AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో నేడు ఆఖరి దశ పంచాయతీ ఎన్నికలు.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 67.75 లక్షల మంది ఓటర్లు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఆఖరి విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి..

ఏపీలో నేడు ఆఖరి దశ పంచాయతీ ఎన్నికలు.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 67.75 లక్షల మంది ఓటర్లు
K Sammaiah
|

Updated on: Feb 21, 2021 | 6:03 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఆఖరి విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కానుంది. తుది విడతలో 161 మండలాల పరిధిలో 2,743 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా మొత్తం 7,475 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతల్లో నిర్వహించేలా నోటిఫికేషన్లు జారీ కావడం తెలిసిందే. ఆఖరి విడతలో 3,299 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ కాగా 554 సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి.

వైఎస్సార్‌ జిల్లాలో రెండు చోట్ల సర్పంచి పదవికి ఒక్కరు కూడా నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఆదివారం 2,743 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆఖరి విడతలో 33,435 వార్డులకుగానూ 10,921 చోట్ల ఏకగ్రీవంగా ముగిశాయి. మరో 91 చోట్ల వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 22,423 వార్డులకు నేడు పోలింగ్‌ జరగనుంది. వార్డు పదవులకు 52,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సాయంత్రం 3.30 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించి అదే రోజు 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.

ఆఖరి విడత పంచాయతీ ఎన్నికలు 28,995 కేంద్రాల్లో నిర్వహిస్తుండగా సుమారు 67.75 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 6,047 సమస్యాత్మక, 4,967 అత్యంత సమస్యాత్మక కేంద్రాలలో ఓటింగ్‌ను ఎస్‌ఈసీ, పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించనున్నారు. పోలింగ్‌ విధులకు 88,091 మంది సిబ్బందిని నియమించగా శనివారం సాయంత్రమే సామగ్రితో ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. పర్యవేక్షణ అధికారులుగా 4,570 మందిని నియమించారు. ఓట్ల లెక్కింపు కోసం 70,829 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు.

Read more:

పంచాయతీ ఎన్నికల చివరి దశలో టీడీపీకి షాక్‌.. ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్న అక్కడి అభ్యర్థులు