AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ గ్రామం ఓ రంగస్థలం.. కళాకారులకు పుట్టినిల్లు.. వేషాలు వేసి అమ్మవారి మొక్కులు తీర్చుకునే గ్రామస్తులు

మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా అమ్మవార్లకు మొక్కుకుంటే ఏ కోడినో..మేకనో..కొబ్బరికాయ కొట్టడం మొక్కుకోవడం సర్వసాధారణం. కానీ అవేవీ కాకుండా వాటన్నిటికీ భిన్నంగా ఆ గ్రామంలో అమ్మవారికి మాత్రం ప్రతి ఏడాది ఆషాడ మాసంలో జరిగే జాతరలో వేషాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మోదుకొండమ్మ అమ్మవారి జాతరలో వింతగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఆ ఊరి ఆచారం..

ఆ గ్రామం ఓ రంగస్థలం.. కళాకారులకు పుట్టినిల్లు.. వేషాలు వేసి అమ్మవారి మొక్కులు తీర్చుకునే గ్రామస్తులు
Modukondamma Jatara
Pvv Satyanarayana
| Edited By: Surya Kala|

Updated on: Jul 24, 2025 | 1:18 PM

Share

ఏదో ఒక వేషధారణ వేస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఆ ఊరి ఆచారం. వివిధ దేశాల్లో స్థిరపడిన వారు, ఎన్నారైలు, ఉద్యోగులు వ్యాపారవేత్తలు, రైతులు సైతం మొక్కుగా మోదుకొండమ్మ తల్లి జాతరలో పాల్గొని వేషధారణ వేసి మొక్కును చెల్లించుకుంటారు. ఇదంతా ఆ గ్రామంలోని కళాకారులు తప్ప వేరే ప్రాంతం నుంచి కళాకారులు ఉండక పోవడం ఒక విశేషం. ఇదంతా ఎక్కడ అంటే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో..

జిల్లాలోని కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం కళాకారులకు నిలయం. ఇక్కడ వేషం వేయనిదే జాతర జరగదు. ఇంటికి ఒక్కరు చొప్పున ప్రతి ఏటా వేషాలు వేయడం ఆనవాయితీ.. గ్రామ ఆచార కట్టుబాట్లు ప్రకారం ఆ గ్రామంలోని వ్యక్తి మాత్రమే వేషం వేయాలి. వేరే ఒకరి కోసం అయినా సరే ఆ గ్రామంలోని బంధువు అయిన వారు మాత్రమే వేషం వేసేందుకు ఇక్కడ కట్టుబాట్లు ఉంటాయి.. అయితే మోదు కొండమ్మ తల్లి జాతర మహోత్సవంలో తెలంగాణలో బోనాలు సమర్పించిన తరహాలో జరగడం ఇక్కడ విశేషం. తొలుత అమ్మవారికి భక్తి శ్రద్దలతో గ్రామ ఆడపడుచులు బోనాలు 2000 మంది పైగా అమ్మవారికి సమర్పిస్తారు.. అనంతరం వారం రోజులు పాటు సాగే జాతర మహోత్సవంలో వివిధ కార్యక్రమాలు చేస్తుంటారు. జాతర ముగింపు రోజున గ్రామంలో ఉన్నా కుటుంబ సభ్యుల్లో ఇంటికొకరు చొప్పున ఒక్కరైనా వేషదారణ వేసి అలరించుకుంటారు.

గ్రామ కట్టుబాట్లు ప్రకారం ఆనవాయితీగా ఈ ఆచారం వస్తుందట. గ్రామంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఉద్యోగం, విద్య, ఆరోగ్య సమస్యలు పై వివిధ రకాల అవసరాలపై అమ్మవారికి మొక్కుకున్న మొక్కులను వేషాల రూపంలో వేషధారణ వేసి గ్రామ పురవీధుల్లో డిజె సాంగ్ లతో కేరింతలతో తిరుగుతారు. కళాకారులకు నిలయంగా ఉన్న శ్రీరంగ పట్నం గ్రామంలో రంగస్థలాన్ని తలపించేలా సుమారు 450 కి పైగా మంది వేషధారణ వేసి విభిన్న పాత్రలతో అలరిస్తారు. అందుకే కళాకారుల నిలయంగా ఆ గ్రామాన్ని పిలుస్తారు. ఏ ఒక్కరూ ఎటువంటి లాభోపేక్ష ఆశించకుండా అమ్మవారి జాతరలో తాము మొక్కు మొక్కుకోకపోయినా వేషం వేస్తూ అమ్మవారి జాతరలో అలరిస్తారు.

ఇవి కూడా చదవండి

గ్రామంలో ఏ సమస్య వచ్చినా అమ్మవారికి చెప్పుకుంటామని, కోరిన కోరికలను తీర్చే కొంగుబంగారమే మా ఊరు ఇలవేల్పుగా అమ్మవారు ఉన్నారని అందుకే ప్రతి ఏడాది జాతరలో మా గ్రామం నుండే వేషాలు వేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఎటువంటి సంఘటనలు జరుగకుండా పోలీసులు, విద్యుత్ శాఖ, రెవెన్యూ అధికారులతో మమేకమై మోదు కొండమ్మ జాతరని ఏటా నిర్వహిస్తామని, అనంతరం అమ్మవారి ఆలయం వద్ద నిప్పుల గుండం తొక్కి జాతర కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..