Telangana Politics 2023: తెలంగాణలో రాజకీయ రణం మొదలైందా.. ఈ పోరు ఆ దిశగానేనా..
Telangana Politics: హుజూరాబాద్ ఉప ఎన్నికే లక్ష్యంగా ఇవి జరుగుతున్నాయా? లేదంటే 2023 అసెంబ్లీ యుద్ధానికి అజెండాను సిద్ధం చేస్తున్నాయా? సరిగ్గా వారం..
ఒకవైపు దళిత బంధు. మరోవైపు రాజకీయ దండోరా. తెలంగాణ పాలిటిక్స్ దళితుల చుట్టూ తిరుగుతున్నాయి. 2014 తర్వాత, 2018 ఎన్నికలకు ముందు రాజకీయ పునరేకీకరణ జరిగింది. ఇప్పుడు పరిణామాలు మళ్లీ ఆ దిశగానే కనిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికే లక్ష్యంగా ఇవి జరుగుతున్నాయా? లేదంటే 2023 అసెంబ్లీ యుద్ధానికి అజెండాను సిద్ధం చేస్తున్నాయా? సరిగ్గా వారం కిందట L.రమణ కారెక్కారు. రెండు రోజుల కిందట కౌశిక్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మోత్కుపల్లి దండోరా వేశారు. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. త్వరలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగబోతున్న వేళ కీలక నేతలంతా కారెక్కుతున్నారు. ఒకవైపు ఈటల చేరికతో బీజేపీలో ఉత్సాహం, మరోవైపు రేవంత్‌కు పీసీసీతో కాంగ్రెస్‌లో జోష్ ఉన్నా నేతలు మాత్రం గులాబీ దళంలోకే క్యూ కట్టడం పొలిటికల్ ఇంట్రస్ట్‌ను పెంచుతోంది.
ఒక దెబ్బకు మూడు పిట్టలన్నట్లు వ్యూహాలకు పదును పెట్టింది గులాబీ దళం. టీఆర్‌ఎస్‌కు అడ్డాగా ఉన్నా హుజూరాబాద్‌ను గెలుచుకోవడం, బీజేపీని, ఈటలను కలిపి దెబ్బకొట్టడం, కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ఎల్.రమణ, కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరి మరింత బలాన్ని పెంచారు.
వీరికి మోత్కుపల్లి కూడా తోడయ్యారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని, మిగిలిన పార్టీల్లోని దళిత నేతలు బయటకు రావాలని దండోరా వేసి మరీ పిలుపునిచ్చారు నర్సింహులు. మరోవైపు హుజూరాబాద్‌లోనే దళిత బంధును మొదలు పెట్టనుండటంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఇలా దళితుల చుట్టూ జరుగుతున్న తెలంగాణ రాజకీయం ఏ తీరానికి చేరుతుందో?