Vinayaka Chavithi: భారతదేశంలో అతిపెద్ద ఏకశిలా విగ్రహం.. ఐశ్వర్య గణపతి ఎక్కడున్నాడో తెలుసా..

కాణిపాకం.. ఈ పేరు వినగానే చిత్తూరు జిల్లాలో వెలసిన స్వయంభు వినాయకుడే గుర్తొస్తాడు. కానీ తెలంగాణలో కూడా అలాంటిదే ఓ భారీ గణేశ ప్రతిమ ఉంది. దేశంలోనే అతి ఎత్తైన గణపతిగా ఇది భాసిల్లుతోంది. ఐశ్వర్య గణపతిగా భక్తులు కొలిచే...

Vinayaka Chavithi: భారతదేశంలో అతిపెద్ద ఏకశిలా విగ్రహం.. ఐశ్వర్య గణపతి ఎక్కడున్నాడో తెలుసా..
Follow us

|

Updated on: Sep 10, 2021 | 2:01 PM

కాణిపాకం.. ఈ పేరు వినగానే చిత్తూరు జిల్లాలో వెలసిన స్వయంభు వినాయకుడే గుర్తొస్తాడు. కానీ తెలంగాణలో కూడా అలాంటిదే ఓ భారీ గణేశ ప్రతిమ ఉంది. దేశంలోనే అతి ఎత్తైన గణపతిగా ఇది భాసిల్లుతోంది. ఐశ్వర్య గణపతిగా భక్తులు కొలిచే ఈ ప్రతిమ పాలమూరు జిల్లాలో ప్రతిష్ఠతమై ఉంది. తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలోని పంటపొలాల మధ్య భారీ గణేశ ప్రతిమ విశేషంగా ఆకర్షిస్తోంది. అహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ ఏకశిలా వినాయకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నాడు…నిరాదరణకు గురౌతున్న ఆవంచ గణపతి గురించి తెలుసుకుందాం..  భారతదేశంలో అతిపెద్ద ఏకశిలా విగ్రహం ఎక్కడ ఉంది? అంటే అందరూ తమిళనాడులోనో.. కర్నాటకలోనో ఉండి ఉండవచ్చని చెపుతారు తప్ప మన రాష్ట్రంలోనే ఉందనే సంగతి చాలా మందికి తెలియదు.

మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో ఆవంచ గ్రామంలో 25 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు ఉన్న ఏకశిలా గణపతి విగ్రహం ఉంది. ఈ గణపతిని ఆ గ్రామం పేరుతో ఆవంచ గణపతి అని… గుండు గణపతి అని పిలుస్తుంటారు. మరో విశేషం ఏమిటంటే ఈ గణపతిని వెంకయ్య అని కూడా పిలుస్తుంటారు. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ అపురూపమైన విగ్రహాన్ని పట్టించుకొనే నాధుడేలేడు. ఆ విగ్రహానికి గుడి లేదు కనీసం చుట్టూ గోడ కూడా లేదు. విగ్రహం చుట్టూ ఉన్న పొలాలే ఆ మహాగణపతి సామ్రాజ్యం. అందులో పనిచేసుకొనే రైతులే ఆయన భక్తులు. వారుఅప్పుడప్పుడు పెట్టే అరటిపండు నైవేద్యంతోనే అంతభారీ గణపతి సర్దుకుపోక తప్పడం లేదు.

పదేళ్ల క్రితమే ఈ భారీ వినాయకుడి విగ్రహం వెలుగులోకి వచ్చినా.. ప్రభుత్వం కానీ, స్థానిక నాయకులు కానీ పట్టించుకోవడం లేదు. పంట పొలాల మధ్య నిరాదరణకు సాక్ష్యంగా నిలుస్తోంది. కొన్నేళ్ల క్రితం పుణెకు చెందిన ఉత్తరదేవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు కానీ.. అమలు కాలేదు. మైసూరుకు చెందిన వేదపండితులు ప్రత్యేక పూజలు చేసి ఐశ్వర్య గణపతిగా నామకరణం చేశారని స్థానికులు చెబుతుంటారు. ప్రస్తుతం ఏదైన పర్వదినం నాడు మాత్రమే ఆవంచ గణపతికి ధూపదీప నైవేద్యాలు అందుతున్నాయి.

ఈ వినాయకుడికి ఆలయం కోసమని 6.19 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆలయ నిర్మాణానికి 8 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ట్రస్టు సభ్యులు అంచనా కూడా వేశారు. వినాయకుడికి గుడి లేకపోవటం వల్ల భక్తులు ఇక్కడికి వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని స్దానికులు అంటున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌,మంత్రి లక్ష్మారెడ్డి ఆవంచ గ్రామాన్ని సందర్శించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయినప్పటికీ.. ఆవంచ గణపతిని పట్టించుకోవడం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సొంత గ్రామమైనప్పటికీ ఆయన కూడా వినాయకుడి ఆలయం పట్ల అసక్తి చూపడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు . వెంటనే ప్రభుత్వం ఆలయ నిర్మాణం చేపట్టాలని గ్రామస్దులు కోరుతున్నారు. వినాయకుడి ఆలయంపై ఆశ్రద్ధ అడపా దడపా భక్తులు, వీఐపీలు వచ్చినప్పటికీ వినాయకుడి ఆలయంపై శ్రద్ధ చూపడం లేదనే విమర్శలున్నాయి.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం.. ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. సుమారు వెయ్యి సంవత్సరాల నాటి ఏక శిల విగ్రహం తమ గ్రామంలో ఉండడం సంతోషదాయకమైనప్పటికీ దూపదీప నైవేద్యానికి నోచుకోకపోవడం బాధాకరమని ఆవంచ గ్రామానికి చెందిన మునీర్, శ్రీశైలం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

1173లో తైలపుడు అనే రాజు ఈ విగ్రహాన్ని నిర్మించారని, తెలంగాణా ఉద్యమం సమయంలో కెసిఆర్, డాక్టర్ జయశంకర్ ఈ విగ్రహాన్ని సందర్శించారని, తెలంగాణా ఏర్పడిన తర్వాత దీన్ని అభివృద్ధి పరుస్తామని కూడా హామి ఇచ్చారని అదే గ్రామానికి చెందిన డాక్టర్ శివలింగం చెబుతున్నారు. హైవేకు దగ్గరగా ఉన్న ఈ ఏకశిల గణపతిని అభివృద్ధి పర్చాలని ఆవంచ సర్పంచ్ అజయ్ కుమార్ కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి: Vinayaka Chavithi: ఎలాంటి విఘ్నాలు లేకుండా.. విఘ్నేశ్వరుడికి తొలిపూజ ఇలా చేద్దాం..

Vinayaka Chavithi: గణపయ్యకు అమ్మవారు ప్రాణం పోసింది ఇక్కడే.. ఈ దేవ భూమి చేరుకోవాలంటే..