రోజుల పాటు హోలీ పండుగ జరుగుతుంది. పౌర్ణమి రోజు రాత్రి డోలు వాయిద్యాలు.. జానపద పాటలు. సంప్రదాయ నృత్యాలతో ప్రజలు వేడుక చేసుకుంటారు. మణిపూర్ క్యాలెండర్‌లో చివరి నెల అయిన లామ్తాలో వచ్చే నిండు పున్నమినే హోలీగా జరుపుకుంటారు.
హోలీని ఇక్కడ యావ్‌షాంగ్‌గా జరుపుకుంటారు. మిగతా ప్రాంతాల్లో హోలికా దహనం ఉన్నట్టుగానే ఇక్కడా ఓ చెడును అగ్నికి ఆహుతి ఇచ్చే సంప్రదాయం ఉంది. వెదురుతో నిర్మించిన ఓ పర్ణశాల వంటి పాకను దహనం చేస్తారు. దీన్ని వారు యావ్‌షాంగ్ మై తాబాగా పిలుచుకుంటారు. రంగుల పండుగకు ఇది నాంది. ఇక్కడ్నుంచే ఆరు రోజుల పాటు హోలీ వేడుకలు జరుగుతాయి. అయితే వీరు జరుపుకునే హోలీ కాసింత భిన్నంగా ఉంటుంది.. అదే రోజు ఉదయం చిన్నారు ఇళ్లిళ్లూ తిరిగి బియ్యం, కాయగూరలు సేకరిస్తారు. మరుసటి రోజు పిల్లలు తమ ఇరుగుపొరుగు ఇళ్లకు, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలుపుతారు. వారిచ్చే డబ్బు, కానుకలను స్వీకరిస్తారు. కొందరు రహదారులపై వచ్చిపోయే వాహనాలను ఆపి మరీ డబ్బు వసూలు చేస్తారు.. ఈ తంతును వారు సొల్ మున్బా అంటారు.
మణిపూర్ వైష్ణవుల సంబరమే సంబరం! అక్కడి వైష్ణవాలయాన్ని కొత్త కళను సంతరించుకుంటాయి.. పెద్దలంతా వైష్ణవ భజనలో మునిగిపోతారు. ఆరో రోజు విజయ్ గోవింద ప్రాంగణంలో హాలంగర్‌ను నిర్వహిస్తారు.. ఇది కూడా వారికి ఓ పండుగే! కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకే! 1779లో మణిపూర్ మహారాజు రాజర్షి భాగ్యచంద్ర ఈ పండుగను మళ్లీ జనబాహుళ్యంలోకి తెచ్చాడు. ఈ రోజున గోవిందాలయం నుంచి విజయ్ గోవిందాలయం వరకు ప్రజలు పెద్ద ఊరేగింపు తీస్తారు. భజనలు చేసుకుంటూ.. పాటలు పాడుకుంటూ రంగులు చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా విజయ్ గోవింద్ టెంపుల్‌కు వెళతారు. నిజానికి ఇది గొప్ప పండుగ. అన్ని కులాలను ఒక్కటిగా చేసే పండుగ. బీద గొప్ప అన్న తేడాలు లేని పండుగ. అందరూ ఒక్కటై ఆనందంగా జరుపుకునే పండుగ. యువతీ యువకులకైతే చెప్పలేనంత ఆనందం. వివిధ ప్రాంతాల్లో యువతీయువకులు చేసే తబల్ చంగ్బా నృత్యం అందరిని ఆకట్టుకుంటుంది. అరుదుగా లభించే ఈ అవకాశాన్ని వారు చక్కగా సద్వినియోగం చేసుకుంటారు. ఇందుకోసం అమ్మాయిలు విరాళాలు సేకరిస్తారు. అబ్బాయిలేమో నిర్వహణ గట్రా పనులు చూసుకుంటారు. పండుగ సందర్భంగా ఆటల పోటీలు కూడా జరుగుతాయి.. కాసింత విభిన్నంగా ఉండే ఆ క్రీడల్లో పెద్దవాళ్లు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు.
హోలీ అంటే రంగుల పర్వదినం. చిత్రవర్ణాలతో పరవశించిపోయే విచిత్రం. అదో తీయని అనుభూతి. ప్రకృతిలోని రంగులన్నీ జీవితం నిండా విరబూయాలని మనిషి చేసుకునే వినతి. దేశమంతా భాసిల్లే రంగుల కేళి ఇప్పుడు ఎల్లలు దాటింది. సముద్రాలు దాటిన మన సంస్కృతి ఇప్పుడు విదేశాల్లోనూ వర్ణమయ శోభను అందిస్తోంది. దేశ రాజధాని కావడం వల్లనో ఏమో ఢిల్లీలో హోలీ వేడుకలు ఆధునికతను సంతరించుకుంటాయి. ఇక్కడివారంతా పర్యావరణానికి పెద్దపీట వేస్తారు. అందుకే సహజసిద్ధమైన రంగులతో మాత్రమే హోలీని జరుపుకుంటారు. పహడ్‌గంజ్‌లో దొరికే రంగులన్నీ సహజమైనవే! హోలీకి వారం రోజుల ముందు నుంచే పహడ్‌గంజ్ కొనుగోలుదారులతో సందడి సందడిగా ఉంటుంది.
