AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేజీ సన్నబియ్యం రూ.100.. అమలు కాని సర్కారు ధరలు !

కేజీ సన్నబియ్యం రూ.100.. అమలు కాని సర్కారు ధరలు !

Phani CH
|

Updated on: Nov 18, 2026 | 5:37 PM

Share

తెలంగాణలో సన్నబియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. కిలో బియ్యం రూ.85 నుంచి రూ.100 వరకు పలుకుతుండటంతో ప్రభుత్వం గరిష్ఠ ధరలు నిర్ణయించి తనిఖీలు ముమ్మరం చేసింది. అయినా మార్కెట్‌లో ధరలు తగ్గడం లేదు. వరి సాగు తగ్గడం, పొరుగు రాష్ట్రాల నుంచి డిమాండ్, నిల్వలు, మిల్లర్లు–వ్యాపారుల మధ్య ధరల వివాదం వంటి అంశాలు ఈ పరిస్థితికి కారణాలుగా చర్చకు వస్తున్నాయి.

మన దేశంలో అన్నం అనేది ప్రతి ఒక్కరి నిత్యావసరం. పేదవాడి ఇంటి నుంచి సంపన్నుల ఇంటి వరకు ప్రతిరోజూ వంటింట్లో బియ్యం ఉండాల్సిందే. అలాంటి బియ్యం ధరలే ఇప్పుడు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. తెలంగాణలో కిలో సన్నబియ్యం ధర రూ.85 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. దీంతో నెలవారీ ఇంటి బడ్జెట్‌లో బియ్యం కోసమే పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగి రేట్లు ఫిక్స్ చేసింది. తనిఖీలు కూడా ముమ్మరం చేసింది. అయినా మార్కెట్‌లో ధరలు మాత్రం తగ్గడం లేదు. అసలు బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు బియ్యం ఎందుకు దొరకడం లేదు? ఈ ధరల వెనుక ఉన్న అసలు లెక్కేంటో డీటెయిల్డ్ గా చూద్దాం. ముందుగా బియ్యం ధరలు పెరగడానికి కారణాలేంటి అనేది చూద్దాం. గత ఏడాది తెలంగాణలో 92.17 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. కానీ ఈసారి సాగు విస్తీర్ణం 78.23 లక్షల ఎకరాలకు తగ్గింది. ఎల్‌నినో ప్రభావం, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతపై ఆందోళన సాగుపై ప్రభావం చూపించాయి. దీంతో భవిష్యత్తులో బియ్యం దిగుబడి తగ్గుతుందనే అంచనాలు మార్కెట్‌లో ఆందోళన పెంచుతున్నాయి. దీనికి తోడు నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో పండే సన్నబియ్యానికి పొరుగు రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌కు కూడా బియ్యం సరఫరా అవుతోంది. దీంతో స్థానిక మార్కెట్‌లో లభ్యతపై ఒత్తిడి పెరుగుతోందనే వాదన ఉంది. అయితే సాగు తగ్గడం ఒక్కటే ధరల పెరుగుదలకు కారణమా? అంటే కాదు. నిల్వలు, సరఫరా, వ్యాపారుల కొనుగోళ్లు, మార్కెట్‌లో ధరల నిర్ణయం కూడా కీలకంగా మారుతున్నాయి. మరోవైపు ఎల్‌నినో పేరుతో కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మార్కెట్‌లో నిల్వలు ఉన్నప్పటికీ బియ్యం ధరలు తగ్గకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. సన్నబియ్యాన్ని మూడు కేటగిరీలుగా విభజించి గరిష్ఠ చిల్లర ధరలను నిర్ణయించింది. బీపీటీ, కేఎన్‌ఎం రకాల బియ్యం కిలో రూ.66, ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా రకాలు కిలో రూ.74, హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్, జైశ్రీరామ్ రకాల బియ్యం కిలో రూ.79గా నిర్ణయించింది. ఈ ధరలకు మించి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని స్పష్టం చేసింది. అంతేకాదు.. ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం తనిఖీలను కూడా ముమ్మరం చేసింది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ బృందాలు వెయ్యి 141 చోట్ల తనిఖీలు చేసి 55 కేసులు నమోదు చేశాయి. వీటిలో 35 క్రిమినల్ కేసులు ఉన్నాయి. లీగల్ మెట్రాలజీ అధికారులు వెయ్యి 545 చోట్ల తనిఖీలు నిర్వహించి 280 కేసులు నమోదు చేశారు. కొన్ని చోట్ల 25 కిలోల బియ్యం బస్తాలను 26 కిలోలుగా ముద్రించి విక్రయించడం, పాత ధరలపై కొత్త ధరల స్టిక్కర్లు అతికించడం వంటి అక్రమాలు బయటపడ్డాయి. అంటే ధరల పెరుగుదలతో పాటు తూకం, ప్యాకింగ్ విషయంలోనూ వినియోగదారులు మోసపోతున్నారన్నమాట. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మిల్లర్ల సహకారంతో మిల్లుల్లోనే 70 విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ధరలకే బియ్యం అందించాలన్నది ఈ కేంద్రాల లక్ష్యం. మరోవైపు మధ్యవర్తుల ప్రమేయం తగ్గించేందుకు జిల్లా స్థాయిలో ప్రైస్ మానిటరింగ్ సెల్‌ను కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన వారు ఇండెంట్ ఇస్తే మిల్లర్ల నుంచి నేరుగా బియ్యం సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ప్రభుత్వం ధరలు నిర్ణయించింది సరే.. ఆ ధరలకు బియ్యం అమ్మడానికి రిటైలర్లు సిద్ధంగా ఉన్నారా? అంటే కొందరు వ్యాపారులు మాత్రం తమకు మిల్లర్ల నుంచే ఎక్కువ ధరకు బియ్యం వస్తోందని చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మితే తమకు నష్టాలు వస్తాయని వాదిస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన పాత నిల్వలను కొత్త ధరలకు అమ్మడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మిల్లర్లు ధాన్యం కొనుగోలు, మిల్లింగ్, రవాణా ఖర్చులను ప్రస్తావిస్తున్నారు. నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వ ధరలకు సరఫరా చేయడం కష్టమని చెబుతున్నారు. దీంతో మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, రిటైలర్ల మధ్య ధరల పంచాయితీ నడుస్తోంది. ఇదిలా ఉంటే నల్గొండ జిల్లాలో సన్నధాన్యం ధరలు తగ్గించారంటూ రైతులు ఆందోళనకు దిగిన ఘటనలు కూడా ఈ మార్కెట్ పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర కావాలి. మరోవైపు మిల్లర్లకు తమ ఖర్చులకు తగ్గట్టుగా ధర రావాలి. ఇంకోవైపు రిటైలర్లు నష్టాలు లేకుండా వ్యాపారం చేయాలి. కానీ చివరకు ఈ మొత్తం వ్యవహారంలో భారం పడుతున్నది మాత్రం బియ్యం కొనుగోలు చేసే సామాన్య వినియోగదారుడిపైనే. మొత్తంగా చూస్తే ప్రభుత్వం ధరలు నిర్ణయించడం, తనిఖీలు చేయడం మాత్రమే సరిపోదు. మిల్లుల నుంచి రిటైల్ దుకాణాల వరకు సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలి. నాణ్యమైన బియ్యం నిర్ణయించిన ధరలకు అందుబాటులో ఉండేలా చూడాలి. అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, తూకం మోసాలపై చర్యలు తీసుకోవాలి. అప్పుడే బియ్యం ధరలకు నిజమైన కళ్లెం పడుతుంది. లేదంటే ప్రభుత్వం ధరలు ఫిక్స్ చేసినా.. మార్కెట్‌లో మాత్రం కిలో సన్నబియ్యం రూ.100 పలుకుతూనే ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యప్ప భక్తులకు అదిరిపోయే న్యూస్‌.. మకర విళక్కు యాత్రకు ప్రత్యేక రైళ్లు!

ఇక RAC లేదు? రైల్వే శాఖ సంచలన నిర్ణయం!

 

Follow Us