Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti a Scientific Vedic Fest:వేల సంవత్సరాల పూర్వమే ఋషులు మరకందించిన సంక్రాంతి ఆచారాలు, వైదిక రహస్యాలు

మనవిజ్ఞానం అందుకోవడానికి ప్రస్తుతపు విజ్ఞాన ప్రపంచానికి మరో వెయ్యేళ్లు పట్టవచ్చు కానీ వేల సంవత్సరాల పూర్వమే ఋషులు సూర్య సిద్దాంతం ద్వారా ఈ విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు.

Sankranti a Scientific Vedic Fest:వేల సంవత్సరాల పూర్వమే ఋషులు మరకందించిన సంక్రాంతి ఆచారాలు, వైదిక రహస్యాలు
Follow us
Surya Kala

|

Updated on: Jan 14, 2021 | 6:05 PM

Sankranti a Scientific Vedic Festival: హైందవ సంప్రదాయంలో ప్రతి పండుగలోనూ ఆధ్యాత్మిక రహస్యంతో పాటు వైద్య విశేషం, విజ్ఞానశాస్త్ర దృక్పథం, సామాజిక స్పృహ ఇలా ఎన్నో దాగుంటాయి ఆయా పండుగ వచ్చిన కాలాన్ని బట్టీ – ఆ పండుగకి ఏర్పాటు చేయబడిన ఆచారాలని బట్టీ. ఆ దృక్కోణంలో చూస్తే సాధారణమైన పండుగల్లోనే ఇన్ని విశేషాలు కన్పిస్తూంటే, ఈ సంక్రాంతిని ‘పెద్ద పండుగ’ అని వ్యవహరించారంటే దీన్లో ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్నట్లే. సంక్రాంతిని కొన్ని ప్రాంతాలలో పతంగుల పండుగగా జరుపుకుంటారు. దృష్టాదృష్టాలకుప్రతీకగా ఈ సంప్రదాయాన్ని పేర్కొంటారు.

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఏర్పడిన పరిస్థితులు మనదేశం వైపు తొంగిచూసేలా చేస్తున్నాయి. మనదేశపు ఆచార వ్యవహారాలను, ఆహార నియమాలను, సంస్కృతి సంప్రదాయాలను అర్ధం చేసుకొనేందుకు.. వీలయితే పాటించేందుకు కూడా రెడీ అయ్యాయి. యోగం అంటే రెంటి కలయిక అని అర్థం. శరీరం- మనసూ అనేవే ఆ రెండూ . శరీరానికి స్నానాన్ని చేయించినా మనసు అపవిత్రంగానూ దురాచనలతోనూ ఉంటే అది ‘యోగం’ (రెంటి కలయిక) కా(లే)దు. అదే తీరుగా మనసెంతో పరిశుభ్రంగా ఉన్నా శరీరం స్వేదమయంగానూ అలసటతోనూ సహకరించ(లే)ని స్థితిలోనూ ఉన్నట్లయితే అది కూడా ‘యోగం’ అయ్యే వీల్లేదన్నారు పెద్దలు. ఈ కారణంగా శరీరమూ మనస్సూ అనే రెండూ పవిత్రంగా ఉండేందుకు స్నానాలని చేయాలని ఓ నియమాన్ని చేశారు పెద్దలు.

కార్తీకం నెలపొడుగునా నదీ స్నానాలని చేసినట్లే… ఈ మార్గశీర్ష పుష్యమాసాల్లో కూడా ప్రతిరోజూ నదీ స్నానమాచరించమన్నారు. దీనికి మరో రహస్యాన్ని కూడా జోడించవచ్చు. చంద్రుని జన్మ నక్షత్రం మృగశిర. మృగశిర + పూర్ణిమ చంద్రుడు కలిస్తే అది మార్గశీర్ష మాసంఅవుతుంది. చంద్రునికి ఇష్టురాలైన భార్య ‘రోహిణి’ ఈ రోహిణి, మృగశిర అనే రెండు నక్షత్రాలూ ఉండే రాశి ‘వృషభం’. కనుక ఈ మార్గశీర్షం నెలపొడుగునా స్నానాలని చేస్తే మనకి చంద్రుడు మనశ్శాంతిని అందిస్తాడు. చలి, మంచు బాగా ఉన్న కాలంలో తెల్లవారుజామున స్నానాలని చేయగలిగిన స్థితిలో మన శరీరమే ఉన్నట్లయితే యోగ దర్శనానికి భౌతికంగా సిద్ధమైనట్టేననేది సత్యం. మార్గశిరం మాసం నెలా ఇంటిముంగిట రంగవల్లులు తీర్చిదిద్దుతాం.. రంగమంటే హృదయం అనే వేదిక అని అర్థం. ‘వల్లిక’ అంటే తీగ అని అర్థం. ప్రతి వ్యక్తికీ తన బుద్ధి కారణంగా అనేక వల్లికలు అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి.

