Huzurabad by poll: రాష్ట్ర రాజకీయాల చూపు హుజూరాబాద్‌‌ వైపు.. బరిలోకి ఈటల.. పట్టుకు టీఆర్‌‌ఎస్‌‌ ప్రయత్నం..!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ అసెంబ్లీకి త్వరలోనే ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది.

Huzurabad by poll: రాష్ట్ర రాజకీయాల చూపు హుజూరాబాద్‌‌ వైపు.. బరిలోకి ఈటల.. పట్టుకు టీఆర్‌‌ఎస్‌‌ ప్రయత్నం..!
Kcr And Etela Rajendra
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 07, 2021 | 7:23 AM

Huzurabad by poll Politics: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ అసెంబ్లీకి త్వరలోనే ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామాతో 6 నెలల్లో ఎప్పుడైనా ఆ నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఎలక్షన్ వస్తుండటంతో రాష్ట్ర రాజకీయాల చూపు హుజూరాబాద్‌‌పై పడింది.

కేసీఆర్‌‌కు కుడి భుజంగా ఉన్న ఈటల మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌‌ కావడం, వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశమై పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకోవడం, ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌‌ఎస్‌‌కు సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజా తీర్పు కోసం సిద్ధమవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపింది. వచ్చే వారం బీజేపీలో చేరనున్న ఈటల.. కమలం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగనున్నారు.

మరోవైపు, ఇప్పటి నుంచే హుజూరాబాద్ ఉప ఎన్నికపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికను టీఆర్‌ఎస్ అధినేత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. త్వరలో ఆయన కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఇప్పటికే హుజూరాబాద్‌లో కింది స్థాయి కార్యకర్తలు మొదలు టీఆర్ఎస్ నాయకులెవరూ జారిపోకుండా కేసీఆర్ పక్కాగా పావులు కదుపుతున్నారు. ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ నేతలు మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వీరితో పాటు ఇంచార్జీలు కూడా హాజరయ్యారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత్ రావు, ఎమ్మెల్యే లు పెద్ది సుదర్శన్ , అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, సతీష్ బాబు, ఎమ్మెల్సీ లు పల్లా , బస్వరాజు సారయ్య, నారదాసు లక్ష్మణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈనెల 10న నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్ రావు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

అటు టీఆర్ఎస్‌‌కు, ఇటు బీజేపీకి ఈ ఎన్నిక కీలకం కానుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఈ ఎన్నిక కలిసి రానుంది. దుబ్బాక గెలుపు, గ్రేటర్‌‌లో మంచి రిజల్ట్‌‌ రావడంతో ఊపు మీదున్న ఆ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ ఉప ఎన్నిక కాస్త నిరాశ కలిగించింది. ఇప్పుడు ఈటల లాంటి ఉద్యమకారుడు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి బలం పెరిగింది. బీజేపీ నుంచి ఈటల గెలిస్తే ఆ ప్రభావం 2023 వరకు ఉంటుందని నేతలు అనుకుంటున్నారు. టీఆర్ఎస్‌‌ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది.

బీజేపీ నుంచి ఈటల పోటీ ఖాయం కావడంతో ఆయనను ఢీకొనే అభ్యర్థి కోసం టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. మాజీ ఎంపీ, ప్రస్తుతం రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్‌‌ కుమార్‌‌తో పాటు హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు సతీమణి సరోజినిల పేర్లు టీఆర్ఎస్ తరఫున ప్రచారంలో ఉన్నాయి. కరీంనగర్ ఎంపీగా, హన్మకొండ ఎంపీగా వినోద్ పని చేయడంతో నియోజకవర్గంతో ఆయనకు దగ్గరి సంబంధాలున్నాయి. పైగా ఈటలతో పాటు వినోద్ కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌‌తో కలిసి పని చేయడం టీఆర్ఎస్‌‌కు కలిసివస్తుందని అధిష్టానం భావిస్తోంది. సెగ్మెంట్‌‌పై మొదటి నుంచీ పట్టున్న లక్ష్మీకాంతారావు కుటుంబం నుంచి ఒకరిని బరిలో నిలిపితే ఎలా ఉంటుందని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. లక్ష్మీకాంతారావు సతీమణి సరోజిని గతంలో ఎంపీపీగా పని చేశారు. దీంతో ఆమెను బరిలో నిలిపే విషయంపైనా చర్చ కొనసాగుతోంది. వీళ్లతో పాటు గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఈటలకు పోటీ ఇచ్చిన పాడి కౌశిక్‌‌రెడ్డిని టీఆర్ఎస్‌‌లోకి తీసుకొని పోటీలో నిలిపితే ఎలా ఉంటుందని కూడా టీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కూడా టీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

అటు, కాంగ్రెస్ నుంచి కౌశిక్ బరిలో నిలవకపోతే ఆ పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపై పీసీసీ దృష్టి సారించింది. గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్‌‌గా పని చేసిన పోల్నేని సత్యనారాయణరావు, పీసీసీలో కొనసాగుతున్న ప్యాట రమేశ్ కాంగ్రెస్ తరఫున నిలబడేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది.

ఈటలను బర్తరఫ్ చేయగానే హుజూరాబాద్ నియోజకవర్గంలో పట్టు సారించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కార్యకర్తలు ఎవరు చేజారకుండా చర్యలు చేపట్టింది. పార్టీ నుంచి ఎవరూ ఈటల వైపు వెళ్లకుండా కట్టుదిట్టం చేసింది. అదే జిల్లాకు చెందిన బీసీ మంత్రి గంగుల కమలాకర్‌‌ను రంగంలోకి దింపి సర్పంచ్ మొదలు ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, గ్రామ, మండల, పట్టణ అధ్యక్షులందరూ పార్టీ వీడకుండా కమలాకర్ వరుస భేటీ అవుతున్నారు. అలాగే, ఆ నియోజకవర్గంలో ఉన్న పోలీసు, రెవెన్యూ, పంచాయతీ తదితర అధికారులందరినీ బదిలీ చేసింది.

Read Also…  Telangana Cabinet: రేపు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ.. ఆర్థిక వ్యవస్థపై ఫోకస్.. లాక్‌డౌన్ సడలింపు, వ్యవసాయంపైనే ప్రధాన చర్చ!