AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయి.. భారత పర్యటనపై ఇటలీ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని రాసిన నూతన పుస్తకం 'జార్జియాస్ విజన్' (Giorgias Vision) ప్రస్తుతం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పుస్తకంలో ఆమె 2023లో తాను భారతదేశంలో పర్యటించినప్పటి మధుర స్మృతులను ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా న్యూఢిల్లీ వీధుల్లో తన చిరునవ్వుతో కూడిన స్వాగత పోస్టర్లను చూసి, ఇటలీ ఉప ప్రధానమంత్రి ఆంటోనియో తజానీ వేసిన ఒక చమత్కారమైన జోక్‌ను ఆమె ఇందులో ప్రస్తావించారు.

ఢిల్లీలో పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయి.. భారత పర్యటనపై ఇటలీ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు!
Giorgia Meloni With Pm Narendra Modi
Balaraju Goud
|

Updated on: Jun 25, 2026 | 6:11 PM

Share

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని రాసిన నూతన పుస్తకం ‘జార్జియాస్ విజన్’ (Giorgias Vision) ప్రస్తుతం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పుస్తకంలో ఆమె 2023లో తాను భారతదేశంలో పర్యటించినప్పటి మధుర స్మృతులను ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా న్యూఢిల్లీ వీధుల్లో తన చిరునవ్వుతో కూడిన స్వాగత పోస్టర్లను చూసి, ఇటలీ ఉప ప్రధానమంత్రి ఆంటోనియో తజానీ వేసిన ఒక చమత్కారమైన జోక్‌ను ఆమె ఇందులో ప్రస్తావించారు.

ప్రముఖ జర్నలిస్ట్ అలెశాండ్రో సల్లూస్టీతో జరిపిన సంభాషణల ఆధారంగా రూపా పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకంలో.. ప్రపంచ నేతలతో ఆమెకు ఉన్న వ్యక్తిగత బంధాలు, అనధికారిక దౌత్య సంబంధాల గురించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మెలోని 2023లో రెండుసార్లు భారతదేశాన్ని సందర్శించారు. మొదట మార్చిలో జరిగిన 8వ ‘రైసినా డైలాగ్’ కోసం, ఆ తర్వాత సెప్టెంబర్‌లో జరిగిన జి20 (G20) సదస్సు కోసం ఆమె ఢిల్లీ వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీ వీధుల్లో ప్రతి కొన్ని అడుగుల దూరంలో ఆమె ముఖంతో ఉన్న భారీ స్వాగతం పోస్టర్లను చూశారు. ఈ సందర్భంగా తనతో పాటు వచ్చిన ఉప ప్రధాని ఆంటోనియో తజానీ, “ఒకవేళ మీరు ఇక్కడి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం పది లక్షల ఓట్లు సాధిస్తారు” అని చమత్కరించినట్లు మెలోని రాశారు. తాను తిరిగి వెళ్లేటప్పుడు కూడా అవే పోస్టర్లపై సందర్శించినందుకు ధన్యవాదాలు అని రాసి ఉండటం తనను ఆకట్టుకుందని తెలిపారు. ‘‘నేను ఢిల్లీ వీధుల్లో అడుగుపెట్టగానే.. స్వాగత పోస్టర్లు వెలిశాయి. అలా రోడ్డు మీద వెళ్తున్న కొద్దీ అడుగడుగునా కనిపించాయి. అన్ని పోస్టర్లలో ఒకటే ఫొటో.. చాలా అనందంగా అనిపించింది. థ్యాంక్స్‌ టు భారత్‌’’ అంటూ మెలోని రాసుకొచ్చారు.

‘ప్రపంచ మహనీయులలో సగర్వంగా తల ఎత్తుకోవడం’ అనే అధ్యాయంలో ఆమె దౌత్య నీతి గురించి వివరిస్తూ.. విజయవంతమైన అంతర్జాతీయ సంబంధాలకు కఠినమైన లాంఛనాలు మాత్రమే సరిపోవని, ఇతరులతో మనసు విప్పి మాట్లాడే వ్యక్తిగత చొరవ కావాలని పేర్కొన్నారు. కొన్ని చమత్కారాలు, వ్యక్తిగత కథలు, ఉమ్మడి ఆసక్తులు పెద్ద మార్పును తీసుకువస్తాయన్నారు.

ట్యునీషియా అధ్యక్షుడు కైస్ సయీద్‌తో జరిగిన సమావేశాన్ని ఉదాహరణగా చెప్తూ.. సుదీర్ఘ చర్చల అనంతరం సముద్ర దృశ్యాన్ని చూస్తూ, తాను సంకోచిస్తూనే సిగరెట్ వెలిగించవచ్చా అని అడగ్గా ఆయన ఎంతో సంతోషపడ్డారని, ఆ కాఫీ-సిగరెట్ విరామమే ఇద్దరి మధ్య బలమైన దౌత్య బంధానికి కారణమైందని వెల్లడించారు. అలాగే జపాన్ మాజీ ప్రధాని ఫుమియో కిషిడా హిరోషిమా G7 సదస్సులో తన కుమార్తె గినెవ్రా కోసం “పెద్ద హలో కిట్టి బొమ్మను” బహుకరించడాన్ని, సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్ తన పుట్టినరోజున నారింజ రంగు గులాబీల గుత్తిని పంపడాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు.

అన్నింటికంటే తనను ఎక్కువగా కదిలించిన సంఘటన ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియోయెవ్ నుండి ఎదురైందని మెలోని పేర్కొన్నారు. రోమ్‌లో తమ ద్వైపాక్షిక సమావేశానికి ముందే.. ఆయన మెలోని ఆత్మకథ “ఐ యామ్ జార్జియా” పుస్తకాన్ని ప్రత్యేకంగా ఉజ్బెక్, ఆంగ్ల భాషల్లోకి అనువదించి, అందంగా బైండ్ చేసిన ప్రతిని ఆమెకు బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచారని గుర్తు చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ ముందుమాట రాసిన ఈ విశేష పుస్తకం ‘జార్జియాస్ విజన్’ ధర రూ. 695 కాగా, ప్రస్తుతం ఇది అన్ని ప్రముఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో పాఠకులకు అందుబాటులో ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us