త్రికరణశుద్దిగా ఆలయానికి రావాలట.. లేకుంటే తేనెటీగలు తరిమేస్తాయట.. ఎక్కడుందా వింత ఆలయం..?
పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రాంతంలో ఆ ఆలయం విశేషాలకు పెట్టింది పేరు. శనివారం మాత్రమే ఆ ఆలయం తెరుస్తారు. ఈ ఆలయానికి ఎలా పడితే అలా రాకూడదట. శుచి, శుద్ది లేకుండా వచ్చారో, అక్కడి తేనేటీగలు వెంటపడి మరీ తరుముతాయట.
పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రాంతంలో ఆ ఆలయం విశేషాలకు పెట్టింది పేరు. శనివారం మాత్రమే ఆ ఆలయం తెరుస్తారు. ఈ ఆలయానికి ఎలా పడితే అలా రాకూడదట. శుచి, శుద్ది లేకుండా వచ్చారో, అక్కడి తేనేటీగలు వెంటపడి మరీ తరుముతాయట. నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాల నడుమ ఈ ఆలయం కొలువుతీరి ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి భారీగా తరలివస్తుంటారు. ఈ ఆలయానికి ఆ ప్రాంతంలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు శుద్ధిగా రాకపోతే ఆలయ ప్రాంగణంలో ఉండే తేనెటీగలు కుట్టి తరిమేస్తాయని భక్తులు ఇక్కడ ప్రగాఢంగా నమ్ముతారు. అంతేకాదు ఈ విషయం ఎన్నో మార్లు అక్కడ జరిగిందట. అందుకే భక్తులు ఈ ఆలయానికి వచ్చేటప్పుడు ఎంతో నిష్టగా, త్రికరణ శుద్ధిగా వచ్చి ఆ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇంతకు ఆ ఆలయం ఏంటో…. ఆ ఆలయంలో కొలువుతీరిన దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే… ఈ కథనం చదివేయండి..!
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలో ఉన్న శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే ఈ ఆలయానికి భక్తులు ప్రతి శనివారం భారీగా తరలి వస్తారు. ప్రకాశం జిల్లా నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయానికి వస్తుంటారు. ఆలయ సమీపంలో ఉన్న నీటి గుండం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఇక్కడ కొలువైన దేవుడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అవతారమని భక్తులు భావిస్తారు. శ్రీమహావిష్ణు రూపం ఇక్కడ శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి రూపంలో వెలసినట్లుగా ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతి శనివారం భక్తులు భారీగా వస్తుంటారు. కానీ ఈ ఆలయానికి వచ్చే భక్తులు శుద్ధిగా లేకపోతే ఆలయ ప్రాంగణ పరిసర ప్రాంతాలలో ఉన్న తేనెటీగలు వారిని కుట్టి ఆలయ ఆవరణలో నుంచి తరిమేస్తాయని ఇక్కడికి వచ్చే భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అంతేకాదు ఈ విషయం ఎన్నో సార్లు నిరూపితమైందని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతారు.
తేనెటీగలు ముక్కుమ్మడిగా దాడి చేసేటప్పుడు గోవింద గోవింద అంటూ నామస్కరణ చేస్తే ఆ తేనెటీగలు కుట్టవని భక్తులు నమ్ముతారు. అలాగే తేనెటీగలు కుట్టే సమయంలో ఆలయ సమీపంలో ఉన్న నీటి గుండంలో దిగడం వల్ల కూడా తేనెటీగలు కుట్టవని భక్తులు చెబుతారు. ప్రతి వేసవికాలంలో ఇక్కడ శ్రీ నెమలి గుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. స్వామివారికి స్థానిక ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ముఖ్యంగా ఈ ఆలయంలో ప్రతి శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి.
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రతి శనివారం ఈ ఆలయం తెరచి ఉంటుంది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ ఆలయం ఉండడంతో మిగతా రోజుల్లో భక్తులకు అధికారులు అనుమతి ఇవ్వరు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో వర్షాలు కురిసిన సమయంలో కూడా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆలయ దర్శనానికి భక్తులకు అనుమతి ఉండదు. ఈ ఆలయానికి గిద్దలూరు నుంచి అంబవరం, వెలుపల్లి గ్రామాల మీదుగా జేపీ చెరువు గ్రామానికి చేరుకోవచ్చు. అంతేకాకుండా రాచర్ల మండలంలోని అన్నం పల్లె గ్రామం మీదుగా కూడా జేపీ చెరువు గ్రామానికి వెళ్ళవచ్చు. ప్రతి శనివారం భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు కూడా నడుపుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..