AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జలుబు, జ్వరంతో బాధపడుతున్న జగన్నాధుడు.. 15 రోజులు దర్శనం బంద్.. అంతుచిక్కని రహస్యం!

మనుషులు సీజనల్ వ్యాధుల బారిన పడటం సహజం. కానీ మనుషులకే కాదు జీవ కోటిని, ముక్కోటి లోకాలను శాసించే ఆ దేవదేవుడు సైతం ఈ సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారన్న విషయం మీకు తెలుసా? సాక్షాత్తు ఆ దేవదేవుడు అయిన జగన్నాధుడే గత కొద్ది రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. 15 రోజుల పాటు భక్తులకు దర్శనాలు కూడా ఇవ్వకుండా చీకటి గదిలో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ పదిహేను రోజులు రహస్యంగా ఆయుర్వేద వైద్యం అందిస్తున్నారట అర్చక స్వాములు. దైవానికి జలుబు, జ్వరము ఏంటి అని ఆశ్చర్యపుతున్నారా? అయితే స్టోరీ చదవాల్సిందే..!

జలుబు, జ్వరంతో బాధపడుతున్న జగన్నాధుడు.. 15 రోజులు దర్శనం బంద్.. అంతుచిక్కని రహస్యం!
Palakonda Jagannath Swamy Temple
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Jul 03, 2026 | 7:53 AM

Share

వేసవి కాలం ముగిసి వర్షాకాలం ప్రారంభం అయింది అంటే చాలు సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. జలుబు, మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ప్రతి ఏటా ఈ కాలంలో సహజంగా వస్తూ ఉంటాయి. అయితే మనుషులు, పశుపక్షాదులను వ్యాధులు పట్టి పీడించటం సహజం. కానీ ఆ దేవదేవుడు అయిన జగన్నాధ స్వామిని సైతం ఈ సీజనల్ వ్యాధులు పట్టి పీడిస్తున్నాయట. అవును ప్రస్తుతం జగన్నాధ స్వామి అతనితో పాటు ఆయన సోదరుడు అయిన బలబద్రుడు, సోదరి అయిన సుభద్ర దేవిలు జలుబు, జ్వరంతో బాధ పడుతున్నారట. అస్వస్థత కారణంగా గత కొద్ది రోజులుగా స్వామి వారు.. భక్తులకు దర్శనాలు ఇవ్వడం కూడా బంద్ చేశారు.

సాధారణంగా జ్వరం వస్తే మనం ఎలా అయితే అన్నానికి బదులు తేలికపాటి ఆహారం తీసుకుంటామో… వైద్యుని దగ్గరకు వెళ్ళి మందులు తీసుకుంటామో అదే మాదిరిగా స్వామి వారు కూడా తన ఆహారంలో మార్పులు చేసుకుని తగిన వైద్య సేవలు పొందుతున్నారు. స్వతహాగా జగన్నాధ స్వామి వారు అన్న ప్రియులు. అందుకే ఆయనకు నైవేద్యంగా ఎంతో శుచితో,శుభ్రతతో స్వయంగా అర్చక స్వామే వంట చేసి స్వామి వారికి ప్రతి రోజు క్రమం తప్పకుండా భోగం పెడతారు. ఒరిస్సా లోని పూరి ఆలయంలో అయితే స్వామివారికి రోజుకి 60 పుట్లు అన్నం, పప్పు, వివిధ రకాల కూరలు, పానీయాలు పెడతారు అర్చకులు. కానీ జలుబు, జ్వరం కారణంగా కొద్ది రోజులుగా స్వామివారికి అన్నం ఇవ్వటం లేదట అర్చకులు. పైగా గర్భగుడిలో కాకుండా 15 రోజుల పాటు ఉక్క గదిలో ఉంచుతున్నారు. స్వామివారికి, బలభద్రుడు, సుభద్రా దేవిలకు రహస్యంగా ఆయుర్వేద వైద్యం అందిస్తారు అర్చకులు. అన్నం కాకుండా స్వామివారికి కేవలం ఫలాలు, కషాయం, ఔషద మూలికలు అందిస్తారు.

జగన్నాధ స్వామి రథా యాత్ర ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఒరిస్సాలోని పూరి ఆలయం సహా అన్ని జగన్నాధ స్వామి ఆలయాలలో ప్రతియేట ఈ సాంప్రదాయం జరుగుతుంది. పూరి ఆలయంలో నిర్వహించినట్టుగానే ఉత్తరాంద్రలోని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో వెలిసిన జగన్నాధ స్వామి ఆలయంలోనూ ప్రతిఏటా ఈ కార్యక్రమం జరుగుతుంది. పాలకొండలో ఉన్న జగన్నాధస్వామి ఆలయం 1650 నాటి పురాతన ఆలయం. ఇక్కడ ఆలయం కూడా పూరీ ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఇంతకీ జగన్నాధ స్వామివారికి జలుబు, జ్వరం ఎందుకు వచ్చాయి అంటే దానికి ఒక కథ ఉంది.

