కంటతడి పెట్టిన స్పీకర్‌ పోచారం.. మహిళా దినోత్సవం వేడుకల్లో ఆ పాటతో శాసనసభాపతి భావోద్వేగం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కంటతడి పెట్టారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎక్కిఎక్కి ఏడ్చేశారు. ఎమ్మెల్యే..

కంటతడి పెట్టిన స్పీకర్‌ పోచారం.. మహిళా దినోత్సవం వేడుకల్లో ఆ పాటతో శాసనసభాపతి భావోద్వేగం
Follow us
K Sammaiah

|

Updated on: Mar 09, 2021 | 9:19 AM

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కంటతడి పెట్టారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎక్కిఎక్కి ఏడ్చేశారు. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అపురూపమైనదమ్మ ఆడజన్మ.. పాటను ప్లే చేశారు. తన తల్లి దివంగత పరిగె పాపమ్మను గుర్తు చేసుకుని ఒక్కసారిగా పోచారం ఉద్వేగానికి గురయ్యారు.

తన తల్లి 102 ఏళ్ల వయసులో మరణించారని పోచారం గుర్తు చేసుకున్నారు. ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే తాను ప్రజాసేవకు అంకితమయ్యానని తెలిపారు. తన విజయాల్లో భార్య పుష్పమ్మ పాత్ర కూడా ఎంతో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాలులో మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు.

సృష్టిని ఆరోగ్యంగా ఉంచేది మహిళనే అన్నారు పోచారం. ఓ బిడ్డను అమ్మి మరో బిడ్డకు పెళ్లి చేస్తున్న ఘటనను చూసిన సీఎం కేసీఆర్ ..ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించి కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 9 లక్షల మందికి 6 వేల కోట్ల రూపాయల సహాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల మందికి బీడీ కార్మికులకు పింఛన్లు, 13 లక్షల మందికి వితంతు పింఛన్లు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. మాటలు చెప్పడమే కాదు చేసి చూపించిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. మహిళ సంతోషంగా ఉంటేనే రాష్ట్రమైనా, దేశమైనా బాగుంటాయని పేర్కొన్నారు.

అనంతరం స్త్రీనిధి ద్వారా మంజూరైన 73 కోట్ల చెక్కును జిల్లా సమాఖ్యకు అందజేశారు. అనంతరం పలువురు మహిళలను, ఉద్యోగులను సన్మానించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ దఫెదార్ శోభ, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జిల్లా కలెక్టర్ శరత్, మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ ఇతర అధికారులు, మహిళలు పాల్గొన్నారు

Read More:

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌

విశాఖలో మిన్నంటిన నిరసనలు.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటనతో ఉద్యమం ఉధృతం

విద్యారంగంలో తెలంగాణపై కేంద్రం వివక్ష.. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌ అంటే ఇదేనా..? -మంత్రి కేటీఆర్‌