Mahakumbh 2025: మహా కుంభమేళాకు రానున్న స్టీవ్‌ జాబ్స్‌ భార్య లారెన్‌.. కల్పవస్‌ దీక్షకు సంకల్పం

కామన్‌మేన్ నుంచి కుబేరుడి దాకా ప్రపంచం మొత్తం....ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌ వైపు అడుగులు వేస్తోంది. త్రివేణి గంగలో మునకలు వేసేందుకు లక్షలాదిమంది విదేశీయులు సైతం ఉరకలు వేస్తున్నారు. యాపిల్‌ కో ఫౌండర్‌ స్టీవ్‌ జాబ్స్‌ భార్య లారెన్‌ పావెల్‌ కూడా మహా కుంభమేళాకు తరలి రానున్నారు.

Mahakumbh 2025: మహా కుంభమేళాకు రానున్న స్టీవ్‌ జాబ్స్‌ భార్య లారెన్‌.. కల్పవస్‌ దీక్షకు సంకల్పం
Steve Jobs's Couple
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 10, 2025 | 6:50 AM

మహా కుంభమేళాలో పాల్గొనేందుకు మన దేశం నుంచే కాదు…విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు విదేశీయులు సైతం పెద్దఎత్తున క్యూ కడుతున్నారు. యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ కూడా మహాకుంభ్‌లో పాల్గొని ‘కల్పవస్’ ఆధ్యాత్మిక ఆచారాన్ని పాటించబోతున్నట్లు సమాచారం. లారెన్ పావెల్ జాబ్స్ జనవరి 13న మహాకుంభ్‌కు వస్తారని తెలుస్తోంది. ఆమె నిరంజనీ అఖారాలోని మహామండలేశ్వర స్వామి కలియాశానంద శిబిరంలో జనవరి 29 వరకు బస చేస్తారు. కల్పవస్‌ అంటే నిత్యం గంగలో స్నానం ఆచరిస్తూ, ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం.

183 దేశాల్లో ట్రెండింగ్‌లో కుంభమేళా వెబ్‌సైట్‌

ఇక మహా కుంభమేళా వెబ్‌సైట్‌ 183 దేశాల్లో ట్రెండింగ్‌గా మారింది. కుంభమేళా సమాచారం కోసం దేశవిదేశాల్లోని నెటిజనులు…ఈ వెబ్‌సైట్‌లో సెర్చింగుల మీద సెర్చింగులు చేస్తున్నారు. ఇప్పటికే 33 లక్షలమంది విదేశీయులు ఈ వెబ్‌సైట్‌లో సెర్చ్‌ చేశారు. యూరప్‌, అమెరికా, ఆఫ్రికా దేశాల్లోని లక్షలాదిమంది నెటిజనులు మహా కుంభమేళా వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌కు ఎలా రావాలి, కుంభమేళాలో ఎలా పాల్గొనాలి అనే సమాచారాన్ని వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ఈసారి విదేశాల నుంచి భారీ సంఖ్యలో జనం మహాకుంభ్‌కు తరలిరానున్నారు.

డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ

భక్తుల భద్రత దృష్ట్యా, కుంభమేళా జరిగే ప్రాంతాన్ని డ్రోన్ల ద్వారా పర్యవేక్షించనున్నారు. ఎవరైనా భక్తులు స్నానం చేస్తూ, ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోతే వారిని లైఫ్ బోట్ల ద్వారా రక్షించనున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభమేళాకు రైల్వే శాఖ మూడు వేలకు పైగా రైళ్లను నడుపుతోంది. రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక విధుల్లో నియమితులైన రైల్వే సిబ్బంది క్యూఆర్‌ కోడ్‌లు ఉన్న జాకెట్లను ధరిస్తారు. వీటి సాయంతో భక్తులు డిజిటల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మహా కుంభమేళాలో 50 వేలకు పైగా భద్రతా సిబ్బందిని మోహరిస్తారు. వీళ్లకు కుంభమేళా ప్రాంతంలోని ప్రతి అంగుళాన్ని పర్యవేక్షించగలిగేలా AI ఆధారిత సాధనాలు అందిస్తారు. కుంభమేళా ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. కుంభమేళా ప్రాంతం అంతటా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏఐ ఆధారిత డ్రోన్‌లను కూడా వినియోగించనున్నారు.

ఈ నెల 13న మహా కుంభమేళా ప్రారంభం

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ఈ నెల 13 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు.. 45 రోజులపాటు జరిగే ఈ మహోత్సవానికి అక్కడి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 45 రోజుల్లో 45 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మకర సంక్రాంతి పర్వదినం నుంచి భక్తుల సందడి ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన, సాంస్కృతిక ఉత్సవంగా రికార్డులకెక్కింది ఈ మహా కుంభమేళా.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..