AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Masam: కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా.?

కార్తిక మాసం వచ్చిందంటే చాలు చాలా మంది ఉసిరి దీపాలను వెలిగిస్తుంటారు. ముఖ్యంగా శివాలయాలు, వైష్ణవ ఆలయాల్లో ఉసిరి దీపాలను వెలిగించడం ఒక ఆచారంగా భావిస్తుంటారు. అయితే కార్తిక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించడం వల్ల కలిగే లాభాలు ఏంటి.? పురాణాల్లో ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

Karthika Masam: కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా.?
Usiri Deepam
Narender Vaitla
|

Updated on: Nov 12, 2024 | 7:46 AM

Share

కార్తిక మాసంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలిసిందే. కార్తిక మాసం వచ్చిందంటే చాలు చాలా మంది శైవ క్షేత్రాల్లో ఉసిరితో దీపాలను వెలిగిస్తుంటారు. ఇక కార్తిక పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఉసిరి వేసుకొని స్నానం చేస్తారననే విషయం తెలిసిందే. అయితే ఉసిరికి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఉంటుందనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా.? ఇంతకీ కార్తిక మాసానికి, ఉసిరి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పురాణాల ప్రకారం ఉసిరి చెట్టును ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తారు. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కష్టాలన్నీ దూరమై మంచి జరుగుతుందని విశ్వసిస్తుంటారు. వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణంలో ఈ విషయాలను వెల్లడించారు. ఇక ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి కూడా ప్రతిరూపమని భావిస్తుంటారు. అందుకే కార్తిక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవీ అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు.

ఇక కార్తిక పౌర్ణమి రోజున ఉసిరి దీపాలను వెలిగించడం ఎంతో మంచిదని చెబుతుంటారు. ఈ రోజు ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే కార్తిక పౌర్ణమి రోజున ఉసిరి దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. కార్తిక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగించే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.

శివాలయం లేదా విష్ణు ఆలయ ప్రాంగణంలో నీటితో శుభ్రం చేసి వరిపిండితో ముగ్గు పెట్టాలి. ముగ్గును పసుపు కుంకుమలతో, పూలతో అలంకరించాలి. తరువాత ఉసిరికాయను తీసుకుని, పై భాగంలో రౌండ్‌గా కట్ చేయాలి. ఆ తర్వాత అందులో నెయ్యిని నింపాలి. ఆ తర్వాత తామర కాడలతో తయారైన వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని పసుపు కుంకుమలతో, అక్షింతలతో అలంకరించాలి. ఇక ఉసిరి దీపాన్ని వెలిగించే సమయంలో ‘ఓం శ్రీ కార్తిక దామోదరాయ నమః’ అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని విశ్వసిస్తారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు తెలిపిన వివరాల ప్రకారం అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్‌ చేయండి..