Dasha Papahara Dashami: రేపు దశపాపహర దశమి .. జేష్ఠశుధ్ద దశమి రోజున గంగా నది స్నానం చేస్తే కలిగే ఫలితం ఏమిటో తెలుసా..
Dasha Papahara Dashami:హిందువుల జీవన విధానంలో ప్రకృతి ఒకభాగం.. ఇక నదులను దేవతలు భావించి పూజిస్తారు.. భారతదేశంలో ముఖ్యంగా హిందువుల జీవితంలో...
Dasha Papahara Dashami:హిందువుల జీవన విధానంలో ప్రకృతి ఒకభాగం.. ఇక నదులను దేవతలు భావించి పూజిస్తారు.. భారతదేశంలో ముఖ్యంగా హిందువుల జీవితంలో గంగానదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే పురాణాల కథనం ప్రకారం ఈ గంగను భగీరధుడు భూమికి తీసుకొచ్చిన రోజు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష దశమిని తెలుస్తోంది. గంగావతరణం జరిగింది జ్యేష్ఠ శుద్ధ దశమి రోజే అని స్మృతి కౌస్తుభం అనే గ్రంథం వివరిస్తుంది. ఈ నాటి హస్తా నక్షత్ర సమయంలో భగీరథుని తపః ఫలితంగా శివుని జటాజూటంనుండి భువికి ఏతెంచింది. ఈరోజును దశపాపహర దశమిగా పేర్కొంటారు. ఈ రోజుకి పది రకాలైన పాపాలను తొలగించే శక్తి ఉందని హిందువుల నమ్మకం. తెలిసీ, తెలియక పాపాలు చేయడం మానవ సహజం. అయితే మనం చేసింది పాపమని, దాని ద్వారా అశుభ ఫలితాలు పొందే ప్రమాదమున్నదని గ్రహించి తొలగించుకోవటం గొప్ప ప్రయత్నం. అటువంటి అవకాశాన్ని కలిగించేదే దశపాపహర దశమి వ్రతం.
పరుషంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, అసంబద్ధమైన మాటలు మాట్లాడటం, సమాజం వినలేని మాటలు మాట్లాడటం – ఈ నాలుగు రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి. తనది కాని ధనము, వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులను చేయటం, ఇతరులకు చెడు చేయాలనుకోవడం ఈ మూడు మానసికంగా చేసే పాపాలు. అర్హత లేనివానికి దానాన్ని ఇవ్వడం, శాస్త్రము ఒప్పని హింసను చేయడం, పర స్త్రీని లేదా పురుషున్ని స్వీకరించడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు. మొత్తం ఇవి పది పాపాలు.
ఈ పది పాపాలను సామాన్య మానవుడు నిత్య జీవితంలో చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అందుకనే ఆ పది పాపాలను తొలగించుకోవాటానికి దశపాపహరదశమి వ్రతం ఆచరించాలని వ్రతనిర్ణయకల్పవల్లి అనే గ్రంథం స్పష్టం చేస్తుంది. నదీ స్నానం అనేది ఈ వ్రతంలో ప్రధాన ఘట్టం.
జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు ఏ నదిలో స్నానం చేసినా విశేషమైన ఫలముంటుంది. ముఖ్యంగా గంగా నదిలో స్నానం చేస్తే గొప్ప విశేషం. కాశీ లోని దశాశ్వమేధ ఘాట్ దీనికి ప్రసిద్ధి. ఈ రోజు గంగా స్నానం పాపాలను తొలగిస్తుంది. గంగకు దగ్గరగా లేని వారు, సమీపంలోని నది, చెఱువు లేదా బావి దగ్గరకు వెళ్లి వ్రతమాచరించాలి.
దశ పాపహరదశమి వ్రత విధానం స్కంద పురాణంలో వివరించబడింది. ప్రతిమ నందు గానీ, కలశమందు గానీ గంగా దేవిని ఆవాహన చేసి పూజించాలి. తెల్లని వస్త్రాలు ఆ తల్లికి సమర్పించి గంగాస్తోత్రం పఠించాలి. ఆ తర్వాత విష్ణు మూర్తిని గానీ, శివుడిని గానీ పూజించాలి.
Also Read: సేంద్రీయ ఎరువులతో భారీ అరిగెలను పండించిన రైతు.. చూడడానికి క్యూ కడుతున్న జనం