Lord Srishna About Karna: కర్ణుడు గురించి కృష్ణుడు చెప్పిన సుగుణాలు ఇవే.. నేటి తరానికి స్పూర్తి..
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక బంధాలే అన్న కార్ల్ మార్క్స్ మాటలను నిజం చేస్తున్నాడు నేటి మనిషి. మానవ సంబంధాల్లో బీటలు పడుతున్నాయని.. మనసులో బాధ పడుతూ స్థిరం లేని ఆలోచనలతో చంచలంగా ఉన్నప్పుడు భగవద్గీత మంచి మార్గదర్శకంగా నిలుస్తుంది. నిజమైన శక్తి మనలోనే ఉందని..బయట కాదని ఇది బోధిస్తుంది. మనిషి మనస్సు ప్రశాంతంగా, సమతుల్యంగా, దృఢ సంకల్పంతో ఉంటే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మనల్ని కదిలించలేదని చెబుతుంది. అయితే ఈ రోజు మహాభారతంలోని గొప్ప వీరుడైన కర్ణుడు గురించి శ్రీ కృష్ణుడు చెప్పిన ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన కొన్ని సుగుణాల గురించి తెలుసుకుందాం..

శ్రీమద్ భగవద్గీత కేవలం ఒక మతపరమైన గ్రంథం కాదు. జీవితపు చీకటిలో ఆశ అనే జ్వాలను వెలిగించే దీపం. జీవితం విచ్ఛిన్నమవుతున్నట్లు అనిపించినప్పుడు, మన సొంత వారి కూడా అపరిచితులలా అనిపించినప్పుడు, గీతలోని మాటలు మనసుకు ఉపశమనం అందించే ఔషధంలా మనసుపై పని చేస్తాయి. ఈ గ్రంథం చింతల్లో చిక్కుకునే బదులు, మీ చర్యలపై నమ్మకం ఉంచండి.. ఫలితాలను ఆశించకుండా నిర్మలమైన హృదయంతో మీ పనిని చేస్తూ ఉండండి అని మనకు బోధిస్తుంది. ప్రపంచంలో మనం మన నిజ స్వరూపాన్ని భ్రాంతిలో, ప్రేమలో పడి మరచిపోయినప్పుడు.. గీత మనకు ఆత్మ స్థిరత్వాన్ని గుర్తు చేస్తుంది. జనన మరణాలకు అతీతమైన ఆత్మ పుట్టదు లేదా చనిపోదు. ఇది ఉనికిలోకి రాదు, లేదా ఉనికిలో ఉండదు. ఇది పుట్టనిది, శాశ్వతమైనది. ఈ స్వీయ సాక్షాత్కారం మనల్ని స్థిరంగా ఉండేలా చేస్తుంది.
ఈ విధంగా కురుక్షేత్రానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి జీవిత ఉద్దేశ్యాన్ని చెప్పాడు. దీనినే గీతా ఉపదేశం అని అంటున్నాం. అయితే మహాభారత కాలంలో దాన వీర శూర కర్ణుడిని ధర్మం, అధర్మ విషయాల గురించి చాలాసార్లు హెచ్చరించారు. కర్ణుడు ఖచ్చితంగా గొప్ప యోధుడు. అయితే అన్యాయాన్ని సమర్థించడం వల్ల అతను యుద్ధభూమిలో అమరవీరుడు అయ్యాడు. అయితే కర్ణుడి జీవిత పాత్ర నుంచి అనేక లక్షణాలను నేటి యువత స్పూర్తిగా తీసుకోవచ్చు.
ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండని కర్ణుడి జీవితం మనకు బోధిస్తుంది. ఒక వ్యక్తికి నిజమైన గుర్తింపు అతని పరిస్థితులు కాదు అతని ఆత్మవిశ్వాసంతో వస్తుంది. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా మన నిర్ణయాలు ఎలా దృఢంగా ఉండాలో కర్ణుడి కంటే ఎవరూ మనకు బాగా నేర్పించలేరు. శ్రీ కృష్ణుడు.. కర్ణుడిని అతని జీవితం గురించి జన్మ రహస్యం గురించి తెలియజేసినప్పుడు.. తాను రథసారథి కొడుకు కాదని, కుంతి కొడుకునని, పాండవుల అన్నయ్యనని తెలిసింది. అయినా కర్ణుడి మనసు చలించలేదు. అతని మనసు ఒక్క క్షణం కలవరపడింది. కానీ తన జీవితంలోని ప్రతి నిర్ణయానికి తానే బాధ్యత వహించాడు. తన విధేయత. మిత్రుడికి ఇచ్చిన మాటల నుంచి వెనక్కి తగ్గలేదు.
వైఫల్యం తర్వాత కూడా వదులుకోవద్దు: ఓటమి మీ ముందు ఉన్నప్పటికీ.. ప్రయత్నాన్ని వదులుకోవడం యోధుని లక్షణం కాదు. కర్ణుడు చేసింది ఇదే. ఈ యుద్ధం ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతుందని, అధర్మ పక్షాన నిలబడటం ద్వారా విజయం సాధించే అవకాశం లేదని కర్ణుడికి బాగా తెలుసు. అయినప్పటికీ కర్ణుడు మైదానం వదిలి వెళ్ళలేదు. పాండవుల వైపు ధర్మం.. శ్రీ కృష్ణుడు ఉన్నందున వారు విజయం సాధిస్తారని కర్ణుడికి తెలుసు. అయినా సరే తనను నమ్మిన దుర్యోధనుడిని విడిచిపెట్టలేదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం కర్ణుడిని తిరస్కరించినప్పుడు దుర్యోధనుడు విశ్వసించాడు.
హామీలు కేవలం మాటలు కావు.. వాగ్దానాలు చేయడం కేవలం మాటలకే పరిమితం కాదు.. అవి ఒక బాధ్యత అని కర్ణుడి జీవితం ప్రతి ఒక్కరికీ లోతైన పాఠాన్ని నేర్పుతుంది. కర్ణుడు ఎల్లప్పుడూ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు. పరిస్థితులు ఎంత క్లిష్టంగా మారినా.. తాను ఇచ్చిన మాట నుంచి వెనక్కి తగ్గలేదు. కర్ణుడు తన సంపదను మాత్రమే కాదు.. తనకు సహజంగా వచ్చిన కవచ కుండలాలను చివరికి తన జీవితాన్ని కూడా దానం చేశాడు. కర్ణుడి విధేయత, నిబద్ధత ఎంత అచంచలంగా ఉండేదంటే.. తను మరణం అంచులో ఉన్నానని తెలిసినా కూడా తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వెనుకాడలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు







