MLA Roja Fire: ఏపీలో పరీక్షల నిర్వహణపై వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం.. చంద్రబాబు, లోకేశ్‌లపై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు
టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాల్సిందేనని తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు ధీటుగా స్పందించారు ఫైర్‌బ్రాండ్, వైసీపీ ఎమ్మెల్యే రోజా.
YCP MLA Roja Slams Chandrababu and Nara Lokesh: టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాల్సిందేనని తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు ధీటుగా స్పందించారు ఫైర్‌బ్రాండ్, వైసీపీ ఎమ్మెల్యే రోజా. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ బాబులపై జబర్దస్త్ సెటైర్లతో విరుచుకుపడ్డారు.
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కి దిమ్మతిరిగే కౌంటరిచ్చారు వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ రోజా. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలంటూ నారా లోకేశ్ చేస్తున్న విమర్శలపై ఆమె ఘాటుగా స్పందించారు. లోకేశ్ తనలాగే రాష్ట్రంలోని విద్యార్థులు కూడా చదువులో మొద్దుల్లాగా వెనకబడిపోవాలని కోరుకుంటున్నట్లు ఉందని రోజా ఎద్దేవా చేశారు. తండ్రి, కొడుకులు ఇద్దరూ తిన్నది అరగక వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని.. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఏమైనా బాధ్యత ఉందా అని ఆమె ప్రశ్నించారు.
కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న సమయంలో రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను సీఎం జగన్ ప్రభుత్వం వాయిదా వేసింది. అయితే, విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని సూచనప్రాయంగా తెలిపింది రాష్ట్ర విద్యాశాఖ. అయితే, పరీక్ష నిర్వహణపై రాష్ట్ర సర్కార్ ఇంకా కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్యే రోజా చెప్పారు. రాష్ట్రంలో పరీక్షలు జరుపుతామనో, జరపబోమనో ఇప్పటికీ సీఎం చెప్పలేదని.. లోకేశ్ ఆ విషయం తెలుసుకోవాలని రోజా హితవు పలికారు. పిల్లల భవిష్యత్తు కోసం పరీక్షలు జరిపేందుకు అనువైన సమయం కోసం సీఎం జగన్ చూస్తున్నారని రోజా అన్నారు. పరీక్షలు లేకపోతే లోకేశ్ లాంటి మొద్దు పిల్లలు సంతోషిస్తారు.. కానీ బాగా చదివే పిల్లలు బాధపడతారని రోజా గుర్తు చేశారు.
అలాగే, పోటీ పరీక్షలు నీట్, ఎంసెట్‌కి ఇంటర్ ప్రాతిపదిక అని.. ఆ పరీక్షలు రద్దు చేస్తే విద్యార్థుల్లో ఉదాసీన వైఖరి ఏర్పడుతుందని రోజా అన్నారు. జగన్‌ను మెంటల్ మామ అని లోకేశ్ విమర్శించడంపై రోజా ఘాటుగా స్పందించారు. ఆయన మెంటల్ మామో.. చందమామో ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు, లోకేశ్‌లకే మెంటల్ అని రోజా ఎదురుదాడికి దిగారు.