Chandrababu letter to CM YS Jagan : ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు లేఖ
ఆంధ్ర ప్రదేశ్ లో రైతన్నల దగ్గర్నుంచి ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు దాటినా జగన్ సర్కారు ఉలుకు పలుకు లేకుండా కూర్చుందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు...
Chandrababu letter to CM Jagan : ఆంధ్ర ప్రదేశ్ లో రైతన్నల దగ్గర్నుంచి ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు దాటినా జగన్ సర్కారు ఉలుకు పలుకు లేకుండా కూర్చుందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పంటలు పండించేందుకు తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు ఎవరు కడతారు? అని ఆయన సీఎం ను ప్రశ్నించారు. ఖరీఫ్‌కు పెట్టుబడులు ఎవరు ఇస్తారని చంద్రబాబు అడిగారు. ఒక్క గోదావరి జిల్లాల్లోనే రూ. 2,500 కోట్ల బకాయిలు ఉన్నాయని, ధాన్యం సేకరణలోనూ తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గురువారం లేఖ రాశారు.
ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. మద్దతుధరకు కొనుగోలు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పి.. వారిని నిండా ముంచే విధానాలు అవలంభిస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతల్లో నగదు జమచేసేవారమని అన్నారు.
జగన్ రెడ్డి పాలనలో 21 రోజులకు పెంచిన బకాయిలు పేరుకుపోతున్నాయని మండిపడ్డారు. అటు, రాయలసీమలో మొత్తం వేరుసెనగ పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదన్నారు. మిల్లర్లు, వైసీపీ నాయకులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని చంద్రబాబు తన లేఖలో విమర్శలు గుప్పించారు.