AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inter Practicals: ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు ముందు సైన్స్ విద్యార్ధులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఇవి ఫిబ్రవరి నెలలో జరగనున్నాయి. అయితే కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు విద్యార్ధులకు ప్రాక్టికల్స్ నిర్వహించకుండానే వారికి ఫుల్ మార్స్క్ కేటాయించి అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ కీలక నిర్ణయం తీసుకుంది..

Inter Practicals: ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
Inter Practicals
Srilakshmi C
|

Updated on: Dec 26, 2024 | 7:37 AM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 26: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఫిబ్రవరి 3 నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈసారి ఇంటర్ ప్రాక్టికల్స్‌ సీసీ కెమెరాల నిఘా నీడలో నిర్వహించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఇప్పటివరకు విద్యార్థులకు వచ్చిన మార్కులను ఇంటర్‌ బోర్డు పోర్టల్‌లో నమోదుచేసేటప్పుడు మాత్రమే సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగేది. కానీ ఈసారి ప్రాక్టికల్స్‌ నిర్వహించే సుమారు 900 ల్యాబ్‌లలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు.

రాష్ట్రంలో చాలా ప్రైవేటు, కార్పొరేటు కాలేజీలు ప్రాక్టికల్స్‌ చేయించకుండానే అధిక శాతం మంది విద్యార్థులకు పూర్తి మార్కులు ఇస్తున్నాయి. ఈ విషయాలు బయటకు రాకుండా ఆయా కాలేజీల యాజమాన్యాలు అధికారులను ప్రలోభపెట్టి మచ్చిక చేసుకుంటున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు ఇంటర్ బోర్డు సీసీ కెమెరాల నీడలో ప్రాక్టికల్స్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

అలాగే ఇంటర్‌ పరీక్షల నిర్వహణలో కూడా పలుమార్పులు చేయనున్నారు. ఈసారి కొత్తగా ప్రశ్నపత్రాలపై క్యూఆర్‌ కోడ్‌తోపాటు సీరియల్‌ నంబరును సైతం ముద్రించనున్నారు. ఒకవేళ ఏదైనా పరీక్ష కేంద్రం నుంచి పేపర్‌ లీకైతే ఆ సీరియల్‌ నంబరు ఆధారంగా వెంటనే ఏ పరీక్ష కేంద్రం నుంచి పేపర్‌ లీకైందో గుర్తించేందుకు వీలుగా క్యూఆర్‌ కోడ్‌లో వివరాలు పొందుపరచనున్నారు. అలాగే ప్రశ్నపత్రాలు తడవకుండా ఈసారి బండిళ్లను లోడెన్సిటీ పాలీఇథలిన్‌ (ఎల్‌డీపీఈ) బ్యాగుల్లో పంపించనున్నారు. ఒకవేళ వాటిని మధ్యలో విప్పితే మళ్లీ అతకవు. దీంతో లీకైనట్లు గుర్తించవచ్చు. గతంలో ఇంటర్‌ హాల్‌టికెట్లను వారం, పది రోజులు ముందుగా విడుదల చేసేవారు. ఈసారి 4 వారాల ముందుగా జారీ చేయనున్నారు. అంటే ఫిబ్రవరి తొలి వారంలోనే హాల్‌టికెట్లు జారీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు విద్యార్థుల మొబైల్‌ నంబర్లుకు మెజేస్‌ కూడా అందుతుంది. అందుకు విద్యార్థుల నుంచి రెండేసి ఫోన్‌ నంబర్లు తీసుకొని, రెండింటికీ మెసేజ్‌లు పంపనున్నారు. ఏదైనా సమస్య వస్తే విద్యార్థులు ఫోన్లు చేసేందుకు వీలుగా హాల్‌టికెట్లపై హైదరాబాద్‌ ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఉండే పరీక్షల కంట్రోలర్‌తోపాటు ఆయా జిల్లాల ఇంటర్‌ విద్యాధికారు (డీఐఈఓ)ల మొబైల్‌ నంబర్లు పంపించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.