World Population Day 2022: తీవ్ర పోషకాహారలోపంలో భారత్.. 2030 నాటికి మరింత తీవ్రతరం!
పోషకాహార లోపంతో బాధపడుతున్నజనాభా సంఖ్య గత 15 యేళ్లలో 224.3 మిలియన్లకు తగ్గింది. ఇంత విజయం సాధించినా దేశంలో పేదరికం, ఆహార అభద్రత, పోషకాహార లోపం తీవ్రత ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదంటే..
lifestyle changes mostly the eating habits every where: దేశంలో గణనీయంగా పెరుగుతున్న జనాభా వల్ల ప్రధానంగా రెండు రకాల సమస్యలు దేశ జనాభా ఎదుర్కొంటున్నట్లు, తద్వారా రానున్న రోజుల్లో ఈ రెండు కారకాలు తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయని అధ్యయనాలు వెల్లడించాయి. ఒకటి ఉబకాయం, మరొకటి పోషకాహారలోపం. ఈ రోజు (జులై 11)ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) సందర్భంగా దేశాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో ఇవి ముందంజలో ఉన్నట్లు పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి తాజా నివేదికల ప్రకారం.. 1.38 బిలియన్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో ఊబకాయంతో బాధపడుతున్న పెద్దల (adults) సంఖ్య 2012లో 25.2 మిలియన్లు (3.1 శాతం) ఉండగా అది 2016 నాటికి 34.3 మిలియన్ల (3.9 శాతం)కు పెరిగింది. మరోవైపు పోషకాహార లోపంతో బాధపడుతున్నజనాభా సంఖ్య గత 15 యేళ్లలో 224.3 మిలియన్లకు తగ్గింది. ఇంత విజయం సాధించినా దేశంలో పేదరికం, ఆహార అభద్రత, పోషకాహార లోపం తీవ్రత ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు.
పోషకాహార లోపం నుండి ఊబకాయం వైపు.. ఈ ఏడాది ఆరంభంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో కలిసి పనిచేస్తున్న వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారతదేశంలో 2030 నాటికి 27 మిలియన్ల మంది పిల్లలు ఊబకాయంతో బాధపడతారని అంచనా వేసింది. అంటే దేశంలో సగం మంది పిల్లలు, ప్రపంచంలోని ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు మన దేశంలోనే ఉంటారని అభిప్రాయపడింది.
ఆహార అభద్రతలో దేశ జనాభా.. మరోవైపు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) 2019-21 ప్రకారం.. దేశ జనాభా ఆరోగ్యం, పోషకాహార స్థితిలో ఏ మాత్రం మెరుగుదల కనిపించడం లేదు. తాజా గణాంకాల ప్రకారం.. 7.7 శాతం మంది పిల్లలు తీవ్రంగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.19.3 శాతం పిల్లలు బలహీణంగా ఉన్నట్లు, 35.5 శాతం మంది పిల్లలు పెరుగుదల ఆగిపోయిన (గిడసబారిన) స్థితిలో ఉన్నట్లు తెల్పింది. ఇటీవల కాలంలో మన దేశం ధాన్యం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది. అంతేకాకుండా స్థిరమైన ఆర్థిక వృద్ధిని పొందింది. 2019లో దేశంలో 6.2 కోట్ల మంది ప్రజలు ఆహార అభద్రతతో జీవిస్తున్నారు. 2014 – 2019 మధ్య కాలంలో ఇది 3.8 శాతానికి పెరిగింది.
2020లోనైతే దాదాపు 200 మిలియన్ల మంది (20 కోట్లు) పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. కరోనా మహమ్మారి గడ్డుకాలంలో విధించిన లాక్‌డౌన్ వల్ల దేశంలో అనేక ప్రాంతాల్లో ఆహార పంపిణీ వ్యవస్థకు అంతరాయం కలిగింది. తద్వారా ఆహార అభద్రత మరింత దిగజారింది.
