AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti Home Decoration Ideas :సంక్రాంతి పండగక్కి మీ అభిరుచి అద్దం పట్టేలా ఇంటి అలంకరణలో సింపుల్ చిట్కాలు

కరోనా నేపథ్యంలో ఈ సారి పండగ ఏ విధంగా జరుపుకుంటారో అన్న అనుమానం పటాపంచలు చేస్తూ.. మాకు పండగ తెచ్చే ఉత్సాహం ముందు ఏ వైరస్‌లు గుర్తుకు రావు అన్నచందంగా ప్రజలు...

Sankranti Home Decoration Ideas :సంక్రాంతి పండగక్కి మీ అభిరుచి అద్దం పట్టేలా ఇంటి అలంకరణలో సింపుల్ చిట్కాలు
Surya Kala
|

Updated on: Jan 14, 2021 | 4:16 PM

Share

Sankranti Home Decoration Ideas : హిందువులు నిర్వహించుకునే అతిముఖ్యమైన పండగల్లో ఒకటి సంక్రాంతి. ఇది భోగి, మరక సంక్రాంతి, కనుమ పేర్లతో మూడు రోజులు జరుపుకుంటున్నా నిజానికి ఈ పండగ తెలుగు రాష్ట్రాల్లో నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. కొత్త అల్లుళ్లు, ఆడపడుచులు, చుట్టాలు, మిత్రుల రాకతో ప్రతి ఇంటిలో పండగ వాతావరణం ప్రతిభింబిస్తుంది. ఉపాధి కోసం పట్నంబాట పట్టిన వారు తిరిగి సొంతూళ్లకు చేరుకున్నారు. సొంతూళ్లల్లో అయినవారి మద్య పండగ జరుపుకుంటున్నారు. మూడు రోజులపాటు జరుపుకునే సంక్రాంతి సంబరాల్లో రంగవల్లులు, గొబ్బెమ్మలు కొత్త అల్లుళ్ళు కోడిపందాలతో.. పాటు పిండివంట ఘుమఘుమలు. కరోనా నేపథ్యంలో ఈ సారి పండగ ఏ విధంగా జరుపుకుంటారో అన్న అనుమానం పటాపంచలు చేస్తూ.. మాకు పండగ తెచ్చే ఉత్సాహం ముందు ఏ వైరస్‌లు గుర్తుకు రావు అన్నచందంగా ప్రజలు ఊరువాడా పిండివంటలు,కొత్త బట్టలతో సంక్రాంతికి స్వాగతం పలికారు. అయితే పండగ సమయంలో ప్రతి ఒక్కరు తమ ఇంటిని అందంగా కనిపించేలా తమ అభిరుచికి అద్దంపట్టేలా తీర్చి దిద్దుకుంటారు.

సంక్రాంతి పండగ అలంకరణ కోసం సృజనాత్మకతతో తమ ఇంటి ఆకృతికి అందాన్ని జోడిస్తారు. అలంకరణతో ఇంటిని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపడమే కాదు, స్నేహితులు, బంధువుల నుండి ప్రశంసలు కూడా పొందుతారు. అంతేకాదు పండగ సందర్భంలో బొమ్మల కొలువుని ఏర్పాటు చేసి తమ సృజనాత్మకత, నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. కొలువు ఏర్పాటు చేయడానికి అలంకరణకు డబ్బు వృధా చేయకుండా వ్యర్ధాలను మంచి మంచి బొమ్మలుగా తయారు చేసేవారు కూడా ఉన్నారు. ఇంటిలో అందుబాటులో ఉన్న వస్తువులను రీసైకిల్ చేసి బొమ్మల కొలువులో పెట్టి సంతోషపడతారు. ఇక ఇంటి ముందు లైటింగ్‌‌ను కూడా ఏర్పాటు చేస్తారు కొందరు.

పురాతన కాలం నుండి పండుగల అలంకరణలో పువ్వులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తునే ఉన్నాయి. ఈ కాలంలో ఎక్కువగా వికసించే పువ్వులు బంతి పువ్వులు. ఇవి స్థిరత్వంతో ఉండడమే కాదు.. త్వరగా వాడిపోవు. దీంతో ఎక్కువ మంది తమ ఇంటి అలంకరణ కోసం బంతిపువ్వులనే ఉపయోగిస్తారు. మరికొందరు బెలూన్లను పువ్వులకు జత చేసి మరింత అందంగా తమ ఇల్లు కనిపించేలా అలంకరిస్తారు. చూపరులను ఆకర్షిస్తారు.

సంక్రాంతి అలంకరణలో ఇవన్నీ ఒక ఎత్తు ఐతే ఇంటి ముందు రంగవల్లులు మరొక ఎత్తు. అవును సంక్రాంతి అనగానే ముందుగా మనకి గుర్తు వచ్చేవి ముగ్గులు. హరివిల్లును భువికి తెచ్చారా అనిపించేలా అలంకరించే ముగ్గులు.. ఆ ముగ్గు మధ్యలో ఆవుపేడతో అలంకరించే గొబ్బెమ్మ.. ఆ గొబ్బెమ్మ మధ్యలో ఠీవీగా నిలబడే బంతి పువ్వు.. ఈ దృశ్యం చూడాల్సిందే గానీ వర్ణింప శక్యం కాదు. మహిళల కళాదృష్టికి చిహ్నంగా ముంగిళ్ళ ముగ్గులు నిలుస్తాయి. ధనుర్మాసం నెల పెట్టింది మొదలు సంక్రాంతి పండుగ వరకూ ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో కళకళలాడుతాయి. ముగ్గులు వేయడానికి ఈ నెలంతా బియ్యపు పిండిని వాడతారు. ఇంటి ముందు వాకిలిలో పేడ కళ్ళాపి జల్లి.. ముగ్గును ముచ్చటగా తీర్చి దిద్దుతారు. రకరరాలుగా అలంకరిస్తారు. కొంత మంది రంగవల్లులు రంగులతో మరికొందరు రంగులకు ఉప్పుని అద్ది.. మరికొందరు బియ్యకు రంగులు అద్ది ఇలా రకరకాలుగా తమ ఆలోచనలకు కళాభిరుచికి అద్దం పట్టేలా తీర్చిదిద్దుతారు. మన సాధారణ దృష్టితో చూస్తే పండగలు రోజువారీ జీవితానికి ఓ ఆటవిడుపు కావచ్చు.. కానీ మన పూర్వీకులు కాల చక్రానికి, ఋతువులు, వాతావరణం అన్నీ దృష్టిలో పెట్టుకుని పండగలను.. వాటికి నియమాలను ఏర్పరిచారు. అవి పాటిస్తే.. మానవ మానవజీవితం ప్రయాణం సుఖసంతోషాలతో సాగిపోతుందని చెప్పవచ్చు. ఈ విషయాన్ని నేటి తాజా పరిస్థితులు మనకు చెప్పకనే చెబుతున్నాయి.

Also Read: సంక్రాంతి పండువ వేళ చేసుకునే వంటల్లో ఒక్కో పిండి వంటకి ఒక్కో ప్రత్యేకత..