తమిళనాడులో వేగంగా మారతున్న పాలిటిక్స్.. సినిమాల్లో హీరోనే, రాజకీయాల్లో కూడా హీరో అవుతాడా?
సినిమాల్లో హీరోనే, రాజకీయాల్లో కూడా హీరో అవుతాడా? జనం ఆయన్ను చూసి వస్తున్నారా..? సిద్దాంతాలు నచ్చి వస్తున్నారా..? అన్న చర్చ తమిళనాట మొదలైంది. పొత్తులపై ఓక్లారిటీ వచ్చినా ఇంకా డోర్లు తెరిచే ఉన్నాయన్న సంకేతాలు దేనికి సంకేతం. పొత్తు రాజకీయాల్లో హీరో పార్టీ డెసిషన్ మారిందా.? సింహం సింగిలే అయితే పొత్తు పొడుపు కథలు ఎందుకు చెబుతున్నట్టు..? తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయమే ఉంది. ఇప్పుడిప్పుడే పొలిటికల్ సమీకరణాలు ఊహించని విధంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా హీరో విజయ్ టీవీకే పార్టీపై ఓ అంచనాకు రాలేకపోతున్నాయట ప్రధాన పార్టీలు. మామూలుగా విజయ్ టీవీకే పార్టీకి పూర్తి స్థాయి రాజకీయ నిర్మాణం లేదు. బూత్ స్థాయి కేడర్ లేదు. అనుభవజ్ఞులైన రాజకీయ నేతల బృందం లేదు. విజయ్ తర్వాత చెప్పుకోదగ్గ మాస్ లీడర్ లేడు. అయినా సర్వేలు మాత్రం టీవీకేకు15 నుంచి 20 శాతం వరకు ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పడమే ప్రధాన పార్టీలకు మింగుడుపడడంలేదు.
అంతేకాదు ఉత్తర తమిళనాడులో వీసీకే, పీఎంకే ఓట్లలో చీలిక రావడం జరిగితే పెద్ద పార్టీలకూ నష్టం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే డీఎంకే, ఏఐఏడీఎంకే రెండూ జాగ్రత్తగా పరిస్థితిని గమనిస్తున్నాయి. అలాగే కమ్యూనిటీ ఓట్ల పరంగానూ టీవీకే పార్టీ ప్రభావం కనిపిస్తోందన్న విశ్లేషణలు వస్తున్నాయి. మైనార్టీ ఓటర్లు ఎక్కువగా డీఎంకే వైపే ఉంటారని అంచనా. అయితే క్రిస్టియన్ ఓటర్లలో ఒక వర్గం విజయ్ పట్ల ఆసక్తి చూపుతోందన్న చర్చ జరుగుతోంది. దీనికి తోడు, మొదటిసారి ఓటు వేయబోయే యువత, పట్టణాల్లో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యువకులు, విజయ్ సభలకు తండోపతండాలుగా తరలిరావడం కూడా ప్రత్యర్ధులకు చెమటలు పట్టిస్తున్నాయి.
ఇక్కడే రాజకీయ పార్టీలకు అసలు సవాల్ ఎదురవుతోంది. డీఎంకేకు ఏఐఏడీఎంకేతో రాజకీయంగా ఎలా పోరాడాలో తెలుసు. బీజేపీతో ఎలా వ్యవహరించాలో తెలుసు. కానీ రాజకీయాన్ని ఒక ఈవెంట్‌లా చూసే ఓ వర్గాన్ని ఎలా ఎదుర్కోవాలో మాత్రం అర్థం కావడం లేదు. కరూర్‌లో విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట తర్వాత ఇది స్పష్టంగా కనిపించింది. ఇతర పార్టీల సభల్లో జరిగే ఘటనలపై వెంటనే చర్యలు తీసుకునే ప్రభుత్వం, కరూర్ ఘటనలో మాత్రం రియాక్షన్ చాలా లేట్‌గా కనిపించింది. కారణం విజయ్ పార్టీపై ఓ అంచనాకు డీఎంకే రాకపోవడమే కారణమంటున్నారు విశ్లేషకులు.
మామూలుగా విజయ్ సభలకు వచ్చే జనాలు పొలిటికల్ ఇంట్రస్ట్‌తో రావడంలేదు. ఆయనను చూడడానికి మాత్రమే వస్తున్నారు. దగ్గరగా ఉండాలని, వీలైతే ఫోటోలు, గట్రా తీసుకోవాలన్న ఆరాటంతో వస్తున్నారే తప్ప, మరో కారణం లేదన్నది విశ్లేషకుల మాట. వారి మాటల్లో చెప్పాలంటే విజయ్ సభలు, లీడర్ -క్యాడర్ సంబంధంగా కాకుండా , హీరో -ఫ్యాన్ మధ్య సంబంధమే. అది భావోద్వేగంతో మొదలై, జనసమూహంగా మారుతోంది. విజయ్ రాజకీయాల్లోకి సిద్దాంతాలతో అయితే రాలేదు. ఒక భావోద్వేగంతో మాత్రమే వచ్చారంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడిదే తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చ గామారింది. అయితే విజయ్ పార్టీ మాత్రం జనసందోహాన్ని చూసి ఎన్నికల్లో తమదే విజయమని చెబుతోంది. ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ పాయింట్, విజయ్ తండ్రి చంద్రశేఖర్ మాటలు. ఓవైపు రాబోయే ఎన్నికల్లో టీవీకే పార్టీదే విజయమని చంద్రశేఖర్ చెబుతూనే, కాంగ్రెస్‌తో కలిస్తే చరిత్ర సృష్టిస్తారని చెప్పడం కొసమెరుపు.
కాంగ్రెస్ పార్టీకి గొప్ప చరిత్ర ఉంది, సంప్రదాయం ఉంది, వారసత్వం ఉంది. కానీ ఇతర పార్టీలకు మద్దతు ఇస్తూ వచ్చిందనే కారణంతో క్రమంగా తన రాజకీయ బలం కోల్పోయింది. ఆ కోల్పోయిన శక్తిని తిరిగి కాంగ్రెస్‌కు ఇవ్వడానికి విజయ్ సిద్ధంగా ఉన్నాడు. కాంగ్రెస్ ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే, మరోసారి చరిత్ర సృష్టించే అవకాశం ఉందని టీవీకే అధినేత విజయ్ తండ్రి చంద్రశేఖర్ అంటున్నారు.
విజయ్ తండ్రి చంద్రశేఖర్ మాటలపై తమిళనాడులో పెద్ద చర్చైతే జరుగుతోంది. మరోవైపు విజయ్ సినిమాల్లోనే హీరోఅని, రాజకీయాల్లో తాము హీరోలమంటున్నారు అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి. కరూర్ ఘటనలో 41మంది చనిపోయారని, వారంతా విజయ్ను చూడటానికి మాత్రమే వచ్చారు కానీ, ఆయన రాజకీయ సిద్దాంతాలు నచ్చికాదన్నారు పళనిస్వామి. ‘అభిమానులు తండోపతండాలుగా రావచ్చు. అలాగని అతను రాజకీయాల్లో హీరో కాదు. జనానికి సేవ చేయాలన్నా, జనం రావాలన్నా నాతోనే సాధ్యం. టీవీకే పార్టీలా నేను పొత్తుల కోసం అటు ఇటు పరుగెట్టడంలేదు.’ AIADMK అధ్యక్షుడు పళనిస్వామి స్పష్టం చేశారు.
మొత్తానికి టీవీకే విజయ్ పార్టీ తమిళనాడు రాజకీయాల్లో గెలిచినా, ఓడినా ప్రభావం మాత్రం ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. మరి చూడాలి పొత్తుల రాజకీయంలో విజయ్ సింగిల్‌గా దిగుతాడా, మింగిలవుతాడా అన్నది వేచి చూడాలి..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
