Vastu Tips: ఉద్యోగంలో ఎదగాలంటే ఏం చేయాలి? ఈ వాస్తు టిప్స్ తప్పక పాటించాల్సిందే..
సాధారణంగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అక్కడ మరింతగా ఎదగాలనే తపన ప్రారంభం అవుతుంది. ఉద్యోగంలో ఒక్కో మెట్టు పైకి ఎదగడానికి వాస్తు పరంగా

సాధారణంగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అక్కడ మరింతగా ఎదగాలనే తపన ప్రారంభం అవుతుంది. ఉద్యోగంలో ఒక్కో మెట్టు పైకి ఎదగడానికి వాస్తు పరంగా కొన్ని తేలికపాటి చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలు ఉద్యోగంలో పైపైకి వెళ్ళటానికి మార్గాన్ని సుగమం చేస్తాయనటంలో సందేహం లేదు. కొత్త సంవత్సరంలో ఉద్యోగులు తమ తమ రంగాల్లో పైకి ఎదగడానికి, ప్రమోషన్లు సంపాదించడానికి ఈ చిట్కాలు తప్పకుండా ఉపకరిస్తాయి. ఈ రోజుల్లో ఉద్యోగ జీవితమంతా ఉరుకులు పరుగులతో నిండి ఉంటోంది. విపరీతమైన ఒత్తిడి, శ్రమ తప్పడం లేదు. ఆఫీసులో పనిచేస్తున్నా, వర్క్ ఫ్రం హోం లో ఉన్నా మానసిక ఒత్తిడి మాత్రం తప్పడం లేదు. ఒత్తిడి లేకుండా మానసికంగా ప్రశాంతంగా ఉంటూ, ఉత్సాహంగా పనిచేస్తూ, ఉద్యోగంలో ప్రమోషన్ సంపాదించాలంటే ఉద్యోగం చేసే చోట ఒక లాఫింగ్ బుద్ధ బొమ్మను పెట్టుకోవడం చాలా మంచిది. పనిచేసే చోట ఈ బొమ్మను ఏ వైపు పెట్టు కున్నా పర్వాలేదు. కనిపిస్తూ ఉంటే చాలు.
ఇనుప కుర్చీ లేదా ఏదైనా లోహపు కుర్చీ వేసుకోవడం కన్నా చెక్క కుర్చీ అయితే మీలో ఉత్సాహం, ఉల్లాసం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇనుప కుర్చీలో కూర్చుని పనిచేస్తే డల్ గా, మందకొడిగా ఉంటుంది. కుర్చీ వెనకవైపు ఎత్తుగా ఉంటే మంచిది. ఉద్యోగ పరంగా ఎన్ని సమస్యలున్నా, ఎన్ని దోషాలు ఉన్నా కొట్టుకుపోతాయి. ముఖ్యంగా ఉద్యోగంలో సకాలంలో ప్రమోషన్లు రావడం, అధికార యోగం పట్టడం వంటివి చోటు చేసుకుంటాయి. ఉత్తర ముఖంగా లేదా ఈశాన్య ముఖంగా కూర్చుంటే ఉద్యోగంలో వేగంగా అభివృద్ధి ఉంటుంది. ఉత్తరం వైపున గానీ, ఈశాన్యం వైపున గానీ ఒక సరస్సు బొమ్మో, జలపాతం బొమ్మో లేక ఏదో ఒక జల సంబంధమైన బొమ్మో ఉంచితే ఉద్యోగంలో శీఘ్రగతిన పురోగతి ఉంటుంది.
కిటికీలు, తలుపులు జాగ్రత్త..
ఉద్యోగం చేసుకునే గదిలో తూర్పు వైపున గానీ, ఉత్తరం వైపున గానీ కిటికీ లేదా తలుపు ఉంటే ఉద్యోగంలో అతి వేగంగా పురోగతి ఉంటుంది. కిటికీ కి లేదా తలుపుకి అడ్డంగా ఏదీ ఉండకూడదు. ఉద్యోగం చేసుకునే గది చతురస్రాకారంలో ఉంటే ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. మీరు పని చేసుకుంటున్న బల్ల మీ నాభికి సమాంతరంగా ఉంటే మానసిక ఒత్తిడి దగ్గరకు రాదు. మీలోని శక్తి సామర్థ్యాలు, సృజనాత్మకత బాగా రాణిస్తాయి. పని చేసుకునే బల్ల శుభ్రంగా ఉండాలి. దాని మీద వస్తువులను చిందరవందరగా పెట్టుకోకూడదు. బల్ల మీద ప్రతి వస్తువును ఒక పద్ధతి ప్రకారం అమర్చాలి. దీనివల్ల మీలోని ఎనర్జీ స్థాయి పెరుగుతుంది. కంప్యూటర్ బల్లను తూర్పు వైపున అమర్చడం మంచిది. దీనివల్ల ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆ బల్ల వెనుక గోడ ఉంటే ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. గోడ మీద గణేశుడి బొమ్మ కానీ, ఇష్ట దైవం బొమ్మ కానీ, ఓం లేదా స్వస్తిక బొమ్మ కానీ ఉంటే ఆత్మవిశ్వాసం ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టి పోదు.
కంప్యూటర్ బల్ల ముందు కూర్చున్నప్పుడు మీ మీద వెలుతురు కానీ, కిరణాలు కానీ పడుతుంటే మీకు టెన్షన్లు ఎక్కువగా ఉంటాయి. పని మీద శ్రద్ధ గానీ, ఏకాగ్రత కానీ ఉండదు. కంప్యూటర్ టేబుల్ మీద లేదా పనిచేసుకునే బల్ల మీద భోజనం చేయడం మంచిది కాదు. దీనివల్ల ఉద్యోగంలో ఎదుగు బొ దుగు ఉండదు. ఇక ఉద్యోగం చేస్తున్న గదిలో ఎటువంటి శబ్దమూ రాకుండా జాగ్రత్త పడండి. ప్లాస్టిక్ వస్తువులు కానీ, విరిగిపోయిన ఫర్నిచర్ కానీ గదిలో లేకుండా ఉంటే మంచిది. వీటివల్ల ఉద్యోగంలో అభివృద్ధి అనేదే ఉండదు. ఉద్యోగంలో కానీ, సంపాదనలో కానీ మెరుగుదల కనిపించదు. ఇరుకు ప్రదేశంలో కూర్చుని పనిచేసినప్పటికీ ఇదే ఫలితం ఉంటుంది. ఉద్యోగం చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితులలోనూ బాసిం పట్టు లేదా పద్మాసనం వేసుకుని కూర్చోకూడదు. దానివల్ల ఉద్యోగం దెబ్బతింటుంది. మీ ప్రతిభ పాటవాలు క్షీణించిపోతాయి.