AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiruamala Brahmotsavalu: మోహినీ అవతారంలో మలయప్ప స్వామి.. సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా మారిన తిరుగిరులు..

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారంతో వేడుకలు ఐదో రోజుకు చేరాయి. కలియుగ వైకుంఠ నాథుడు మోహినీ అవతారంలో ఊరేగారు. మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు..

Tiruamala Brahmotsavalu: మోహినీ అవతారంలో మలయప్ప స్వామి.. సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా మారిన తిరుగిరులు..
Mohini Avataram
Ganesh Mudavath
|

Updated on: Oct 01, 2022 | 12:35 PM

Share

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారంతో వేడుకలు ఐదో రోజుకు చేరాయి. కలియుగ వైకుంఠ నాథుడు మోహినీ అవతారంలో ఊరేగారు. మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. క్షీర సాగర మథనం సమయంలో మోహినిగా స్వామివారు ఉద్భవించారు. ప్రపంచమంతా మాయా విలాసమని, తన భక్తులు కానివారు మాయాధీనులు కాక తప్పదని స్వామివారు బోధించారు. ఈ మాటను నిరూపించేందుకు ఆయన మోహినీ అవతారాన్ని ప్రదర్శించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుగిరులు కోలాహలంగా మారాయి. పాటలు, నృత్యాలు, కోలాటాల ప్రదర్శనలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇష్ట దైవాన్ని దర్శించుకుని, మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. కాగా.. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరువీధుల్లో ఊరేగారు. రాత్రికి శ్రీదేవి, భూదేవి సమేతంగా బకాసురవధ అలంకరణలో సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.

తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు ప్రత్యేక స్థానం ఉంది. గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి వెల కట్టలేనన్ని ఆభరణాలతో అలంకరిస్తారు. గరుడ వాహన సేవ రోజున తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గరుడ సేవకు సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే 5 అంచెల భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. తిరుపతికి వచ్చే 9 రోడ్లలో వెహికల్ పాసులను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. మాడ వీధల్లో 1.80 లక్షల మంది భక్తులు వాహనసేవలను వీక్షించవచ్చని, భక్తులందరూ సహనంతో నిబంధనలు పాటించాలని కోరారు.

మరోవైపు.. యాత్రికులకు సేవలందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. గరుడ సేవ రద్దీ సందర్భంగా నిమిషానికి రెండు ఆర్టీసీ సర్వీసులను నడిపించాలని నిర్ణయించింది. 5,044 ట్రిప్పులతో 2 లక్షల మంది భక్తుల రాకపోకల కోసం తిరుపతిలో 13 చోట్ల టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసింది. శ‌నివారం గ‌రుడ సేవ సంద‌ర్భంగా ద్విచ‌క్రవాహ‌నాలను కొండమీదకు అనుమ‌తించ‌బ‌డ‌వని టీటీడీ వెల్లడించింది. భ‌క్తుల భ‌ద్రత దృష్ట్యా మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి అక్టోబ‌రు 2వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల ఘాట్ రోడ్లల్లో ద్విచ‌క్ర వాహ‌నాల‌ను అనుమతి రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..