ఉత్తరాదితో పోల్చితే దక్షిణ భారతదేశంలో రంగుల హంగామా కాసింత తక్కువే! కర్నాటకలోని హంపిలో మాత్రం హోలీ వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ వేడుకలను చూసేందుకు విదేశీ యాత్రికులు కూడా వస్తారు.. రంగులతో ఆటలు అయ్యాక అందరూ తుంగభద్రలో స్నానం చేస్తారు. హిందూ దేశమైన నేపాల్‌లో హోలీని ఉత్సాహంగా జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడాన్ని లోలా అంటారు.. హోలీకి ముందు రోజు పొడవైన వెదురు కర్రలకు రంగురంగుల వస్ర్తాలను చుడతారు. మనకు కాముడైతే వారికి లింగో. అనంతరం లింగోను దహనం చేస్తారు. వెదురు కర్రల్లో రంగునీళ్లు నింపుకొని ప్రజలు ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ప్రజలంతా వీధుల్లోకి వచ్చి పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. అన్నట్టు హోలీ పండుగ రోజు స్కూళ్లు, ఆఫీసులు ఏమీ ఉండవు. ఎందుకంటే హోలీ అక్కడ నేషనల్ హాలీడే కాబట్టి!ఫిజీలో కూడా భారత సంతతి వారెక్కువే! అక్కడ కూడా హోలీ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
హోలీ రోజు అక్కడ సెలవు లేకపోయినా ఆఫీసులకు సెలవులు పెట్టేసి, పనులు ఎగ్గొట్టేసి, స్కూళ్లకు డుమ్మా కొట్టేసి పండుగ సంబరాల్లో మునిగి తేలుతారు. జానపదాలను శ్రావ్యంగా ఆలపిస్తూ పండుగకు మరింత శోభను తెస్తారు. ఈ పాటలను ఫాగ్ గాయన్ అని పిలుస్తారు. ఫాగన్‌ను ఫాల్గున్ అని కూడా అంటారు. మన క్యాలెండర్‌లో వచ్చే చివరి మాసం ఫాల్గునమే! వసంతానికి స్వాగతం చెప్పే మాసం ఇదే! రసస్వాదనను కలిగించే మాసం కూడా ఇదే! పరిమళభరితమైన చూర్ణాలను ఒళ్లంతా పూసుకుని రంగులు జల్లుకుంటారు.హిందువులు ఉండే పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, సురినామ్, గయానా, ట్రినిడాడ్, మారిషస్ దేశాల్లోనూ హోలీ అట్టహాసంగా జరుగుతుంది. ఆ మాటకొస్తే హిందువులే కాదు. ప్రపంచంలో అందరూ ఇప్పుడు హోలీ పేరిట రంగులు చల్లుకోవడం మొదలు పెట్టారు. హంగు ఆర్భాటాల మధ్య హోరెత్తే పాటల మధ్య ఈ ఉత్సవాన్ని ఉల్లాసభరితంగా జరుపుకుంటున్నారు.
అమెరికాలో హోలీ సందడిని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. అతిశయోక్తి కాదు కానీ అసలు ఈ భూమ్మీద అంత గొప్పగా మరెక్కడా హోలీ వేడుకలు జరగవు! నమ్మి తీరాల్సిన నిజం! అమెరికాలోని ఉతాలో ఓ పెద్ద ఇస్కాన్ టెంపుల్ ఉంది.. అక్కడున్న రాధాకృష్ణ మందిరంలో ప్రతి ఏటా రంగుల పండుగ జరుగుతుంటుంది.. హోలీ సెలెబ్రెషన్స్ కోసమే దాదాపు లక్ష మంది సమూహం అక్కడికి చేరుకుంటుంది.. అంతమంది ఒక్కసారి రంగులు చల్లుకోవడం ఓ అద్భుత దృశ్యం. నిర్మలంగా ఉండే నీలాకాశం ఒక్కసారిగా రంగులను అద్దుకుంటుంది. వేలాది ఇంద్రధనుస్సులు నేలరాలిపడుతున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ మనలాగ ఏ రంగు పడిదే ఆ రంగు వాడరు.. శరీరానికి ఎలాంటి హానీ చేయని రంగులనే ఉపయోగిస్తారు.. ఇలాంటి జాగ్రత్తలన్ని ఆలయ నిర్వాహకులే తీసుకుంటారు.. ప్రకృతి సిద్ధమైన రంగులనే ఎక్కువగా వాడతారు. నిజానికి ఇక్కడ సంబరాలు చేసుకునేది భారతీయులు కాదు. యూఎస్‌కి చెందిన క్రిస్టియన్లు. క్రైస్తవంలో ఒక శాఖగా అవతరించిన మర్మోన్లు ఇక్కడ హోలీని ఘనంగా నిర్వహిస్తారు.
