IRCTC: దక్షిణ భారతంలోని ప్రముఖ ఆలయాల దర్శనానికి 12 రోజుల టూర్.. టికెట్ ధరలు, పూర్తి వివరాలు ఇవే!
IRCTC Tour Package: దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ ముంబై నుంచి 12 రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. గోకర్ణ, రామేశ్వరం, గురువాయూర్, మధురై, కన్యాకుమారి సహా పలు ఆలయాలను సందర్శించే ఈ యాత్ర టికెట్ ధరలు, పూర్తి వివరాలు తెలుసుకోండి.

IRCTC Tour Package 2027: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు, అందమైన బీచ్‌లను సందర్శించాలనుకునే భక్తులు, పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) సరికొత్త టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ‘TEMPLE TRAILS OF DAKSHIN’ పేరుతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) నుంచి ఈ ప్రత్యేక రైలు యాత్ర ప్రారంభం కానుంది. 12 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో గోకర్ణ, మురుడేశ్వర్, గురువాయూర్, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరుచిరాపల్లి, కాంచీపురం, మహాబలిపురం వంటి ప్రసిద్ధ ప్రాంతాలను సందర్శించవచ్చు.
టూర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఈ టూర్ 2027 జనవరి 18న ముంబైలోని CSMT నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం 11 రాత్రులు, 12 రోజుల పాటు పర్యటన కొనసాగుతుంది. జనవరి 29న తిరిగి CSMT చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. థానే, కళ్యాణ్, లోణావాలా, పుణె, సతారా, మిరజ్, బెలగావి రైల్వే స్టేషన్లలో కూడా ప్రయాణికులు రైలు ఎక్కేందుకు అవకాశం కల్పించారు.
టూర్‌లో సందర్శించే ప్రముఖ ప్రదేశాలు
- ఈ యాత్రలో తొలుత గోకర్ణలోని మహాబలేశ్వర్ ఆలయం, ఓం బీచ్‌ను సందర్శిస్తారు. అనంతరం మురుడేశ్వర్‌లో ప్రసిద్ధ శివాలయం, సముద్ర తీరాన్ని వీక్షిస్తారు. ఆ తర్వాత గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటారు.
- రామేశ్వరం పర్యటనలో రామనాథస్వామి ఆలయంతో పాటు ధనుష్కోడిని సందర్శిస్తారు. ప్రయాణంలో పంబన్ వంతెన అందాలను వీక్షించవచ్చు. మధురైలో ప్రసిద్ధ మీనాక్షి అమ్మవారి ఆలయ దర్శనం ఉంటుంది.
- కన్యాకుమారిలో కుమరి అమ్మన్ ఆలయం, వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సూర్యాస్తమయ దృశ్యాలను ఆస్వాదించవచ్చు. అనంతరం తిరుచిరాపల్లిలో శ్రీరంగనాథస్వామి ఆలయం, తంజావూరు ఆలయాన్ని సందర్శిస్తారు.
- తర్వాత కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయం, వరదరాజ పెరుమాళ్ ఆలయ దర్శనం ఉంటుంది. చివరగా మహాబలిపురంలోని షోర్ టెంపుల్, కృష్ణుడి వెన్నముద్ద బండ (Krishna’s Butterball) సందర్శనతో పర్యటన ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధరలు ఎంతంటే?
ప్రయాణికుల సౌకర్యాన్ని బట్టి ఐఆర్‌సీటీసీ మూడు రకాల టికెట్ ధరలను నిర్ణయించింది.
- ఎకానమీ (స్లీపర్ క్లాస్): ఒక్కొక్కరికి రూ.20,420.
- స్టాండర్డ్ (3AC): ఒక్కొక్కరికి రూ.32,770.
- కంఫర్ట్ (2AC): ఒక్కొక్కరికి రూ.42,940.
5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు కూడా ప్రత్యేక ధరలు ఉన్నాయి. స్లీపర్ క్లాస్‌కు రూ.19,010, 3ACకు రూ.31,100, 2ACకు రూ.40,940 చెల్లించాలి. భారత్ గౌరవ్ రైలు పర్యాటక ప్రోత్సాహక పథకం కింద సుమారు 33 శాతం రాయితీని అందిస్తున్నట్లు రైల్వే వెల్లడించింది. ఈ రాయితీ ప్యాకేజీ ధరల్లోనే కలిపి ఉంది.
ప్యాకేజీలో ఏమేం ఉంటాయి?
రైలు ప్రయాణం, శాఖాహార భోజనం, హోటల్ వసతి, సందర్శనా ప్రాంతాలకు బస్సు ప్రయాణం, రవాణా సదుపాయాలు, ప్రయాణ బీమా, రైలులో భద్రత వంటి సౌకర్యాలు ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. ఎకానమీ విభాగంలో నాన్ ఏసీ హోటళ్లు, స్టాండర్డ్, కంఫర్ట్ విభాగాల్లో ఏసీ బడ్జెట్ హోటళ్లలో వసతి కల్పిస్తారు.
అయితే స్మారక చిహ్నాల ప్రవేశ రుసుములు, బోటింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్, స్థానిక గైడ్ ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులు ప్యాకేజీలో ఉండవు. ప్రయాణ సమయాలు రైల్వే ఆపరేటింగ్ విభాగం ఆమోదానికి లోబడి ఉంటాయి. తుది సమయాలను ప్రయాణానికి రెండు రోజుల ముందు తెలియజేస్తారు. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాలను ఒకే యాత్రలో దర్శించుకోవాలనుకునేవారికి ఈ టూర్ మంచి అవకాశం.
ఐఆర్‌సీటీసీ TEMPLE TRAILS OF DAKSHIN యాత్ర టికెట్ బుకింగ్, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




