Atla Tadde 2023: పెళ్ళైనవారికే కాదు.. పెళ్లికాని యువతులకు అట్లతద్ది ప్రత్యేకం.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనుక రీజన్ ఏమిటంటే..

అట్లతద్ది ముందు రోజు మహిళలు గోరింటాకు పెట్టుకుంటారు. తెల్లవారు జామున మహిళలు నిద్ర లేచి గోంగూర పచ్చడి తో అన్నం తింటారు. తరవాత ఇరుగుపొరుగు స్నేహితులతో కలిసి అట్లతద్దోయ్ ఆరట్లోయ్ .. ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అంటూ ఆడుతూ పాడుతూ సందడి చేస్తారు. ఉపవాస దీక్ష చేపట్టి.. ఉయ్యాల ఊగుతారు. సాయంత్రం గౌరీ దేవికి పూజ చేసి.. చంద్రుడిని చూస్తారు. అనంతరం 11 అట్లు చొప్పున నైవేద్యంగా పెట్టి.. ముత్తైదువులకు వాయినం ఇస్తారు. 

Atla Tadde 2023: పెళ్ళైనవారికే కాదు.. పెళ్లికాని యువతులకు అట్లతద్ది ప్రత్యేకం.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనుక రీజన్ ఏమిటంటే..
Atla Tadde 2023
Follow us
Surya Kala

|

Updated on: Oct 27, 2023 | 6:44 PM

హిందూ మతంలో అట్లతద్దికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆశ్వయుజ బహుళ తదియనాడు మహిళలు జరుపుకునే ఈ పండగను అట్లతద్ది, ఉయ్యాల పండగ అని , గోరింటాకు పండగ అని తెలుగు వారు జరుపుకుంటే.. ఉత్తరాదివారు కర్వా చౌత్‌ గా జరుపుకుంటారు. అసలు తెలుగువారి విశిష్ట సాంప్రదాయాల్లో  అట్లతద్ది ఒకటి. స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు, మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటూ ఈ రోజున నిర్జల వ్రతాన్ని ఆచరిస్తారు. తద్వారా స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారని విశ్వాసం. అట్లతద్ది వ్రతాన్ని పాటించే సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియ తిథి అక్టోబర్ 31వ తేదీ,  నవంబర్ 1 న మిగులు, తగులుగా వచ్చింది.

ఆశ్వయుజ బహుళ తదియ తిథి అక్టోబర్ 31వ తేదీ రాత్రి 9.30 గంటలకు ప్రారంభమై నవంబర్ 1వ తేదీ రాత్రి 9.19 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలోఈ ఏడాది అక్టోబరు 31 మంగళవారం అట్ల తద్ది పండగను జరుపుకోనున్నారు. వివాహం కాని స్త్రీలు, పెళ్లయిన మహిళలు అట్ల తద్దిని జరుపుకుంటారు.

అట్లతద్ది ముందు రోజు మహిళలు గోరింటాకు పెట్టుకుంటారు. తెల్లవారు జామున మహిళలు నిద్ర లేచి గోంగూర పచ్చడి తో అన్నం తింటారు. తరవాత ఇరుగుపొరుగు స్నేహితులతో కలిసి అట్లతద్దోయ్ ఆరట్లోయ్ .. ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అంటూ ఆడుతూ పాడుతూ సందడి చేస్తారు. ఉపవాస దీక్ష చేపట్టి.. ఉయ్యాల ఊగుతారు. సాయంత్రం గౌరీ దేవికి పూజ చేసి.. చంద్రుడిని చూస్తారు. అనంతరం 11 అట్లు చొప్పున నైవేద్యంగా పెట్టి.. ముత్తైదువులకు వాయినం ఇస్తారు.

ఇవి కూడా చదవండి

పార్వతిదేవీ చేసిన అట్లతద్ది

విశ్వాసాల ప్రకారం అట్లతద్ది పండగను మొదటిసారి పార్వతిదేవి తన భర్త శంకరుడు కోసం చేసిందట.  అప్పటి నుంచి ఈ వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం కొనసాగుతోంది. మరొక కథ ప్రకారం.. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు స్త్రీలందరినీ తమ భర్తల కోసం అట్లతద్ది వ్రతం పాటించమని కోరాడని..  ఆ తర్వాత ఈ సంప్రదాయం ప్రారంభమైందని పౌరాణిక కథ ప్రాచుర్యం పొందింది.

మహిళలు ఉపవాస దీక్ష వెనుక కారణం

పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగిన సమయంలో దేవతలు తమ శక్తినంతా ఉపయోగించినప్పటికీ ఓటమి పాలయ్యారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున భర్తల రక్షణ కోసం దేవతలకు అట్లతద్దిగా భావించి ఉపవాసాన్ని పాటించాలని సూచించాడు. ఇలా  ఉపవాసం చేసిన తర్వాత దేవతలు రాక్షసులను జయించగలిగారని నమ్ముతారు. అప్పటి నుండి ఈ ఉపవాసం భర్తల రక్షణ కోసం స్త్రీలు చేసే సంప్రదాయం కొనసాగుతోంది.

అంతేకాదు ఇందుకు సంబంధించిన కథ మహాభారతంలో కూడా వివరించబడింది. పాండవులను రక్షించేందుకు ద్రౌపది కూడా ఈ వ్రతాన్ని పాటించిందని చెబుతారు. ఈ ఉపవాసం గురించి శ్రీ కృష్ణుడు ద్రౌపతికి సలహా ఇచ్చాడు.

అట్లతద్ది రోజున అట్లు నైవేద్యం వెనుక రీజన్ ఏమిటంటే..

అట్లతద్ది రోజున 11 అట్లను వేసి నైవేద్యంగా గౌరమ్మకు సమర్పిస్తారు. ఇలా చేయడానికి కారణం..  నవగ్రహాల్లోని కుజుడికి అట్లు అంటే ఇష్టమట. అందుకు నైవేద్యంగా అట్లను పెట్టడం వలన కుజుడి అనుగ్రహం కలిగి వివాహం కానీ యువతికి మంచి భర్త లభిస్తాడని విశ్వాసం. అంతేకాదు పెళ్ళైన దంపతుల్లో సంసారం సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని విశ్వాసం.

అట్లను మినుములు, బియ్యం కలిపి వేస్తారు.. మినుములు రాహువుకి .. బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు. కనుక అట్లను దానం ఇవ్వడం వలన గర్భ దోషాలు తొలగుతాయని విశ్వాసం. ఈ అట్లను గౌరీ దేవికి  నైవేద్యంగా సమర్పించడం వలన నవ గ్రహాలు శాంతించి మహిళలు సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.