Kunthi Devi Jathara: ఆడువారి మాట నోటిలో దాగదని ధర్మరాజు ఎందుకు శపించారు..?
దళితులు కుంతీదేవిని తమ ఆడ బిడ్డగా కొలుస్తున్నారు. ఇలా ఉమ్మడి గోదావరి జిల్లాతోపాటు కోనసీమలో ప్రతి ఏటా కుంతీదేవి జాతరను ఘనంగా నిర్వహిస్తారు.
తింటే నేతి గారెలు తినాలి, వింటే మహాభారతం వినాలి అన్నారు పెద్దలు. ఎందుకంటే మహాభారతంలో ఉన్న ఎన్నో ధర్మ సూక్ష్మాలు నిత్య జీవితంలో మనకు ఉపయోగపడతాయి. మహా భారతంలోని స్త్రీ పాత్రలు ముఖ్యంగా గాంధారి, కుంతీదేవి.. వీరిద్దరి పాత్రలు విశిష్ట మైనవి. ఇక్కడ పాండు రాజు భార్య కుంతీదేవి. ఆమె దుర్వాసన మహామునికి సేవలు చేయటం వల్ల బాల్యంలోనే ఒక వరం పొందారు. ఆమె కోరుకున్న వరాన్ని దేవతలు అనుగ్రహించారట.
కుంతీదేవి చిన్నపిల్ల కావటంచేత సూర్యుడిని చూసి తనకు ఆడుకునేందుకు సూర్యుడు లాంటి ఒక బాలుడు వుంటే బాగుటుందని కోరుకుందట. నిజానికి దుర్వాసన మహాముని వరం పరీక్షించేందుకు ఇలా కోరుకున్నప్పటికీ వెంటనే సూర్య భగవానుడు ప్రత్యక్షమై కుంతీదేవి వద్దని వారించినా, ఆమెకు పిల్లవాడిని ప్రసాదించాడట. అప్పుడు బాలిక అయిన కుంతీదేవి సమాజానికి భయపడి, నిందల నుంచి తప్పించుకునేందుకు సూర్య భగవానుడు ప్రసాదించిన బిడ్డను నదిలో వదిలివేస్తుందట. కానీ ఆ బిడ్డనే కర్ణుడు. అతను ఎదిగి కుంతీదేవీ సంతానం పాండవులను ఎదిరించి, కౌరవ పక్షపాతిగా తరువాతి కాలంలో మారుతాడు.
దుర్యోధనుడికి మిత్రుడిగా అతడి విజయం కోసం యుద్ధంలో దిగితే పాండవుల ఓటమి ఖాయమనుకుని శ్రీకృష్ణుడి సూచన మేరకు కర్ణుడిని కలుసుకుంటుంది కుంతీదేవి. ఆసమయంలో ఎన్నో కోరకూడని కోరికలను ఆమె కోరుతుంది. పాండవులకు ప్రాణ హాని తలపెట్టవద్దంటుంది. ధర్మరాజు పట్టాభిశక్తుడిని చేయాలంటుంది. కర్ణుడిని పాండవుల పక్షం వహించమంటుంది. వీటికి ఒక్క అర్జుడిని మాత్రం సంహరిస్తానని కర్ణుడు ఆమెకు అభయం ఇస్తాడు. ఇదంతా మహాభారతంలో ఉన్న కథ సారాంశం.
అయితే ఇక్కడ ఒక జాతీయం వదికలోకి వచ్చింది. కుంతి + అమ్మ కుంతెమ్మ, కుంతికి వికృత పదం గొంతి. వాడుకలో అలవి కాని వాటిని కోరిన కుంతి కోరికలను గొంతెమ్మ కోరికలు అంటారు. అయితే ఉభయగోదావరి జిల్లాల్లో గొంతెమ్మ దేవతలా ఆరాధిస్తున్నారు. ఆమెను కుంతీదేవిగా నేటికి ఆరాధిస్తూ భక్తులు పూజలు చేస్తున్నారు. తెలుగులో మరో వాడుక పదం ‘ఆడువారికి నోటిలో మాట దాగదు’ ఇది కూడా కుంతీదేవి వలనే వాడుకలోకి వచ్చిందని ప్రచారం.
మహాభారత యుద్దం ముగిసింది. కౌరవ పక్షం మొత్తం మరణించారు. పాండవులు విజయం సాధించారు. కానీ కుంతీదేవి ముఖంలో మాత్రం సంతోషం లేదు. ఆమె రోదిస్తుంది. ఆ సమయములో తల్లి వద్దకు చేరుకున్న పాండవులకు కర్ణుడు వారికి అగ్రజుడని, రాజ్యాధికారం పొంది, గౌరవ మర్యాదలు పొందవలసిన వాడని చెబుతుంది. తన తల్లి కుంతీదేవి చెప్పిన విషయాలు విన్న పాండవులు తీవ్ర వేదనకు లోనవుతారు. ధర్మరాజు, కుంతీదేవి మధ్య ఈ సందర్భంగా జరిగిన సంభాషణలో తన తల్లి కుంతిని ఉద్దేశించి ఇంతటి నష్టానికి కారణం నిజం దాచటం, కాబట్టి ఇక మీదట ఆడువారి నోట మాట దాగదని శపిస్తాడు. తదనతరం జానపదుల కధనాల ప్రకారం పాండవులను వీడి కుంతీదేవి మనస్తాపంతో వెళ్ళిన సమయంలో ఆమెకు అక్కడి ప్రజలు ఆశ్రయం కల్పించినట్లు కథనాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడి వచ్చి ఆమెతో మాట్లాడి తీసుకువెళ్లే వరకు, ఆమె సామాన్య జీవితం గడుపుతుందట.
దీంతో అప్పటి నుంచి దళితులు కుంతీదేవిని తమ ఆడ బిడ్డగా కొలుస్తున్నారు. ఇలా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం లోని సూర్యారావు పాలెంలో కుంతీదేవి జాతర ఘనంగా నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ప్రతిఏటా కుంతీదేవి జాతరను అట్టహాసంగా నిర్వహిస్తారు. గొంతెలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన అమ్మవారి వాహనాన్ని ఆర్కెస్ట్రాలు, వేషధారణలు, మేళ తాళాలు, డీజే లతో అంగరంగ వైభవంగా, గ్రామంలోని వాడవాడలా ఊరేగిస్తారు. అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు, యువత రోడ్డు పొడవునా నిలబడి నీరాజనాలు పలుకుతారు. ఇలా రెండు జాతీయాలు మనిషి జీవితంతో ముడి పడి ఉండటంతో పాటు తరుచుగా సంభాషణల్లో నేటికి దొర్లుతున్నాయి. వాటి నిజమైన అర్ధం తెలియని వారు సైతం ఈ పదాలను ఉపయోగిస్తుండటం వల్లే తెలుగులో కొన్ని పదాలు నేటికి మనుగడలో ఉంటున్నాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..