AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దహన సంస్కారాల తర్వాత వెనక్కి తిరిగి చూడరు ఎందుకో తెలుసా? కరెక్ట్ రీజన్ ఇదే

హిందూ మతంలో దహన సంస్కారాలను 16 ఆచారాల్లో నిర్వహిస్తారు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత దహన సంస్కారాలతో అంతిమ యాత్ర ముగుస్తుంది. అయితే, దహన సంస్కారాలు నిర్వహించిన తర్వాత ఎవరూ కూడా వెనక్కి తిరిగి చూడరు. దహనం తర్వాత కూడా ఆ వ్యక్తి ఆత్మ అక్కడే ఉంటుందని.. తమ వారు ఎవరైనా వెనక్కి చూస్తే ఆ ఆత్మకు మరో లోకం వెళ్లడం ఇబ్బందిగా మారుతుందని పండితులు చెబుతున్నారు.

దహన సంస్కారాల తర్వాత వెనక్కి తిరిగి చూడరు ఎందుకో తెలుసా? కరెక్ట్ రీజన్ ఇదే
Antim Sanskar
Rajashekher G
|

Updated on: Dec 28, 2025 | 4:58 PM

Share

మరణించిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించడం సాధారణ విషయమే. అయితే, అంతిమ సంస్కారాలకు హిందూ మతంలో 16 ఆచారాలున్నాయి. చివరి ఆచారమే దహన సంస్కారం. ఆ తర్వాత శరీరాన్ని వీడిన ఆత్మ తన కొత్త ప్రయాణం మొదలుపెడుతుంది. దహన సంస్కారాలు చేయకుండా ఆత్మ తన పాత గుర్తింపు, బంధువులతో ఉన్న బంధాన్ని, అనుబంధాన్ని దూరం చేయలేమని పండితులు చెబుతారు. అంతిమ సంస్కారంలోనూ కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి.

అలాంటి ఒక సంప్రదాయమే.. మృతదేహాన్ని దహనం చేసిన తర్వాత వెనక్కితిరిగి చూడకపోవడం. దహన సంస్కారాల తర్వాత.. ఆ స్థలం నుంచి బయటికి వెళ్లిపోతూ ఎవరూ కూడా వెనక్కి తిరిగి చూడరు. దీని వెనుక ఓ కారణం కూడా ఉంది.

ఉనికిలోనే ఆత్మ

దహన సంస్కారాల తర్వాత మృత శరీరం చితి మంటల్లో దహనమవుతుంది. కానీ, ఆత్మ ఉనికిలోనే ఉంటుందని అంటారు. ఆత్మను ఆయుధంతో కోయలేమని, అగ్నిలో కాల్చలేమని, నీటిలో తడపలేమని, గాలితో ఎండబెట్టలేమని భగవద్గీత స్పష్టం చేస్తోంది. అందుకే మరణం నుంచి అంత్యక్రియల వరకు అన్ని ఆచారాలను ఆత్మ చూస్తూనే ఉంటుంది.

దహనం తర్వాత వెనక్కి తిరిగి చూడరు ఎందుకంటే?

గరుడ పురాణం ప్రకారం.. మరణం తర్వాత కూడా ఆత్మ తన కుటుంబంతో అనుబంధంగా ఉంటుంది. తన కుటుంబసభ్యుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ మృత శరీరానికి నిప్పుపెట్టడం అంటే ఆత్మను శరీరంతో ఉన్న అనుబంధాన్ని తెంచివేయడమే. శ్మశానవాటిక నుంచి బయటకు వెళ్లే సమయంలో వెనక్కి తిరిగి చూడకుండా ఉంటే.. ఆ ఆత్మ తన కుటుంబంతో ఏదైనా సంబంధం కలిగి ఉండాలనే ఆశను కోల్పోతుంది.

ఒక వ్యక్తి మరణం తర్వాత 13 రోజులపాటు అన్ని ఆచారాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆత్మ తనకు తుది వీడ్కోలు ఎలా ఇస్తున్నారో గమనిస్తుంది. దహన సంస్కారాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఆత్మ మరింత అనుబంధం ఏర్పరచుకుంటుంది. అప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టడంలో ఆత్మ ఇబ్బందిని అనుభవిస్తుంది. అందుకే ఎవరూ వెనక్కి చూడవద్దని చెబుతుంటారు.

Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలు, జ్యోతిషశాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. TV9 తెలుగు దీనిని ధృవీకరించదు.