ప్రాణాపాయంలో ఉన్న కల్నల్‌ను స్వయంగా కాపాడిన శివుడు.. భక్తులుగా మారి గుడి కట్టిన బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ దంపతులు

ఇది నిజంగా రోమాలు నిక్క పొడుచుకొనేలా చేసే నిజ జీవితంలోని జరిగిన సంఘటన, చరిత్రలో నిలిచిన కథ.  అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని ఒక బ్రిటిషర్ కి శివుడు కనిపించాడు. అతనిని అపాయంనుంచి కాపాడాడు. ఆ కల్నల్ దంపతులు భారత దేశంలో గుడి కట్టారు

ప్రాణాపాయంలో ఉన్న కల్నల్‌ను స్వయంగా కాపాడిన శివుడు..  భక్తులుగా మారి గుడి కట్టిన బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ దంపతులు
Follow us

|

Updated on: Feb 08, 2021 | 9:54 PM

Baijnath Mahadev Shiva: హరహర మహాదేవ శంభోశంకరా అంటూ మనసారా స్మరిస్తూ.. గంగను భక్తితో సమర్పించినా తనను కోరి కొలిచిన భక్తులను కాపాడే దేవుడు శివయ్య.. ఈ విషయాన్నీ హిందువులే కాదు.. మనదేశాన్ని పాలించడానికి వచ్చిన కొంత మంది బ్రిటిషర్లు కూడా నమ్మారు. యుద్ధంలో తన ప్రాణాలను స్వయంగా కాపాడిన జంగమయ్యకు ఆ కల్నల్ దంపతులు గుడి కట్టారు.. ఆ గుడి నేటికీ భక్తుల రద్దీతో నిండిపోయి ఉంటుంది. శివుడు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా కొలవబడుతున్నాడు. భారత దేశంలో బ్రిటిషర్లు కట్టిన దేవాలయంగా ఖ్యాతిగాంచిన ఆలయం గురించి తెలుసుకుందాం..!

1879 లో బ్రిటిష్ వాళ్ళు భారత్ ని పరిపాలిస్తున్నప్పుడు వారి సైన్యంలో కల్నల్ మార్టిన్ అనే ఉన్నతాధికారి ఉండేవాడు. ఇప్పటి మధ్యప్రదేశ్ లోని ‘అగర్ మాల్వా’ అనే ప్రదేశంలో మార్టిన్ విధులు నిర్వహించేవాడు. మార్టిన్ కు ఓసారి ఆఫ్ఘనిస్థాన్ కు వెళ్లవలసిన పని పడింది. అక్కడి బ్రటిష్ వారి మీద తిరుగుబాటు చేస్తున్న ఆఫ్ఘన్లను అణచివేయవలసిందిగా..  ప్రభుత్వం ఆయన్ను ఆదేశించింది. తన సైన్యంతో సహా ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్న కల్నల్ మార్టిన్, అక్కడి సైనికులతో వీరోచితంగా పోరాడాడు. నిత్యం పోరులో ఎంతగా తలమునకలై ఉన్నా, అగర్ మాల్వాలో ఉన్న తన భార్య మేరీ కు తన క్షేమ సమాచారాలు తెలియచేస్తూ తప్పకుండా ఉత్తరాలు రాసేవాడు. ఆ యుద్దం ఒక రోజు, రెండు రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది.

కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు. ఆమె పేరు మేరీ. ఇలా కొన్ని రోజుల గడువగా ఆమె కి కొన్నాళ్ళకి కల్నల్ నుండి క్షేమ సమాచారాలు అందడం ఆగిపోయింది. అక్కడ తన భర్త ఎలాంటి ఆపదలో ఉన్నాడో, అసలు బతికున్నాడో లేదో తెలియని వేదనలో మార్టిన్ భార్య మునిగిపోయింది.  ఆమె తీవ్రమైన మనోవేదానికి గురి అయింది. ఎప్పుడు భయంతో, భాధతో తనలో తాను కుమిలి పోతూ ఉండేది.  ఒక రోజు లేడీ మార్టిన్ అగర్ మాల్వాలో తిరుగుతుండగా… ఓ శివాలయం నుంచి మంత్రాలు, శంఖనాదాలు వినిపించాయి. భర్త వియోగంలో ఉన్న ఆమెకి, ఆ పవిత్ర శబ్దాలు ఊరటని అందించాయి.