ఆలయ గర్భగుడిలో ఉండే దేవత మూర్తులు ఎక్కడైనా సహజంగా రాతితో గాని పంచలోహ విగ్రహాలతో గాని ఉంటారు. కానీ జగన్నాధుడి విగ్రహం చెక్కతో తయారు చేసి ఉంటాయి. ఈ విగ్రహానికి ఏడాదిలో ఒక్కసారి మాత్రమే నేరుగా అభిషేకాలు నిర్వహిస్తారు. అది కూడా ప్రతి ఏటా జ్యేష్ట పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. దీనిని జ్యేష్టాభిషేకం అంటారు. జ్యేష్ట పౌర్ణమిని పురస్కరించుకొని కిందటి నెల జూన్ 29వ తేదీన గర్భ గుడిలోని జగన్నాధుడు, బలభద్ర, సుభద్ర దేవి మూల విరాట్ లను మండపంలోకి తీసుకువచ్చి జ్యేష్టాభిషేకం నిర్వహించారు. పవిత్ర జలాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అభిషేకలతో తడవడం వలన స్వామివారికి, బలబద్రుడు, సుభద్ర దేవిలకు జలుబు, జ్వరం వచ్చిందట. అందుకే జూన్ 29వ తేదీ రాత్రి నుండి స్వామి వారిని ఉక్క గదిలో పెట్టి ఆయుర్వేద వైద్యం అందిస్తూ వస్తున్నారు అర్చకులు.

జగన్నాధుడు అనారోగ్యంతో ఉన్న ఈ 15రోజులు స్వామివారు ఉండే గదిలోకి అర్చక స్వామి తప్ప ఇతరులు ఎవరిని లోపలకి అనుమతించరు. స్వామి వారికి ఇచ్చే ఆయుర్వేద వైద్యం ఏంటి అనేది కూడా అర్చకులు బయటకు చెప్పరు. పూరి ఆలయంలో అయితే మాత్రం వైద్యం అందించేందుకు ప్రత్యేక ఆయుర్వేద వైద్యులను నియమిస్తారు. కానీ మిగతా జగన్నాధుడు ఆలయాలలో మాత్రం అర్చకులే ఈ వైద్యం అందిస్తారు. ఇలా జ్యేష్ట పౌర్ణమి రోజు రాత్రి ఉక్క గదిలోకి వెళ్ళిన స్వామివారు తిరిగి 15 రోజుల తర్వాత అనగా అమావాస్య రోజు ఈనెల 14వ తేదీన ఆ గది నుండి స్వామివారు బయటకు వచ్చి గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. దీనినే నేత్రోత్సవం అంటారు. 15 రోజులుగా ఉక్క గదికే పరిమితం అయిన జగన్నాధుడు అనారోగ్యం నుండి కోలుకొని అమావాస్య రోజు తిరిగి భక్తులకు దర్శనం ఇస్తారు. ఆరోజు స్వామి వారికి హోమం, సంప్రోక్షణ, అన్న భోగం చేపడతారు.

అయితే స్వామివారికి జలుబు జ్వరం రావటం వెనుక ఇంకొక కథ కూడా ఉంది. స్వామి వారు భక్త వల్లభుడు. పురాణ కథనం ప్రకారం జగన్నాధ స్వామికి మాధవ దాసుడు అనే అత్యంత ప్రియ భక్తుడు ఉండేవాడట. అతడు చాలాకాలంగా ఒక తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన బాధను తగ్గించమని దేవుని ప్రార్థించాడు. కానీ తన పూర్వజన్మ కర్మల కారణంగా అనారోగ్యం ముగియటానికి కేవలం 15 రోజులు మాత్రమే ఇంకా మిగిలి ఉంది. ఆ తర్వాత అతనికి మోక్షం లభిస్తుంది. కానీ తన భక్తుని బాధను చూసిన స్వామి వారి హృదయం చలించిపోయింది. దీంతో మాధవ దాసు కు మిగిలి ఉన్న చివరి 15 రోజులు అనారోగ్యాన్ని స్వయాన స్వామివారి స్వీకరించారట. అందుకే స్వామివారికి జ్వరం, జలుబు వస్తుంది అనేది ఒక కథనం.

ఉక్క గది నుండి బయటకు వచ్చిన జగన్నాధుడు పూర్తి ఆరోగ్యవంతుడై తొలి దశమి రోజున అనగా జూలై 16వ తేదీన బలబద్రుడు, సుభద్ర దేవితో కలిసి రథంపై గుణిచా మందిర్ కి బయలుదేరుతారు. ఆ రోజే జగన్నాధుడి రథయాత్ర ప్రారంభమవుతుంది. తిరిగి జూలై 26న ప్రధాన ఆలయం వద్దకు రథం చేరుకుంటుంది. జూలై 27న తిరిగి ఆలయ గర్భగుడిలోకి స్వామివారు ప్రవేశిస్తారు. దాంతో జగన్నాధ రథయాత్ర పూర్తవుతుంది. జగన్నాధుడు రూపం లోనే కాదు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతలు ఉన్నాయి. పూరి జగన్నాధుడి మూల విరాట్ లో కృష్ణుడు గుండె అమర్చబడి ఉంటుందని పండితులు చెబుతుంటారు. ధర్మ పాలన, భార్యా, భర్తల మధ్య అన్యోన్యతను రామతత్వం తెలియజేస్తే.. బలభద్రుడు, సుభద్రా దేవిలతో భక్తులకు దర్శనం ఇచ్చే జగన్నాధతత్వం సోదరి పట్ల ప్రేమానుబంధాన్ని తెలియజేస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us