Vaikunta Ekadasi : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామివారు భక్తులను కటాక్షించారు. మహావిష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు వైష్ణవాలయాలకు తరలివస్తున్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో రద్దీ పెరిగింది. మరికాసేపట్లో వైకుంఠ ద్వారదర్శనానికి టోకెన్ తీసుకున్న భక్తులను అనుమతిస్తారు. పదిరోజులపాటు సాగే వైకుంఠద్వార దర్శనాల కోసం వేలాదిగా వస్తున్న భక్తులతతో తిరుమల కొండం కిక్కిరిసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల కొండలు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మలయప్ప స్వామి స్వర్ణరథంపై దర్శనమిస్తారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాభయ్యాయి. ప్రసిద్ధ వైష్ణవాలయాల్లో ఉత్తరద్వారాలు తెరుచుకున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాలకు క్యూ కట్టారు. శ్రీమన్నారాయణుడిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాచలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఉత్తర ద్వారం నుంచి శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనమిస్తున్నారు. మరోవైపు గోదావరి నదిలో శ్రీ సీతారామ చంద్రుల వారు, లక్ష్మణుడు, హనుమంతుడి సమేతంగా హంసవాహనంలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు రాములవారిని దర్శించుకున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
యాదగిరిగుట్టలో గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామి వారు ఉత్తర ద్వార దర్శనం ఇస్తున్నారు. ఉదయం 5:30 గంటలకు నుంచి స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ స్వామి వారికి గరుడు సేవత్సవం, తిరువీధిసేవ నిర్వహించనున్నారు.
అటు, చిన తిరుపతిగా పిలిచే ఏలూరులోని ద్వారకా తిరుమలలో ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్నను భక్తులు దర్శించుకుంటున్నారు. ఉదయాన్నే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోవింద నామ స్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..