Vijayawada: వైభవంగా శరన్నవరాత్రులు.. లలితాత్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు.. ఉదయం నుంచే భక్తుల రద్దీ..

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు ఇవాళ (శుక్రవారం) ఐదో రోజుకు చేరాయి. వేడుకల్లో భాగంగా అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది...

Vijayawada: వైభవంగా శరన్నవరాత్రులు.. లలితాత్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు.. ఉదయం నుంచే భక్తుల రద్దీ..
Lalitha Tripura Sundari Dev
Follow us

|

Updated on: Sep 30, 2022 | 8:19 AM

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు ఇవాళ (శుక్రవారం) ఐదో రోజుకు చేరాయి. వేడుకల్లో భాగంగా అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఉదయం నుంచే భక్తులు కొండకు పోటెత్తడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. వినాయకుడి గుడి వద్ద నుంచి యాత్రికులు బారులు తీరారు. లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మను దర్శించుకుని భక్తి తన్మయత్వంతో మునిగిపోతున్నారు. త్రిపురాత్రయంలో లలితా త్రిపుర సుందరీదేవి రెండో దేవత. కామేశ్వర స్వరూపంలో కోమలత్వంతో ప్రకాశిస్తుందీ తల్లి. అంతే కాకుండా శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత లలితా త్రిపుర సుందరి. కాంతి స్వరూపంతో, చేతిలో పాశం, అంకుశం, చెరకు విల్లు, పూలబాణాలు ధరించి భక్తులకు వరద హస్త అభయం అందిస్తుంది. లక్ష్మీ సరస్వతులు వింజామరలతో వీస్తుంటారు. ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు కాత్యాయుని కుమార్తె కాత్యాయని దేవీ (లలిత త్రిపుర సుందరి దేవీ) బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో ఎరుపురంగు చీరను ధరించి నాలుగు భుజములతో సింహవాహనిగా దర్శనమిస్తుంది. చెరుకు గడ, పూలను చేతబూని అభయ మరియు వరముద్రలతో (Kanaka durga) అమ్మవారు భక్తులకు కరుణించనుంది.

కాగా.. దుర్గమ్మ గురువారం అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. సర్వ జీవులకు అన్నం ప్రసాదించే దేవతగా అన్నపూర్ణాదేవి అవతరించింది. ఆమెను దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఒక చేతిలో మాణిక్యపాత్ర, మరో చేతిలో అన్నాన్ని అనుగ్రహించే రత్నాల గరిటె ధరించిన రూపంలో అన్నపూర్ణాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ద్వారకా తిరుమల ఆలయం నుంచి అమ్మవారికి చీర, సారె తీసుకొచ్చి అందజేశారు.

దసరా ఉత్సవాలలో నాలుగో రోజు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు నాలుగు రోజుల్లో రెండున్నర లక్షల మంది భక్తులు తరలివచ్చారు. వివిధ మార్గాల ద్వారా ఆలయానికి రూ.38 లక్షల ఆదాయం వచ్చింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కోలాట నృత్యం భక్తులను ఆకర్షించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..