అందుకనే ముగ్గులో చంద్రుడి ని గుర్తు ని పెట్టి .. కుంకుమతో పూజిస్తారు. సూర్యుడు బుద్ధికి అధిష్ఠానం కనుక మనిషి ఎల్లప్పుడూ సక్రమమైన ఆలోచనలతో కలిగిఉంటాడని పెద్దలు ఈ నియమం పెట్టారు. ఆ సక్రమాలోచనలకి అనుగుణంగానే మనసు ఆదేశాలనిస్తూంటే శరీరం తన అవయవాలైన చేయి కాలు కన్ను అనే వీటితో ఆయా పనులని చేయిస్తూంటుందన్నమాట. మొదటి రోజు భోగి పండుగగా జరుపుకుంటాం.. భోగము అంటే పాము పడగ అని అర్థం. భోగి అంటే అలా పడగ కలిగినది ‘పాము’ అని అర్థం. అలా ఎత్తిన పడగతో పాము ఎలా ఉంటుందో అదే తీరుగా వ్యక్తి కూడా శరీరంలోని వెన్నెముకని లాగి పట్టి స్థిరాసనంలో (బాసింపెట్టు) ఉంటూ, ముక్కు మీదుగా దృష్టిని ప్రసరింపజేస్తూ కళ్లని మూసుకుని తన ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే అదే ‘యోగ దర్శన’మౌతుందని చెప్పడానికీ, ఆ యోగ ప్రారంభానికి సరైన రోజు నేడే అని తెలియజేయడానికీ సంకేతంగా పండుగలోని మూడు రోజుల్లోనూ మొదటి రోజుని ‘భోగి’ అని పిలిచారు. యోగ ధ్యానాన్ని చేస్తూన్న వేళ బుద్ధి సక్రమంగా ఉండాలని చెప్పడానికీ, దాన్ని బాల్యం నుండీ అలవాటు చేయాలని చెప్పడానికీ సంకేతంగానే – పిల్లలకి రేగుపళ్లని పోస్తూ వాటిని ‘భోగిపళ్లు’గా వ్యవహరించారు.

రెండవ రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. “సరతి చరతీతి సూర్యః” అనగా సంచరించువాడు సూర్యుడు. భాస్కరుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక్క రోజు. “ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత” అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయణం రాత్రి. “సంక్రాంతి” లేదా “సంక్రమణం” అంటే “చేరడం” లేదా “మారడం”అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. రవి మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవడైతే స్నానం చేయడో అలాంటి వాడు ఏడు జన్మలు రోగిగా , దరిద్రునిగా ఉండిపోతాడని స్కాంద పురాణం చెబుతోంది. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజు తన కుమారుడైన శని ఇంటికి వెళతాడు. ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరవైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు. ధనుర్మాసం సంవత్సరం మొత్తంలో అత్యధిక రేడియేషన్ విడుదల అయ్యే మాసం కావడం వలన మన పూర్వీకులు ఆవుపేడతో ఇల్లు అలకడం మరియు ఇంటి గొబ్బిళ్ళు రూపంలో ఆవు పేడ మరియు గరికపొడి చల్లడం ద్వారా ప్రతి ఇంటిని రేడియేషన్ నుండి కాపాడుకునే వారు అలాగే శుభకార్యాలు నిషేదించడం ద్వారా దూర ప్రయాణాలు ఆపేవారు.

భూమి మీదకు రేడియేషన్ ఎక్కువగా వచ్చే మకర సంక్రమణం సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి మకర సంక్రాంతి 4రోజుల పండగ ద్వారా రేడియేషన్ నుండి మానవులను కాపాడటానికి వివిధ ఆచారాలు ఏర్పాటు చేశారు.

మన విజ్ఞానం అందుకోవడానికి ప్రస్తుతపు విజ్ఞాన ప్రపంచానికి మరో వెయ్యేళ్లు పట్టవచ్చు కానీ వేల సంవత్సరాల పూర్వమే ఋషులు సూర్య సిద్దాంతం ద్వారా ఈ విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు.

Also Read: సంక్రాంతి పండగక్కి మీ అభిరుచి అద్దం పట్టేలా ఇంటి అలంకరణలో సింపుల్ చిట్కాలు