Tirumala: శ్రీవారి ఆజ్ఞతోనే అంజనాద్రిలో భూమిపూజ.. వివాదాలు పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ అభివృద్ధికి సహకరించాలని సూచన..
Tirumala: తిరుమలలో స్వామివారి ఆశీస్సులు లేకుండా ఏపనీ సాధ్యం కాదని, శ్రీవారి ఆజ్ఞతోనే అంజనాద్రిలో హనుమంతు (Hanuman)ని జన్మస్థలం అభివృద్ధికి భూమిపూజ చేయగలిగామని విశాఖపట్నం(Visakhaparnam)లోని

Tirumala: తిరుమలలో స్వామివారి ఆశీస్సులు లేకుండా ఏపనీ సాధ్యం కాదని, శ్రీవారి ఆజ్ఞతోనే అంజనాద్రిలో హనుమంతు(Hanuman)ని జన్మస్థలం అభివృద్ధికి భూమిపూజ చేయగలిగామని విశాఖపట్నం(Visakhaparnam)లోని శ్రీ శారదా పీఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి అన్నారు. తిరుమల ఆకాశగంగ వద్ద బుధవారం శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థాన అభివృద్ధికి భూమిపూజ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన ఆర్కిటెక్చరల్ డిజైన్‌ను ప్రదర్శించారు. అదేవిధంగా శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థలం అంజనాద్రి – తిరుమల పేరుతో సిద్ధం చేసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అంజనాద్రి వైశిష్ట్యంపై ఎస్వీబీసీ రూపొందించిన దృశ్య శ్రవణ గీతాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి మాట్లాడుతూ తాళ్లపాక అన్నమయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, పురందరదాసులవారు తమ సంకీర్తనల్లో హనుమంతుని జన్మస్థలంపై ఎన్నో ప్రమాణాలను తెలియజేశారని చెప్పారు. అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అనేక వైష్ణవ క్షేత్రాలతో కూడిన భారతదేశంలో అత్యంత పుణ్యభూమి తెలుగు రాష్ట్రాలు మాత్రమేనన్నారు. తెలంగాణలోని కాళేశ్వరం, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి, శ్రీశైలం మూడు ప్రాంతాలను కలిపి త్రిలింగదేశం అంటారని, ఈ ప్రాంతం వేదాలకు పుట్టినిల్లు అని తెలిపారు.
రామభక్తుడైన హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిలో అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషకరమని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానంద సరస్వతీ స్వామి అన్నారు. ఈ క్షేత్రం బాగా అభివృద్ధి చెందుతుందని, హనుమంతుని అనుగ్రహం అందరిపైగా ఉంటుందని చెప్పారు.
వివాదాల జోలికి వెళ్లకుండా ఆలయాన్ని గొప్పక్షేత్రంగా హనుమంతుని జన్మస్థలం అభివృద్ధి చెందాలని టిటిడి అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో ఈ అంజనాద్రి క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేసి భక్తులు శ్రీ బాల ఆంజనేయస్వామి, శ్రీ అంజనాదేవిని దర్శించుకునేలా అన్ని వసతులు కల్పిస్తామన్నారు.
టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి మాట్లాడుతూ హనుమంతుని జన్మస్థలంపై ఈ సమయంలోనే ఎందుకు ప్రకటన చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారని, అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ జరిగిన తరువాతే ఈ జన్మస్థలం గురించి హనుమంతుడు భక్తులకు తెలిపాడని భావిస్తున్నానని చెప్పారు. దీని నేపథ్యం గురించి తెలియజేస్తూ హనుమంతుని జన్మస్థలంగా తిరుమలలోని అంజనాద్రిని గుర్తించాలంటూ పలువురు భక్తులు కొంతకాలంగా లేఖల ద్వారా, ఇ-మెయిళ్ల ద్వారా టిటిడిని కోరుతున్నారని చెప్పారు.
అయోధ్యలోని రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు కోశాధికారి శ్రీశ్రీశ్రీ స్వామి గోవిందదేవ్ గిరి జీ మహరాజ్ మాట్లాడుతూ హనుమత్ శక్తి జాగృతం కావాల్సిన సమయం ఆసన్నమైందని, తద్వారా దుష్టశక్తులు తొలగిపోయి మానవశ్రేయస్సు సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడం సంతోషంగా ఉందని, హనుమంతుని సేవ కోసం శ్రీరాముడే తనను ఇక్కడికి పంపినట్టు భావిస్తున్నానని చెప్పారు. ప్రతి ఇల్లు హనుమంతుని పూజాస్థానమేనని, వివాదాలను పట్టించుకోకుండా అందరూ కలసి కార్యసిద్ధికి పాటుపడాలని కోరారు.
సశాస్త్రీయంగా అంజనాద్రే హనుమంతుని జన్మస్థలం.. శాస్త్రాలు సత్యాన్ని మాత్రమే బోధిస్తాయని, పక్షపాతం లేకుండా శాస్త్రం చెప్పిందే పాటించాలని శ్రీశ్రీశ్రీ రామభద్రాచార్య మహరాజ్ సూచించారు. అంజనాదేవి అంజనాద్రిలో తపస్సు చేసి హనుమంతునికి జన్మనిచ్చినట్టు అష్టాదశ పురాణాలు, రామచరిత మానస్ తదితర గ్రంథాల్లో స్పష్టంగా ఉందని, ఆ ప్రకారం అంజనాద్రే హనుమంతుని జన్మస్థలమని చెప్పారు.
విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ శ్రీ కప్పగంతుల కోటేశ్వర శర్మ మాట్లాడుతూ శౌర్యానికి ప్రతీక అయిన హనుమంతుడు యువతకు ఆదర్శనీయుడని అన్నారు. ప్రస్తుతం యువత సాధన చేస్తున్న కరాటే, జూడో తరహా క్రీడల్లో హనుమంతుడు నిష్ణాతుడని పురాణాల ద్వారా తెలుస్తోందని చెప్పారు. నేటి యువతలో మౌలిక జీవనానికి సంబంధించిన విలువలు తగ్గుతున్నాయని, హనుమంతుని అరాధన ద్వారా వాటిని పెంచుకోవాలని కోరారు.
Also Read:
