Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deva Deepavali: కాశీ క్షేత్రాన్ని చూడాలంటే దేవ దీపావళి రోజునే చూడాలి.. ఈ ఏడాది దేవ దీపావళి ఎప్పుడు వచ్చింది.. పూజ సమయం ఎప్పుడంటే..

ఈ ఏడాది పండగలు పర్వదినాల జరుపుకునే విషయంలో గందరగోళం నెలకొంది. అదే విధంగా కార్తీక మాసంలోని పౌర్ణమి తిధి విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో దేవ దీపావళి విషయంలో కూడా గందరగోళం నెలకొంది. దీపావళి వలెనే దేవ దీపావళి పండగ కూడా హిందువులకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున సకల దేవతలు దీపావళిని జరుపుకుంటారని నమ్మకం. దేవ దీపావళి రోజున గంగా ఆరతి నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలో 2024 సంవత్సరంలో కార్తీక పౌర్ణమిని అంటే దేవ దీపావళిని ఎప్పుడు జరుపుకోవాలో తెలుసుకుందాం..

Deva Deepavali: కాశీ క్షేత్రాన్ని చూడాలంటే దేవ దీపావళి రోజునే చూడాలి.. ఈ ఏడాది దేవ దీపావళి ఎప్పుడు వచ్చింది.. పూజ సమయం ఎప్పుడంటే..
Dev Deepavali 2024
Follow us
Surya Kala

|

Updated on: Nov 12, 2024 | 8:05 PM

హిందూ మతంలో దేవతలు జరుపుకునే దీపావళి.. దేవ దీపావళికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ పండుగ దీపావళి వెళ్ళిన 15వ రోజు వస్తుంది. పురాణాల ప్రకారం ఈ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఈ రోజున పూజలు చేయడం, వేద మంత్రాలను పఠించడం వల్ల రెట్టింపు ఫలితాలు లభిస్తాయని చెబుతారు. ఈ పండుగ శివుని కుమారుడైన కార్తికేయుని జన్మదినానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. ఈ రోజున దేవతలు స్వర్గం నుంచి భూమికి వచ్చి తమ భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తారని నమ్ముతారు.

భారతదేశంలో దేవ దీపావళిని ప్రధానంగా వారణాసిలోని గంగా నది ఒడ్డున అత్యంత వైభవంగా జరుపుతారు. దేవ దీపావళి రోజున ఆచారాల ప్రకారం మహాదేవుని పూజించిన వ్యక్తీ కోరుకున్న ఫలితాలను పొందుతారని చెబుతారు. అంతే కాకుండా మనసులో భయం కూడా మాయమవుతుంది. ఈ రోజు కార్తీక మాసం పౌర్ణమి తిథి కనుక ఈ రోజున చేసే స్నానం, దాన ధర్మాలు వలన పూర్వీకుల అనుగ్రహం కూడా లభిస్తుంది.

దేవ దీపావళి 2024 ఎప్పుడంటే

హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక పౌర్ణమి తిది నవంబర్ 15 ఉదయం 6.19 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో పౌర్ణమి తిథి నవంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 2.58 గంటలకు ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయ తిథికి ప్రాముఖ్యత ఉంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం దేవ దీపావళి నవంబర్ 15 న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దేవ దీపావళి 2024 శుభ సమయం ఎప్పుడంటే

దేవ దీపావళి పూజ కోసం నవంబర్ 15వ తేదీన 2 గంటల 37 నిమిషాల పాటు శుభ సముయం అందుబాటులో ఉంది. కార్తీక పౌర్ణమి రోజున దేవ దీపావళి వేడుకలను ప్రదోష కాల సమయంలో సాయంత్రం 5:10 నుంచి 7:47 వరకు జరుపుకుంటారు. ఈ శుభ సమయంలో కాశీలోని గంగా ఘాట్ వద్ద దీపాలు వెలిగిస్తారు.

దేవ దీపావళి రోజున ఏమి చేయాలంటే

  1. దేవ దీపావళి రోజున ఉదయాన్నే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలి.
  2. ఈ రోజు గంగా స్నానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు.
  3. దీని తరువాత శుభ్రమైన బట్టలు ధరించి, దీపంలో నెయ్యి లేదా నూనె వేసి వెలిగించండి
  4. ఈ రోజున నియమ నిష్టలతో శివుడిని పూజించండి.
  5. సాయంత్రం దీపం వెలిగించి దీపదానం ఇవ్వండి
  6. అనంతరం శివుడిని పూజించి మంత్రాలు జపించి హారతి ఇవ్వండి.

దేవ దీపావళి ఎందుకు జరుపుకుంటారంటే

హిందూ మత విశ్వాసాల ప్రకారం సకల దేవతలు కార్తీక పూర్ణిమ రోజున దీపావళిని జరుపుకుంటారు, అందుకే ఈ రోజుని దేవ దీపావళి అంటారు. ఈ రోజున త్రిపురాసురుడు అనే రాక్షసుడిని శివుడు సంహరించిన సందర్భంగా దేవతలు స్వర్గంలో దీపాలు వెలిగించి జరుపుకున్నారని.. ఇప్పటికీ దేవతలు దీపాలను వెలిగిస్తారని.. భూమికి వస్తారని చెబుతారు. త్రిపురాసురుడిని సంహరించిన తర్వాత దేవతలందరూ స్వర్గంలో దీపావళి జరుపుకున్నారని నమ్ముతారు. అప్పటి నుంచి దేవ దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.