అయితే మేరీ ఒకరోజు గుర్రం మీద బయటకి వచ్చినప్పుడు బైధ్యానాథ్ గుడి పక్కన నుండి వెళ్తూ వేద మంత్రాలు విని, వెంటనే గుర్రం ఆపి గుడి లోపలికి వెళ్లింది. అక్కడ పూజారులు మహా శివుణ్ణి పూజించడం ఈమె గమనించింది. ఆ పూజారులు  ఈమె మనసులో ఏదో బాధలో ఉందని  గ్రహించి పలకరించారు. ఆ పూజారులు  ఏమైంది తల్లి నీకు అని అడగగనే, వెంటనే ఆమె భర్త ‘కల్నల్ గురించి చెప్పి, భర్త నుండి ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదని, వెంటనే తనకు తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పూజా రులు ఆమెని ఓదారుస్తూ “మహా శివునికి తన భాధని చెప్పుకోమని అన్నారు. మృత్యుంజయుడైన ఆ శివుడు ఆమె భర్తను కాపాడతాడని సూచించారు. ఆమె గుడిలో మహా శివునికి మొక్కీ ఇంటికి వెళ్లింది తర్వాత ఆమె శివున్ని భక్తితో కొలుస్తూ “లఘు రుద్ర మంత్ర జపం 11 రోజులు చేసింది. భక్తితో ఆరాధిస్తూ ఆమె తన భర్తని క్షేమంగా తన దగ్గరికి తీసుకు వస్తే, బైధ్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివునికి మనసులో కోరుకుంది.

11 రోజుల జపం చేసిన తర్వాత, ఆమె కి కల్నల్ నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు ..  తను ప్రాణాపాయ స్థితిలో నుండి బయట పడినట్లు చెప్పాడు. పటాన్స్ మమ్మల్ని చుట్టూ ముట్టి చంపేయబోయారని, మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని, ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని. అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ ఒక భారతదేశపు మహా యోగి వెలుగుతూ కనిపించాడని.  ఆయన పులి చర్మం ధరించి, త్రిశూలం చేతపట్టిన యోగి మాకు అండగా నిలిచాడు. ఆయనను చూసిన వెంటనే శత్రువులు పరుగులు తీశారు. నేను మృత్యువుకి భయపడాల్సిన అవసరం లేదనీ, నీ భార్య నన్ను భక్తితో పూజిస్తోంది ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడడానికి వచ్చానని యోగి అన్నారని ఇంకా విభూతి కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు. ఆయన శక్తికి, తేజస్సుకి పతాన్స్ కూడా వెనుతిరిగి పారిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కోన్నాడు. ఆ ఉత్తరాన్ని చూసి లేడీ మార్టిన్ నోట మాట రాలేదు.

కొన్ని వారాల తర్వాత కల్నల్ మార్టిన్ యుద్ధభూమి నుంచి క్షేమంగాఇంటికి చేరుకున్నారు. ఇక్కడ జరిగిన విషయమంతా ఆయనకు చెప్పింది లేడీ మార్టిన్. అప్పటి నుంచి ఆ దంపతులు ఇద్దరూ శివభక్తులుగా మారిపోయారు. కల్నల్ మరియు మేరీ భైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు. తర్వాత కల్నల్ గుడిలో ఉన్న మహా శివుని రూపం చూసి యుద్ద భూమిలో చూసిన మహా యోగి ఈయనే అని అన్నారు. ఆ శివాలయాన్ని అభివృద్ధి చేయాలని తలపెట్టారు. బైజ్నాథ్ మహాదేవ్ పేరుతో ఉన్న ఆ శివాలయం నిజానికి ఎప్పుడో 13 శతాబ్దం నాటిదని చరిత్రకారులు చెబుతారు. కానీ స్థానికులు మాత్రం అది వేల ఏళ్లనాటిదని నమ్ముతారు. అలాంటి విశిష్టమైన దేవాలయాన్ని మార్టిన్ దంపతులు పునరుద్ధరించాలని అనుకున్నారు. అందుకోసం అప్పట్లోనే 15 వేల రూపాయలని ఆలయానికి విరాళంగా అందించారు. ఆ విరాళానికి స్థానికుల సహకారం తోడై మధ్యప్రదేశ్లోనే అద్భుతమైన శివాలయాలలో ఒకటిగా అగర్ మాల్వా బైజ్నాథ్ ఆలయం నిలిచింది. మార్టిన్ దంపతుల కథ నిజమేనని నిరూపించేందుకు ఇప్పటికీ అక్కడి ఆలయంలో వారి విరాళం గురించిన శిలాఫలకం కనిపిస్తుంది. ఇప్పటికీ బైధ్యానాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్దరి పేర్లు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఒకే ఒక్క గుడి ఇదే. ఈ కథ “Hidden Archeology of India ” అనే పుస్తకంలో ఉంది.

Also Read:

 బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో అన్నదాన కార్యక్రమం పునః ప్రారంభం.. కోవిడ్ నిబంధనలు తప్పనిసరి

: కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే తిరుమలకు పెరుగుతున్న భక్తులు.. పెరిగిన స్వామివారి ఆదాయం