రాజస్థాన్‌లోని 211 మంది జనాభా కలిగిన వలస గిరిజనుల్లో మూడింట రెండు వంతుల మందికి తమ గృహాల్లో తగినంత ఆహారం లేదని ఓ అధ్యయనం వెల్లడించింది. వారిలో 97 శాతం మందికి ఆహారం కొనడానికి సరిపడా డబ్బు లేదు. ఢిల్లీ నుంచి చెన్నై వరకు 4,334 కుటుంబాలను సర్వే చేయగా.. 1.7 శాతం సంపన్న కుటుంబాలతో పోలిస్తే పేద కుటుంబాల్లో 8.5 శాతం ఆహార అభద్రతలో జీవిస్తున్నట్లు వివిధ అధ్యయనాల్లో బయటపడింది.
జీవన శైలి ప్రధాన కారణం..
ఫరీదాబాద్‌లోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్ డైరెక్టర్ జనరల్ సర్జరీ డాక్టర్ బ్రహ్మ్ దత్ పాఠక్ మాటల్లో.. గత కొంతకాలంగా జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఆరోగ్యవంతమైన ఆహారానికి బదులు, ఇంటి నుంచి బయటికి పోకుండానే ఫుడ్ ఆర్డర్ల ద్వారా ఉన్నచోటు నుంచే ఆహారాన్ని తెప్పించుకుంటున్నారు. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఎక్కువగా తిని ఇంట్లో కూర్చుంటున్నారు. ఉబకాయం పెరగడానికి ఇంతకంటే పెద్ద కారణం మరొకటి ఉంటుందా? జీవనశైలి మార్పులు ఉబకాయాన్ని పెంచిపోషిస్తున్నాయి. స్థూలకాయం, పోషకాహార లోపం ఈ రెండూ నాణేనికి రెండు ముఖాల వంటివి. ఈ రెండు సమస్యలకు ప్రధాన కారణం పోషకాహార లోపమే. సరైన ప్రొటీన్లు లేకపోవడం, పోషణ అసమతుల్యత ఒక వ్యక్తిని ఊబకాయం వైపు తీసుకెళ్తుంది.
రక్త హీణత మరో సమస్య.. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత సమస్య కూడ పెరుగుతుంది. ఐదేళ్లలోపు పిల్లల్లో రక్తహీణత సమస్య 67.1 శాతంగా ఉండగా, యుక్త వయసు మహిళల్లో 57 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. 2012లో రక్త హీణతతో బాధపడుతున్న15 నుంచి 49 ఏళ్ల వయస్సున్న మహిళల సంఖ్య 171.5 మిలియన్లు ఉండగా.. 2019 నాటికి ఈ సంఖ్య 187.3 మిలియన్లకు పెరిగినట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది.
విద్య ఒక్కటే ఈ పరిస్థితిని మార్చగలదు: డాక్టర్ తల్వార్ నిరక్షరాస్యత నేడు అత్యంత తీవ్రమైన సవాలుగా పరిణమించింది. ప్రజలను విద్యావంతులను చేసి పౌష్టికాహార ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలని డాక్టర్ తల్వార్ అంటున్నారు. ఉద్యోగం చేసే తల్లిదండ్రులు రెడీమేడ్ ఫుడ్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, పేదరికంలో ఉన్న వారికి సరిపడా తిండి దొరకడం లేదని ఆమె అంటున్నారు. ప్రజలు పోషకాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. సమయం ఆదా అవుతుందని నూడుల్స్‌ను ఫుల్ కోర్స్ భోజనంగా అందించకూడదు లేదా ఒకరికి మాత్రమే కావాల్సిన ఆహారాన్ని ఆరుగురికి పంచిపెట్టడం కూడా చేయకూడదు. దురదృష్టవశాత్తూ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నా నేటికీ లబ్ధిదారులకు అందడం లేదని, దీనిపై ప్రభుత్వం ప్రభావవంతమైన ప్రణాళికలతో ప్రజలకు చేరవేయాలని పోషకాహార నిపుణురాలు డాక్టర్ నిషాంత్ తల్వర్ సూచించారు.