Kanipakam: ఉత్సవాలకు ముస్తాబైన కాణిపాకం.. స్వామి వారి కుంభాభిషేకానికి సర్వం సిద్ధం
వినాయకచవితి (Vinayaka Chavithi) ఉత్సవాలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం (Kanipakam) ముస్తాబవుతోంది. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి మహా కుంభాభిషేకానికి అధికారులు ఏర్పాట్లు...
వినాయకచవితి (Vinayaka Chavithi) ఉత్సవాలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం (Kanipakam) ముస్తాబవుతోంది. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి మహా కుంభాభిషేకానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 21న ఆదివారం శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు వరకు విమాన గోపురం, ధ్వజస్తంభానికి ఆలయ అధికారులు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. మహా కుంభాభిషేకంలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి చతుర్థ కాల హోమం, మహా పూర్ణాహుతి, ఉదయం 8 నుంచి 8.30 గంటల వరకు రాజగోపురం, పశ్చిమ ద్వార గోపురం, స్వామి వారి విమాన గోపురం, నూతన ధ్వజ స్తంభములకు మహా కుంభాభిషేకం. ఉ.8:30 నుంచి 9 గంటల వరకు స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి కుంభాభిషేకం, తీర్థ ప్రసాద వినియోగం, యజమానోత్సవం. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి స్వామి వారి మూల విరాట్ దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి తిరు కల్యాణం నిర్వహిస్తారు. తర్వాత గ్రామోత్సవం జరుపుతారు. ఈనెల 21 నుంచి మూల విరాట్ స్వయంభు వినాయక పునర్దర్శనం భక్తులకు అందుబాటులో రానుంది.
కాగా.. కాణిపాక వరసిద్ధుడు వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సీఎం జగన్ కు ఆలయ అధికారులు ఆహ్వాన పత్రం అందించారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్‌ఎస్ బాబు, కాణిపాకం (Kanipakam) దేవస్ధానం ధర్మకర్తల మండలి చైర్మన్ మోహన్‌రెడ్డి, ఆలయ ఈవో సురేష్ బాబు తదితరులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరారు.
ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 20 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అంతే కాకుండా ఈ నెల 21న జరగనున్న చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం ఆహ్వానపత్రికను కూడా సీఎంకు (CM Jagan) అందించారు. ఆహ్వాన పత్రాలను ముఖ్యమంత్రికి అందజేసిన అనంతరం ఆలయ వేద పండితులు స్వామివారి ప్రసాదాలు, వస్త్రం అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..