UP CM Yogi meets PM Modi: ప్రధాని నరేంద్ర మోదీతో యూపీ సీఎం యోగి.. గంటకు పైగా ఏకాంత చర్చలు.. కారణం అదేనా?
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్యా పలు కీలక అంశాలపై చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
UP CM Yogi meet PM Narendra Modi: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్యా పలు కీలక అంశాలపై చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానితో భేటీ ముగిశాక 12.30గంటలకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమవనున్నారు యోగి.
హైకమాండ్ పిలుపుతో హస్తినకు వెళ్లిన యోగి ఆదిత్యనాథ్..నిన్న కేంద్ర మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. అదే సమయంలో ప్రధాని మోదీతో నడ్డా సమావేశమయ్యారు. యూపీలో తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించారు. హఠాత్తుగా యోగి ఢిల్లీకి రావడం, వరుస భేటీలపై సస్పెన్స్ కొనసాగుతోంది. యూపీ సీఎంను మారుస్తారని ప్రచారం జరుగుతున్న వేళ ఈ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.
సీఎం యోగి అద్భుతంగా పనిచేస్తున్నారని పార్టీ హైకమాండ్ కితాబిచ్చినప్పటికి లోలోన ఏదో జరుగుతోందన్న వార్తలొస్తున్నాయి. కేబినెట్‌లో మార్పులతో పాటు యూపీ బీజేపీలో కూడా కీలక మార్పులు ఉంటాయని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోవడం , కరోనా నియంత్రణ చర్యల్లో యోగి విఫలమయ్యారని విపక్షాలతో పాటు స్వపక్షం నుంచే విమర్శలు రావడంతో బీజేపీ హైకమాండ్ యూపీపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్ నేతలు లక్నో వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
మరోవైపు వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది బీజేపీ. అందులో భాగంగానే యోగికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కీలక నేత జితిన్ ప్రసాద బీజేపీ గూటికి చేరిన మరుసటి రోజే యోగిని హైకమాండ్ ఢిల్లీకి పిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉతరప్రదేశ్ బీజేపీలో జితిన్ ప్రసాదకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.