Guru Purnima 2022: గురు పౌర్ణమి ఎందుకు, ఎలా జరుపుకుంటారో తెలుసా..?

గురువు ఏ విద్య నేర్పినా పూజ్యనీయుడే. సనాతన భారతీయ సంప్రదాయంలో గురువుకు విశేషమైన స్థానం ఉంది. అంతటి ఖ్యాతి గలిగిన గురువును పూజించడానిక విశిష్టమైన రోజును మన పెద్దలు నిర్ణయించారు. అదే గురు పౌర్ణమి. మన దేశంతో..

Guru Purnima 2022: గురు పౌర్ణమి ఎందుకు, ఎలా జరుపుకుంటారో తెలుసా..?
Guru Purnima
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 12, 2022 | 1:40 PM

“వికాసానికి మూల బిందువైన విద్యను బోధించి, తమస్సు తొలగించి, జీవనాన ఉషస్సు వెలిగించి, శాశ్వతమైన తేజస్సు అందించే వాడు గురువు.. అజ్ఞాన చీకట్లను జ్ఞానకాంతులతో పారదోలే దివ్య చైతన్య స్ఫూర్తి గురువు… జ్ఞానశక్తితో, ఉదాత్తమైన యుక్తితో శిష్యుల సందేహాల్ని నివృత్తి చేస్తూ వారి అభ్యున్నతిని ఆకాంక్షించే ఉన్నత మూర్తి గురువు.. విద్యాభ్యాసం ద్వారా హితోపదేశం చేయడమే కాక అభ్యుదయ మార్గాన్ని దర్శింపజేసేవాడే గురువు..”

అటువంటి గురువు ఏ విద్య నేర్పినా పూజ్యనీయుడే. సనాతన భారతీయ సంప్రదాయంలో గురువుకు విశేషమైన స్థానం ఉంది. అంతటి ఖ్యాతి గలిగిన గురువును పూజించడానిక విశిష్టమైన రోజును మన పెద్దలు నిర్ణయించారు. అదే గురు పౌర్ణమి. మన దేశంతో పాటు, నేపాల్, భూటాన్‌ దేశాల్లోని హిందువులు, జైనులు, బౌద్ధ మతస్థులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. గురు పౌర్ణమి పండుగ రేపే (జులై 13) కావడంతో ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఎలా జరుపుకుంటారు? అనే చర్చ నెట్టింట సాగుతోంది. ఈ పర్వదినాన విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గౌరవ భావంతో సత్కరించుకోవడం, కృతజ్ఞతలు తెలుపడానికి సిక్కు మతస్థులు కూడా ప్రతియేట గురు పౌర్ణమి ఆచారాన్ని కొనసాగిస్తుంటారు.

గురు అంటే ‘చీకటిని పోగొట్టేవాడు’ అని అర్ధం. బౌద్ధమతం ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని సారనాథ్‌లో ఈ రోజునే బుద్ధ భగవానుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చినట్టు నమ్ముతారు. అందుకే దీనికి ‘గురు పూర్ణిమ’ అనే పేరు వచ్చిందనే నానుడి కూడా ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం ఆషాడ మాసంలో పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. మహాభారతాన్ని రచించిన వేదవ్యాస మహర్షి జన్మదినాన్ని పురస్కరించుకుని చాలామంది గురు పౌర్ణమి రోజును ‘వ్యాస పూర్ణిమ’గా జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం.. సత్యవతి, బ్రాహ్మణ ఋషి పరాశరులకు జన్మించిన వేద వ్యాసుడు, ఏడుగురు అమరులలో ఒకరని, ఇప్పటికే గ్రహాలపై సంచరిస్తున్నాడని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

ఏదిఏమైనప్పటికీ గురు పౌర్ణమి రోజున అనేక మంది ఉపవాసం ఉండి తమ గురువులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దేవాలయాలను కూడా సందర్శిస్తుంటారు.