హోలీ గురించి ఇంత చెప్పుకున్నాక. మన దగ్గర ఎలా జరుగుతుందో చెప్పుకోవద్దూ! హోలీ అంటే ఒకరికొకరు రంగులు పూసుకోవడం. రంగుల్లో ముంచి తేలడం. విందు వినోదాలతో మజా చేయడమే అందరికీ తెలుసు.. ఈ పండుగ రోజు ఒకరిపై ఒకరు పిడి గుద్దులతో దాడి చేసి కొట్టుకోవడం చిత్రమే మరి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో హోలీ రోజు గ్రామస్తులంతా రెండు వర్గాలుగా విడిపోయి గుద్దుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. రక్తాలు కారినా, సొమ్మసిల్లి పడిపోయినా ఎవరూ పట్టించుకోరు. ఏదో ఒక వర్గం గెలిచే వరకు ఈ పిడిగుద్దులాట సాగాల్సిందే. దాదాపు వందేళ్ల కిందటి నుంచి కొనసాగుతోంది ఈ గమ్మత్తయిన పండుగ. ఉదయం నుంచే గ్రామంలో సందడి మొదలవుతోంది. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో గడుపుతారు. మందు విందులతో మజా చేసుకుంటారు. సాయంత్రం కాగానే గ్రామ పొలిమేరల్లో కుస్తీ పోటీలు కూడా నిర్వహిస్తారు. ఈ సందర్బంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం గ్రామం మధ్యలో గల హన్మాన్ మందిరం ముందు పిడుగుద్దులాటకు వేదికను సిద్ధం చేస్తారు. ఆటకు ముందు డప్పు వాయిద్యాలతో గ్రామ పెద్దల ఇళ్ళకు వెళ్ళి ఆట స్థలం వరకు ఎదుర్కొని వస్తారు. వారు వచ్చాక ఆట మొదలవుతోంది. గ్రామస్తులు రెండు వర్గాలుగా ఏర్పడి పొడవాటి తాడుకు ఇరువైపులా నిలబడతారు. గ్రామ పెద్ద పూజ నిర్వహించి ఆటను ప్రారంభిస్తారు. సుమారు అరగంట పాటు పిడికిళ్లతో ఒకరినొకరు గుద్దుకుంటారు. దెబ్బలు తగిలి రక్తం కారినా లెక్కచేయరు. రక్తం కారిన చోట గాయానికి సున్నం పెట్టుకొని మళ్లీ ఆటలో పాల్గొంటారు తప్ప వెనుకడుగు వేయరు. వయోబేధం లేకుండా, కుల మతాలకతీతంగా అన్ని వర్గాల వారూ ఈ ఆటలో పాల్గొనడం విశేషం. చివరలో పిడిగుద్దుల వర్షం కురిపించుకున్న వారంతా ఆలింగనం చేసుకొని ఊరేగింపు నిర్వహిస్తారు. ఆనవాయితీగా వస్తున్న ఈ ఉత్సవాన్ని నిర్వహించకపోతే గ్రామానికి అరిష్టం కలుగుతుందని గ్రామస్తులు విశ్వసిస్తారు. ఎలా మొదలైందో తెలియదు. ఎవరు శ్రీకారం చుట్టారో వివారాల్లేవు. దీనికి ప్రతినిధి ఎవరు? నిర్వాహకులెవరు? ఎవరికీ అంతుచిక్కదు… కానీ, హోలీ పండుగ రోజు మాత్రం గ్రామస్తులంతా పోగై కుమ్ములాడుకుంటారు. ఇది బాహాటంగా, అట్టహాసంగా సాగడం ఓ విశేషమైతే. స్థానిక పోలీసులు, అధికారులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరు కావడం మరో విశేషం..
మరిన్ని చదవండి ఇక్కడ:తల్లిదండ్రులకు విజ్ఞప్తి ..తస్మాత్ జాగ్రత్త ..! మీలాంటి వారి కోసమే ఈ వీడియో..: Message For Parents Video.
టీనేజ్ కూతురితో మజాక్ చేస్తున్న నటి ప్రగతి.. వైరల్ అవుతున్న వీడియో : Actor Pragathi Viral Video.