T Congress: ఆ కామెంట్స్ సరికాదు.. పార్లమెంట్ ముందు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నిరసన..
ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిరసన తెలిపారు. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పార్లమెంట్ ముందు అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించారు.
భారత రాజ్యాంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజ్యాంగం మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిరసన తెలిపారు. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పార్లమెంట్ ముందు అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ధర్నా చేశామని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా దళిత, గిరిజనులకు హక్కులు దక్కాయని రేవంత్ గుర్తు చేశారు. వారికి కల్పించిన ఆ హక్కులను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
ఇక ఇదే అంశంపై మంగళవారం లోక్ సభలో వాయిదా తీర్మానం ఇస్తామని వెల్లడించారు రేవంత్. పార్లమెంట్ సాక్షిగా దేశంలో ఉన్న అందరి ఎంపీలకు కేసీఆర్ తీరును తెలియజేస్తామన్నారు. ఈ విషయంలో వెనుకడుగు వేయమని.. కాంగ్రెస్ పోరాటం సాగిస్తుందని రేవంత్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి: CM KCR Yadadri visit: శ్రీలక్ష్మీ నరసింహ్మస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్.. ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిశీలన..