విశాఖలో మిన్నంటిన నిరసనలు.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటనతో ఉద్యమం ఉధృతం

విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన ఉధృతరూపం దాల్చింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై విశాఖ..

విశాఖలో మిన్నంటిన నిరసనలు.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటనతో ఉద్యమం ఉధృతం
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 09, 2021 | 9:51 AM

విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన ఉధృతరూపం దాల్చింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇచ్చిన సమాధానంతో విశాఖలోని ఉక్కు కార్మికులు, నిర్వాసితులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. రాత్రి నుంచి విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి.

జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం కూడలి ఉక్కు ప్రధాన ద్వారం వద్ద ఉక్కు ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కార్మికులంతా మానవహారంతో రహదారిని దిగ్బంధించారు. కూర్మన్నపాలెం కూడలిలో ఆందోళనకారులు చేపట్టిన నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ … కేంద్రం ప్రకటన, సీఎం ఫొటోతో ఉన్న ప్రతులను దగ్దం చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా మంగళవారం విశాఖలోని ఉక్కుపరిపాలనా భవనం ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కార్మికుల ఆందోళనతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని కేంద్రం తెగేసిచెప్పింది. అందులో నూటికి నూరు శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి 27న జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో దీనిపై సూత్రప్రాయంగా నిర్ణయించామని వెల్లడించారు. ఉక్కు కర్మాగారంతో పాటు దాని అనుబంధ సంస్థలు, జాయింట్‌ వెంచర్లలో వాటాలను కూడా వ్యూహాత్మకంగా ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. ఈ స్టీల్‌ ప్లాంట్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఈక్విటీ లేదన్నారు. అయితే నిర్దిష్ట అంశాల్లో అవసరమైనప్పుడల్లా రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని లోక్‌సభలో ఆమె తెలిపారు.

వైసీపీ సభ్యులు గొడ్డేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ జోక్యం అవసరమైన అంశాల్లో తప్పకుండా దాని మద్దతు కోరతామన్నారు. విశాఖ ఉక్కును కాపాడాలని జగన్మోహన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని, తాము పోరాడుతున్నామని విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్న సమయంలో నిర్మలా సీతారామన్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కేంద్రం ఈక్విటీని ఉపసంహరించుకోవడం వల్ల పెద్దఎత్తున పెట్టుబడులు ప్రవేశిస్తాయని నిర్మల చెప్పారు.

ఉక్కు ఫ్యాక్టరీ విస్తరణకు, సామర్థ్యం పెంపునకు, అధునాతన టెక్నాలజీ ప్రవేశపెట్టడం, మెరుగైన యాజమాన్య పద్ధతులను అవలంబించ వచ్చని నిర్మల చెప్పారు. దీనివల్ల ఉత్పాదకత పెరగడమే కాక.. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అమ్మకం కోసం నియమ నిబంధనలను ఖరారు చేసే సమయంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, వాటాదారులకు ప్రయోజనం కలిగే విధంగా వ్యవహరిస్తామని.. అందుకు అనుగుణంగా వాటాల కొనుగోలు ఒప్పందంలో తగిన అంశాలను చేరుస్తామని స్పష్టం చేశారు.

Read More:

విద్యారంగంలో తెలంగాణపై కేంద్రం వివక్ష.. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌ అంటే ఇదేనా..? -మంత్రి కేటీఆర్‌

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్.. అప్పీలు పిటిషన్ దాఖలు చేయనున్న పురపాలక శాఖ

తెలంగాణలో హీట్ పెంచిన ఎమ్మెల్సీ ఎన్నికలు.. మహిళా దినోత్సవం రోజున ‘గాజు’లతో ఓటర్లకు గాలం!