AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు పొరపాటున కూడా చేయొద్దు..

హిందూ ధర్మ విశ్వాసాల ప్రకారం చీపురును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. అందుకే చీపురు కొనడం, ఇంట్లో నిల్వ చేయడం, ఉపయోగించడం, పాత చీపురును బయట పడేయడం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తారు. చీపురును ఏ దిక్కున ఉంచాలి? ఎప్పుడు కొనాలి? పాత చీపురును ఎప్పుడు బయటకు పంపాలి? చీపురును తలకిందులుగా ఎందుకు పెట్టకూడదు? వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.

పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు పొరపాటున కూడా చేయొద్దు..
Broom Vastu
Shaik Madar Saheb
|

Updated on: Aug 11, 2026 | 6:29 PM

Share

చీపురు ఇంటిని శుభ్రంగా ఉంచేందుకు ఉపయోగపడే ఒక సాధారణ వస్తువు. అయితే, మన ధర్మశాస్త్రాలు చీపురు వినియోగం, కొనుగోలు, పారవేయడం, నిల్వ చేయడం వంటి విషయాలపై నిర్దిష్టమైన నియమాలను సూచిస్తున్నాయి. ఈ నియమాలను పాటించడం ద్వారా ఇంటికి శుభాలు కలుగుతాయని, విస్మరిస్తే ప్రతికూల ప్రభావాలు ఉంటాయని విశ్వసిస్తారు. వాస్తానికి, హిందూ ధర్మం ప్రకారం.. చీపురును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. అందుకే.. చీపురు విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటారు పండితులు..

చీపురు కొనుగోలు నియమాలు:

కొత్త చీపురును కొనేటప్పుడు లేదా ఉపయోగించడం ప్రారంభించేటప్పుడు జాగ్రత్త వహించాలి. సంక్రమణ దినాలు, మహాలయ పక్షాలు, జన్మతిథులు, గ్రహణ సమయాల్లో కొత్త చీపురు కొనడం అరిష్టం. సాధారణంగా శనివారం, మంగళవారం లేదా శుక్రవారాలలో కొత్త చీపురు కొనడం మంచిదిగా భావిస్తారు.

చీపురు పారవేసే నియమాలు:

పాత చీపురును పారవేసే విషయంలోనూ నియమాలున్నాయి. పాత లేదా అరిగిపోయిన చీపురును శనివారం రోజున ఇంట్లో నుంచి బయటికి పంపాలి. మంగళవారం, శుక్రవారం, శనివారం, గురువారం పుష్యమి నక్షత్రం వచ్చిన రోజులలో పాత చీపురును బయట పారవేయకూడదు. అయితే, ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది.. ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు, శవం ఉన్న పరిసరాలను శుభ్రం చేయడానికి ఉపయోగించిన చీపురును తిథి, వారం, నక్షత్రాలతో సంబంధం లేకుండా వెంటనే బయట పారేయాలి. ఆ చీపురును ఇంట్లో అస్సలు ఉంచకూడదు.

చీపురు స్థానం – నిల్వ:

చీపురును ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ధర్మశాస్త్రాల ప్రకారం, చీపురును వాయువ్యం (వాయువ్య మూల) లేదా ఆగ్నేయం (ఆగ్నేయ మూల)లో ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్యం (ఈశాన్య మూల)లో కానీ, పూజ గదికి దగ్గరగా కానీ, పూజ గది లోపల కానీ చీపురును ఉంచరాదు. చీపురు ఎవరికీ కనబడకుండా ఒక మూలని పెట్టాలి. ఇంటికి వచ్చిన అతిథులకు చీపురు కనిపించకుండా చూసుకోవడం కూడా ఒక నియమంగా ఉంది. చీపురును నిలబెట్టేటప్పుడు, ఊడ్చే భాగం కిందకు, చేతితో పట్టుకునే భాగం పైకి ఉండేలా నిలబెట్టాలి. తిరగేసి పెట్టడం తప్పు. చీపురులను అవసరానికి మించి ఎక్కువగా కొని నిల్వ ఉంచుకోకూడదు. చీపురును చాటతో కలిపి ఒకేచోట ఉంచడం కూడా మంచిది కాదు.

శుభ్రపరిచే విధానం:

ఇంటిని చీపురుతో ఊడ్చేటప్పుడు ఎప్పుడూ ఈశాన్యం నుండి నైరుతికి ఊడవాలి. నైరుతి నుండి ఈశాన్యానికి ఊడవకూడదు. దేవుడు ఉన్న ప్రాంతాన్ని, దేవుడి పటాలు, విగ్రహాలు ఉన్న చుట్టూ ప్రాంతాన్ని చీపురుతో అస్సలు ఊడవకూడదు. దానికి బదులుగా ఒక శుభ్రమైన వస్త్రాన్ని ఉపయోగించి తుడవాలి.

ఈ చిన్న చిన్న ధర్మ సూత్రాలను పట్టించుకోకపోవడం వలన మనశ్శాంతి లేకపోవడం, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో గొడవలు వంటి ప్రతికూలతలు ఎదురవుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి, చీపురు వినియోగంలో ఈ నియమాలను పాటించడం శ్రేయస్కరమని పండితులు, వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించడం లేదు..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us