Bangladesh: బంగ్లాదేశ్‌లో బయల్పడిన విష్ణుమూర్తి విగ్రహం.. పదే పదే ఆ దేశంలో విష్ణువు మూర్తి విగ్రహాలు ఎందుకు వెలుగులోకి వస్తున్నాయి..
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అఖండ భారత దేశం నుంచి విడిపోయి తూర్పు, పశ్చిమ పాకిస్తాన్ దేశాలు ఏర్పడ్డాయి. కాలక్రమంలో తూర్పు పాకిస్తాన్ భారత దేశం సాయంతో బంగ్లాదేశ్ గా అవతరించింది. అయితే హిందూ ధర్మం ఆనవాళ్ళు నేటికీ ఆయా దేశాల్లో తవ్వకాల్లో బయల్పడుతూనే ఉన్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్‌లోని ఒక చెరువు నుంచి 27 కిలోల బరువున్న పురాతన విష్ణువు విగ్రహం బయటపడింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రదేశాల్లో ఇలాంటి విగ్రహాలు చాలా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్‌లో విష్ణువు మూర్తి విగ్రహాలు పదే పదే భూమి కింద నుంచి ఎందుకు బయటకు వస్తున్నాయనే ప్రశ్న తలెత్తుతోంది?

బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్‌లోని ఒక చెరువు నుండి విష్ణువు విగ్రహం బయటపడింది. చెరువులోని భూమి కింద నుంచి విష్ణువు విగ్రహం దొరకడం.. అది కూడా అత్యంత పురాతన విగ్రహం దొరకడంతో జిల్లాలో ఉత్సుకత వాతావరణం నెలకొంది. అయితే బంగ్లాదేశ్‌లో భూమి నుంచి పురాతన విష్ణువు విగ్రహం బయటపడటం ఇదే మొదటిసారి కాదు. గత 4 సంవత్సరాలలో దేశంలోని 4 వేర్వేరు ప్రాంతాల్లో విష్ణువు విగ్రహాలు దొరికినట్లు నివేదికలు వచ్చాయి.
బంగ్లాదేశ్ వార్తాపత్రిక ప్రథమ్ ఓలో ప్రకారం.. దినాజ్‌పూర్‌లోని నవాబ్‌గంజ్ ప్రాంతంలో చెరువు తవ్వకం జరుగుతోంది. ఈ సమయంలో, 29 అంగుళాలు పొడవు 13 అంగుళాల వెడల్పు గల విష్ణువు విగ్రహం బయటకు వచ్చింది. విగ్రహం బయల్పడిన వెంటనే చెరువు చుట్టూ భారీగా జనం గుమిగూడారు.
విష్ణువు విగ్రహం బరువు 27 కిలోలు.
నివేదిక ప్రకారం ఈ విష్ణు విగ్రహం బరువు 27 కిలోలు. విగ్రహంలో విష్ణువుతో పాటు, లక్ష్మీ దేవి ప్రతిమ కూడా చెక్కబడింది. ఆసక్తికరమైన విషయం ఏమిటనే.. చెరువుని బుల్డోజర్‌తో తవ్వినప్పటికీ.. విగ్రహం ఏ మాత్రం చెక్కు చెదరలేదు. విగ్రహంలో ఏ భాగం కూడా విరిగిపోలేదు.
స్థానిక పోలీసుల కథనం ప్రకారం విష్ణుమూర్తి విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని ట్రెజరీకి పంపారు. ఇక్కడి నుంచి ఈ విగ్రహాన్ని పురావస్తు శాఖకు పంపుతారు. పురావస్తు శాఖ ఈ విగ్రహాన్ని పరిశీలించి, ఈ విగ్రహాన్ని ఎప్పుడు తయారు చేశారో తెలియజేస్తుంది.
2023 సంవత్సరం ప్రారంభంలో బంగ్లాదేశ్‌లోని ఫరీద్‌పూర్‌లో విష్ణువు విగ్రహం కనుగొనబడింది. ఈ విగ్రహం బరువు 32 కిలోలు. ఆగస్టు 2021లో బంగ్లాదేశ్‌లో 1000 సంవత్సరాల నాటి విష్ణువు విగ్రహం కనుగొనబడింది.
విష్ణువు మళ్ళీ మళ్ళీ ఎందుకు బయల్పడుతున్నాడు?
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో విష్ణువు విగ్రహం దొరికిన ప్రదేశంలో, ఒక రాజభవనం ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక హిందూ రాజు నివసించేవాడు. అతను విష్ణువును ఆరాధించేవాడు. అతని రాజభవనం లోని విగ్రహం కాలక్రమంలో చెరువు కిందకి వెళ్లి ఉండవచ్చని చెబుతున్నారు.
1947 కి ముందు బంగ్లాదేశ్ భారతదేశంలో భాగంగా ఉండేది. 1947 నుంచి 1971 వరకు ఈ ప్రావిన్స్ పాకిస్తాన్ పాలనలోకి వచ్చింది. 1971లో బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా గుర్తింపు పొందింది. గతంలో బెంగాలీ హిందూ కుటుంబాల ప్రజలు బంగ్లాదేశ్‌లో నివసించేవారు. విష్ణువు ఆరాధించేవారు. ఆ దేశంలో హిందువుల జనాభా తగ్గడంతో.. అక్కడి దేవాలయాలు ధ్వంసమయ్యాయి. దేవుళ్ళ విగ్రహాలు భూగర్భంలోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఈ విగ్రహాలు భూమి కింద తవ్వకాలు జరిపినప్పుడు బయటకు వస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..