AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో మొత్తం..

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌
K Sammaiah
|

Updated on: Mar 09, 2021 | 8:50 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో మొత్తం 12 నగరపాలక, 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో బుధవారం పోలింగ్‌ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థలో ఎన్నికలపై హైకోర్టు సోమవారం స్టే ఇవ్వడంతో పోలింగ్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఈ కేసులో రాష్ట్ర పురపాలక శాఖ హైకోర్టులో మంగళవారం అప్పీల్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో 75 పురపాలక, నగర పంచాయతీలకు ఎస్‌ఈసీ మొదట నోటిఫికేషన్‌ ఇవ్వగా కడప జిల్లా పులివెందుల, చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన చోట్ల బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే పోలింగ్‌లో 78,71,272 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే 90 నుంచి 95 శాతానికిపైగా ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు. మిగిలినవి మంగళవారం సాయంత్రంలోగా అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

మొత్తం ఓటర్లలో పురుషులు 38,72,264, మహిళలు 39,97,840, ఇతరులు 1,168 మంది కాగా, పురుషుల కంటే మహిళలు 1.6 శాతం ఎక్కువగా ఉన్నారు. 2,215 డివిజన్‌, వార్డు సభ్యుల స్థానాలకు 7,552 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారం రోజులుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన రాజకీయ పార్టీలు సోమవారం సాయంత్రం ముగించాయి. పార్టీ పరంగా నిర్వహిస్తున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 60.49% కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు.

మొత్తం 7,915 పోలింగ్‌ కేంద్రాల్లో సగానికిపైగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నందున భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 2,320 అత్యంత సమస్యాత్మక, 2,468 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా ప్రకటించారు. వీటిలో విజయవాడలోనే అత్యధికంగా 221, విశాఖపట్నంలో 185, గుంటూరులో 139, కడపలో 137, తిరుపతిలో 130, కర్నూలులో 123 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పోలింగ్‌ కోసం 48,723 మంది ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించనున్నారు.

నగరపాలక సంస్థల్లో 21,888, పురపాలక, నగర పంచాయతీల్లో 26,835 మందిని కేటాయించారు. డివిజన్‌, వార్డుల వారీగా ముద్రించిన బ్యాలెట్‌ పత్రాలు, ఇతర సామగ్రితో ఎన్నికల సిబ్బంది మంగళవారం ఉదయం బయల్దేరి తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోనున్నారు. కాగా, విద్యావంతులు, సామాజిక స్పృహ కలిగిన పట్టణ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం సామాజిక బాధ్యతగా భావించి పోలింగ్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సూచించారు.

Read More:

విశాఖలో మిన్నంటిన నిరసనలు.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటనతో ఉద్యమం ఉధృతం

విద్యారంగంలో తెలంగాణపై కేంద్రం వివక్ష.. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌ అంటే ఇదేనా..? -మంత్రి కేటీఆర్‌